కూటమి రెండేళ్ల పాలన 'సూపర్ మోసం'.

రాష్ట్రంలో నడుస్తోంది ఐదేళ్ల చంద్రగ్రహణం:

ఆగ్రహం వ్యక్తం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి 

మంచి ఆంధ్రాను 'తాగుదాం ఆంధ్రా'గా మార్చిన బాబు

శ్రీవాణి టిక్కెట్లను రూ.15వేలకు అమ్ముకుంటున్న వైనం

ప్రశ్నిస్తే వైయ‌స్ఆర్‌సీపీ నేతల అక్రమ అరెస్టులు

రాష్ట్రాన్ని జైలుగా మారుస్తారా ?

సూటిగా నిలదీసిన భూమన కరుణాకరరెడ్డి

తల్లికి వందనం అంటే.. 'తల్లికి ఇవ్వం ధనం' అంటున్న బాబు

వైయ‌స్ జగన్ తెచ్చిన కంపెనీలకు చంద్రబాబు రిబ్బన్ కటింగ్

మంచి ఆంధ్రాను  మత్తు ఆంధ్రాగా మార్చిన కూటమి ప్రభుత్వం

కూటమి అరాచక పాలనను కూకటివేళ్లతో పెకిలిస్తాం

ప్రజల తరపున వైయ‌స్ఆర్‌సీపీ  ప్రజా పోరాటం

స్పష్టీకరించిన భూమన కరుణాకరరెడ్డి

తిరుపతి: రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు (730 రోజులు) పూర్తవుతున్న నేపథ్యంలో, ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండానే అన్నీ చేసేశామని డప్పాలు కొట్టుకోవడం సిగ్గుచేటని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం తిరుపతిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 730 రోజులుగా కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలు మోసాలు, అక్రమాలు, అబద్ధాలు, అన్యాయాలు, దౌర్జన్యాలకు గురవుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైయస్ జగన్ హయాంలో రాష్ట్రంలో సంక్షేమ పండుగ నడిస్తే.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాలనలో అంతా సంక్షోభమే తాండవిస్తోందని, రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న ఈ 'చంద్రగ్రహణం' మరో మూడేళ్లు ఉంటుందని హెచ్చరించారు. 'సూపర్ సిక్స్' హామీలను 'సూపర్ మోసం'గా మార్చి, నిరుద్యోగ భృతిని ఎగ్గొట్టి, తల్లికి వందనం పేరుతో నిధులు కట్ చేసి ప్రజలను వంచించారని దుయ్యబట్టారు. కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని కూడా రాజకీయాలకు వాడుకుంటూ, తిరుమలలో రోజుకు 800 శ్రీవాణి టిక్కెట్లను రూ.15 వేలకు అమ్ముకుంటూ దళారీ దందాను నడిపిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా భయపడే ప్రసక్తే లేదని, ఈ ప్రజా వ్యతిరేక పాలనను కూకటివేళ్లతో పెకిలించే వరకు వైయ‌స్ఆర్‌సీపీ ప్రజాక్షేత్రంలో నిరంతరాయంగా పోరాడుతుందని భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే...

కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలు మోసాలు, అక్రమాలు, అబద్ధాలు, అన్యాయాలు, దౌర్జన్యాలకు గురవుతూనే ఉన్నారు. ఈ రెండేళ్ల పాలనంతా పూర్తిగా వైఫల్యం, విధ్వంసం, వైషమ్యం, విద్వేషాల సమాహారంగా మారింది. అనుయాయులకు కాసులు పంచడం, అమాయకులపై అక్రమ కేసులు పెట్టడమే ఈ ప్రభుత్వ ఏకైక విధానంగా మారింది. 

'సూపర్ సిక్స్' కాదు.. అది 'సూపర్ మోసం'

కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు 143 హామీలిచ్చి, అందులో ఒక్కదాన్నీ నెరవేర్చకుండానే నిరంతరం పండగలు చేసుకుంటోంది. గతంలో మహానాడు నిర్వహణకు ఎక్కువ వ్యయం అవుతుందని ఆన్‌లైన్‌లో చేపట్టిన చంద్రబాబు, ఇవాళ రెండేళ్ల సంబరాల పేరిట మూడు ప్రాంతాల్లో ప్రభుత్వ ధనంతో అత్యంత వైభవంగా వేడుకలు చేయడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఇది మంచి ప్రభుత్వం కాదు.. ప్రజలను ముంచే ప్రభుత్వం. 

