హైకోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

వైయస్‌ జగన్‌పై జరిగిన దాడిని చూసి రాష్ట్రం నివ్వెరపోయింది

దాడి విషయాన్ని డీజీపీ చాలా తేలిగ్గా తీసుకున్నారు

సీఎం ఘటనను వక్రీకరించి పచ్చి అబద్ధాలు మాట్లాడారు.

కనీసం మానవత్వం లేకుండా సీఎం మాట్లాడారు

వైయస్‌ జగన్‌ను చంద్రబాబు కనీసం ఫోన్‌లైనా పరామర్శించే ప్రయత్నం చేయలేదు

ఎయిర్‌పోర్టులో జరిగిన నేరాల విచారణ కేంద్రం పరిధిలోకి వస్తుంది

వైయస్‌ జగన్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు బాబు విశ్వప్రయత్నాలు

ప్రజాసంకల్ప యాత్రలో వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతల గుండెల్లో రైలు

 
హైదరాబాద్‌: వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటన కేసును ఎన్‌ఐఏకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌పై దాడి జరిగితే చంద్రబాబు మానవత్వం లేకుండా మాట్లాడారని, ఇలాంటి మనస్తత్వం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అన్నారు. వైయస్‌ జగన్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్రా కార్యాలయంలో ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..నూతన సంవత్సరంలో ప్రజలు పాడి పంటలతో సుభీక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం పై రాష్ట్రమంతా నివ్వెరపోయిందన్నారు.

పట్టపగలు ఇంత దారుణం జరుగుతుందా అని ప్రజలు ఆందోళనకు గురయ్యారన్నారు. ప్రభుత్వం మాత్రం చాలా అప్రమత్తంగా ఉండి, ఈ ఘటనను రూటు మార్చిందన్నారు. ప్రతిపక్షంపై జరిగిన దాడి అంటే సాక్షాత్తు ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ప్రజలు భావించారన్నారు. ప్రజా స్వామ్యంలో పాలకపక్ష నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతటి పాత్ర పోషిస్తారో,,ప్రతిపక్ష నాయకుడు కూడా అంతకంటే విలువైన సూచనలు ప్రభుత్వానికి ఇచ్చి, సక్రమంగా పని చేసే విధంగా చూస్తారన్నారు. ఈ ఇద్దరూ కూడా ప్రజాస్యామ్యం దృష్టిలో సరైన, సమానమైన బాధ్యత కలిగిన వ్యక్తులు అన్నారు. అలాంటిది ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే గంటలోపే ప్రభుత్వంలో ఉన్న డీజీపీ చాలా లైట్‌గా స్టేట్‌మెంట్‌ ఇచ్చారన్నారు. దాడి చేసిన వ్యక్తి వైయస్‌ఆర్‌సీపీ అభిమాని అంటూ చాలా తేలికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు. ఆ తరువాత పోలీసుల నుంచి ఎఫ్‌ఐఆర్‌ ఏమీ లేదన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా సుదీర్ఘమైన ప్రెస్‌మీట్‌ పెట్టి హేళనగా మాట్లాడారన్నారు.

జరుగబోయే విచారణకు దిక్సూచీ మాదిరిగా చంద్రబాబు చెప్పారన్నారు. హైదరాబాద్‌కు ఎలా వెళ్లారు..ఇంటికి వెళ్లి ఆసుపత్రికి వెళ్లారని పచ్చి అబద్దాలు, విచారణకు వక్రీకరించే ప్రయత్నం చేశారన్నారు. ప్రజలు ఈ రోజు గమనిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగినప్పుSడు ఆ తీవ్రతను చెప్పాల్సింది డీజీపీ, సీఎం కాదన్నారు. ఎవరు చేశారని చెప్పాల్సింది విచారణలో తేలాలన్నారు. ఒక అవగాహనతో డీజీపీ, సీఎం చెప్పాలన్నారు. హై సెక్యూరీటీ ఉన్న చోట దాడి జరిగితే ఎవరు విచారణ చేయాలో డీజీపీకి తెలియదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దర్యాప్తు సంస్థలే విచారణ చేయాలని ఎవరికైనా తెలుసు అన్నారు. బాధ్యత కలిగిన డీజీపీ, సీఎం అయితే వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించేవారన్నారు. పైగా చంద్రబాబు కనీసం మానవత్వం మరిచిపోయారన్నారు.