ఆడబిడ్డ నిధి హామీని అద్దంలో చూసుకోమంటున్నారు.  నిరుద్యోగ భృతి నిత్య అబద్ధపు శృతిగా మారింది. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే నిరుద్యోగులందరికీ రూ.3 వేల భృతి ఇస్తామన్న మాటలు చంద్రబాబుకు రాగం, తానం, పల్లవిలా మారిపోయాయి.   తల్లికి వందనం అంటే.. 'తల్లికి ఇవ్వం ధనం'గా మార్చేశారు.  వైయస్ జగన్ 'అమ్మఒడి'ని పక్కాగా అమలు చేస్తే.. చంద్రబాబు మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి, రెండో ఏడాది ఏకంగా 20 లక్షల మందికి కోతలు విధించి అరకొరగా ఇచ్చారు. బాబు దృష్టిలో తల్లికి వందనం  అంటే 'తల్లికి ఇవ్వం ధనం' అని అర్థం.
 ఉచిత బస్సు కస్సు-బుస్సుగా మారింది. సరిపడా సర్వీసులు లేక 70 శాతం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందడం లేదు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తూ కొత్త బస్సుల్లో ఉచితాన్ని రద్దు చేశారు.

 దీపం పథకం మహిళల పాలిట శాపమైంది. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు చొప్పున రెండేళ్లలో 6 ఇవ్వాల్సి ఉండగా.. కేవలం ఒకటి లేదా రెండు మాత్రమే ఇచ్చి వెలగని దీపాన్ని కానుకగా ఇస్తున్నారు. 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెన్షన్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు 'డోంట్ మెన్షన్' (Don't Mention) అనేలా వ్యవహరిస్తున్నారు.

మంచి ఆంధ్రాను 'తాగుదాం ఆంధ్రా'గా మార్చిన కూటమి ప్రభుత్వం

గత వైయస్ జగన్ హయాంలో 'ఆడుదాం ఆంధ్రా' పేరిట క్రీడలను ప్రోత్సహిస్తే.. చంద్రబాబు ఇవాళ రాష్ట్రాన్ని 'తాగుదాం ఆంధ్రా'గా, మత్తు ఆంధ్రప్రదేశ్, లంచాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి వీధికో బెల్టుషాపు వెలిసింది.  రాష్ట్రంలో కల్తీ మద్యం తాండవిస్తోంది.
అమరావతి పేరుతో ప్రజలను భ్రమల్లో ఉంచి.. కమ్మని కుంభకోణంలో చంద్రబాబు కుటుంబం కుబేరులయ్యారని ధ్వజమెత్తారు. వైయస్ జగన్ తెచ్చిన పరిశ్రమలకు, డేటా సెంటర్లకు చంద్రబాబు కొత్తగా రిబ్బన్లు కట్ చేస్తూ తానే తెచ్చానని ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదం.
"గోల్కండకు ప్లాన్ చేసింది నేనే, చార్మినార్ కట్టించింది నేనే, హుస్సేన్ సాగర్ తవ్వించింది నేనే.. చివరికి బందరుకు సముద్రాన్ని తెచ్చింది కూడా నేనే అని చంద్రబాబు, లోకేష్ లు అనగలరు. దాన్ని నిజమని నమ్మించడానికి ఎల్లో మీడియా (ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5) నిరంతరం విష ప్రచారం చేస్తోంది".
విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్  కంటే ఎక్కువ నటుడైన తన అల్లుడి చేతిలో వెన్నుపోటు పొడిపించుకున్నారని.. టీడీపీ అంటే 'తెలుగు దొంగల పార్టీ. 
మామకు ఒక్కసారే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రజలను మాత్రం నిత్యం వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు.

కలియుగ దైవాన్ని వదల్లేదు.. టీటీడీలో వీఐపీ టిక్కెట్ల మహా దందా!

భగవంతుడిని కూడా తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న ఘనత చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకే దక్కుతుంది. గత రెండేళ్లుగా తిరుమలలో అరాచకాలు, అక్రమాలు జరుగుతున్నా.. తిరిగి వైయస్ జగన్ మీద, నా మీద నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారు.
ఎల్లో మీడియా చేసిన ఆరోపణల్లో రెండేళ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. శ్రీవారి సన్నిధిలో 7,500 వీఐపీ బ్రేక్ దర్శనం  టిక్కెట్లను ఒక్కొక్కటి రూ.4,000 చొప్పున బ్లాక్‌లో అమ్ముకునేలా దళారులకు కొమ్ముకాస్తున్నారు. వైయస్. జగన్ గొప్ప ఆలోచనతో తెచ్చిన శ్రీవాణి ట్రస్ట్ పథకాన్ని గతంలో విమర్శించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీఆర్ నాయుడులు.. ఇవాళ రోజుకు 800 టిక్కెట్లను రూ.10 వేల నుండి ఏకంగా రూ.15 వేలకు పెంచి అమ్ముకుంటున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామిని రాజకీయం కోసం వాడుకుని ఓట్లు దండుకోవడం తప్ప అక్కడ ఒక మంచి పని కూడా చేయలేదు. 