కనీసం ఫోన్‌లోనైనా పరామర్శిద్దామన్న ఆలోచన చేయలేదన్నారు. జగన్‌ ఎప్పటికైనా రాజకీయంగా అడ్డు అన్న దుర్మార్గమైన ఆలోచనలో చంద్రబాబు ఉన్నారన్నారు. అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగితే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైయస్‌ రాజశేఖరరెడ్డి వెంటనే తిరుపతి వెళ్లి పరామర్శించారని గుర్తు చేశారు. అక్కడే గాంధీ విగ్రహం వద్ద కూర్చుని నిరసన తెలిపారన్నారు. అలాంటి ఆలోచన చంద్రబాబు చేయకుండా ఘటనను వక్రీకరించే ప్రయత్నం చేశారన్నారు. నిందితులను శిక్షించాలన్న ఆలోచన బాధ్యత గల ముఖ్యమంత్రికి ఉండాలన్నారు. బాధ్యుడు ఎవరైనా సరే రక్షిద్దామన్న తపన చంద్రబాబులో కనిపించిందన్నారు. ఈ ఘటనలో ఏర్పాటు చేసిన సిట్‌ అధికారులు దాడి చేసిన కోణం, దాడి ఎవరు చేయించారు అన్న కోణంలో విచారణ చేయాలన్నారు. పోలీసు కమిషనర్‌ లడ్డా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఒక కోణంలోనే విచారణ చేయించారన్నారు.

కుట్ర కోణంలో విచారణ చేయలేదన్నారు. ఏమి తెలియని కు్రరాడు అక్కడికి ఎలా వచ్చారు. అతనికి ఎయిర్‌పోర్టులో ఎవరు నియమించారని ప్రశ్నించారు. కోడికత్తి అంటూ చంద్రబాబు తన పార్టీ మీటింగ్‌లో ఎబ్బెట్టుగా మాట్లాడారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు ఇవేనా అని నిలదీశారు. 

2009లో అసెంబ్లీలో ఒక ఘటన జరిగిందన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్‌ రాజశేఖరరెడ్డిని చంద్రబాబు ఫినీష్‌ అవుతారని హెచ్చరిస్తే..వైయస్‌ఆర్‌ చిరునవ్వు నవ్వి నిదానంగా సమాధానం  ఇచ్చారన్నారు. ఆ మరుసటి రోజే ఆయన మహానేత మరణించారన్నారు. నాతో ఎవరు పెట్టుకున్నా ఫినిష్‌ అవుతారని చంద్రబాబు మాట్లాడటం దుర్మార్గమన్నారు. వైయస్‌ జగన్‌ వైయస్‌ఆర్‌సీపీ ఏర్పాటు చేసిన తరువాత ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తుంటే..వక్రమార్గంలో ఏవిధంగా అడ్డుకోవాలన్నదే చంద్రబాబు ఆలోచన అన్నారు.

నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉండి 29 సార్లు ఢిల్లీ వెళ్లానని చెప్పే చంద్రబాబు..ఆయన అడిగింది మూడే మూడు విషయాలన్నారు. అసెంబ్లీ స్థానాల పెంపు, వైయస్‌ జగన్‌ను ఎట్లా జైలులో ఉంచాలని ప్రధానికి పట్టుబట్టారన్నారు. ఆ రోజు కాంగ్రెస్‌ నేత శంకర్‌రావు కేసు వేస్తే..అందులో టీడీపీ నేతలను ఇద్దరిని జత చేశారన్నారు. కరుడుగట్టిన ఆలోచన తో వైయస్‌ జగన్‌ పరిపాలనకు రాకుండా చేయాలని ప్రయత్నాలు చేశారన్నారు. 2017 నవంబర్‌  6వ తేదీన ఇడుపులపాయలో ప్రారంభించిన పాదయాత్ర దాదాపు 3600 కిలోమీటర్లు పైగా సాగిందన్నారు.

దారి పొడవునా వేలాది మంది, లక్షలాది జనం ఆయనతో కలిసి నడిచారన్నారు. ఈ అభిమానం చూసి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నారన్నారు. పవన్‌ కళ్యాణ్‌ కోసం వెంపర్లాడుతున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో అభాసుపాలు అయ్యారు కాబట్టి రేపు నీతో కలిసే ప్రయత్నం చేయడం లేదన్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాకూడదని పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారన్నారు. హైకోర్టు ఈ రోజు ఇచ్చిన తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. న్యాయం బయటకు వస్తుందని, న్యాయానికి ఎప్పటికైనా సమాజంలో స్థానం ఉంటుందన్నారు. దీని వెనుక ఉన్న కుట్రదారులందరూ ఎవరో త్వరలోనే తేలిపోతుందన్నారు. హైకోర్టు తీర్పును ప్రజలందరూ స్వాగతిస్తున్నారని చెప్పారు.
 

Back to Top