పవన్ కళ్యాణ్ నీతి గురించి మాట్లాడితే జనాలు నవ్వుకుంటున్నారు. పవన్ తన అసంతృప్తిని అణచుకోలేక, అధికారం అందుకోలేక చివరికి అన్నదమ్ముల మధ్య కూడా అగ్గి రాజేస్తున్నాడు. చంద్రధర్మ పరిరక్షకుడైన చంద్రబాబుకు, లోకేష్‌కు పవన్ కళ్యాణ్ ఒక 'తక్షకుడి'లా, బానిసగా మారాడు. స్వజనధర్మం మరిచి లింగపూజకు అంగలు వేస్తున్న మహానుభావుడు పవన్ కళ్యాణ్. ఐదేళ్ల క్రితం సభలో చూపించిన చెప్పులను ఇవాళ తలపై మోస్తాను అన్న అర్థం ప్రజలకు ఇప్పుడు తెలుస్తోంది".ఈ రెండేళ్లలో జరిగింది వెన్నుపోటు.. రానున్న మూడేళ్లు కూడా వెన్నుపోటుతోనే ముగుస్తుంది.

రాష్ట్రాన్ని జైలుగా మారుస్తున్నారు.. వైయ‌స్ఆర్‌సీపీ రాజీలేని పోరాటం.

రాష్ట్రంలో ఏ వర్గమూ సంతృప్తిగా లేదు. 'అన్నదాత సుఖీభవ' కాస్తా 'చంద్రన్న దాతలు సుఖీభవ'గా మారింది. వాలంటీర్లకు రూ.10 వేల జీతం పెంచుతామని చెప్పి నడిసముద్రంలో ముంచేశారు. ఉద్యోగులను బానిసలుగా చూస్తున్నారు, వారికి డీఏలు, పీఆర్సీ బకాయిలు చెల్లించడం లేదు. వైయస్. జగన్ హయాంలో ప్రభుత్వ బడులను రూ.65 వేల కోట్లతో తీర్చిదిద్దితే.. నేడు కూటమి పాలనలో పాఠశాల విద్యకు చంద్రగ్రహణం పట్టించారు. 16 వేల టీచర్ పోస్టుల మెగా డీఎస్సీని కాస్తా 'దగా డీఎస్సీ'గా మార్చి నిరుద్యోగులను మోసం చేశారు.

ప్రజలు, ప్రతిపక్షాలు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ, థర్డ్ డిగ్రీలు ఉపయోగిస్తూ ప్రజలందరికీ ఖైదీ నెంబర్లిచ్చి రాష్ట్రాన్ని ఒక జైలుగా మారుస్తున్నారు. కొంతమంది పోలీసులను గూండాలుగా మార్చారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా భయపడే ప్రసక్తే లేదు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో నిరంతరాయంగా పోరాడుతుంది. ఈ ప్రజా వ్యతిరేక పాలనను కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రజలను ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తాం.

కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పోలీసులను వాడుకుంటూ, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తూ రాష్ట్రాన్ని జైలుగా మార్చాలని చూస్తోందని భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని కుతంత్రాలు చేసినా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బాబు పాలనలో నలిగిపోతున్న మహిళలు, రైతులు, నిరుద్యోగులు మరియు ఉద్యోగుల పక్షాన నిలబడి.. కూటమి ఇచ్చిన ప్రతి హామీ నెరవేరే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం ఆపదని తేల్చిచెప్పారు. శ్రీవారి పవిత్రతను దెబ్బతీస్తూ తిరుమలలో సాగుతున్న టిక్కెట్ల దందాను, రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న మద్యం, ఇసుక అక్రమాలను ప్రజల ముందు ఎండగడతామన్నారు. రెండేళ్ల అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలను చైతన్యవంతులను చేస్తామని, రాబోయే రోజుల్లో ఈ ప్రజావ్యతిరేక కూటమి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి తీరుతామని భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు.

Back to Top