అన్నమయ్య మార్గాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకువస్తాం

 సంక్రాంతి నుంచి దర్శనాల సంఖ్య పెంచుతాం

అర్హత కలిగిన ఉద్యోగులతో టీటీడీ ఐటీ వింగ్ 

టీడీ పాలకమండలి సమావేశంలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

 తిరుమల: అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయాలని సమావేశంలో నిర్ణయించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.  అన్నమయ్య మార్గంలో రోడ్డు, కాలినడక మార్గాలను నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తామని,  త్వరలోనే పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేసి రోడ్డు, కాలినడక మార్గాలను నిర్మిస్తామన్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..  కరోనా మార్గదర్శకాలు సడలించే అవకాశం ఉంటే సంక్రాంతి నుంచి దర్శనాల సంఖ్య పెంచుతాం. దర్శనాల సంఖ్య పెంపుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయాలని నిర్ణయించాం.

తిరుపతిలో ప్రారంభించిన పిడియాట్రిక్ ఆసుపత్రిలో విజయవంతంగా హార్ట్ సర్జరీలు జరుగుతున్నాయి. నెల రోజుల్లో 11 మంది పిల్లల ప్రాణాలు కాపాడాం. పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రిని పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రికి విరాళమిచ్చే దాతలకు ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని నిర్ణయించాం. హనుమ జన్మస్థలమైన ఆకాశగంగను విరాళాల ద్వారా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోవడంతో దెబ్బతిన్న ఆలయాలను పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకున్నాం.

శ్రీవారి ఆలయం ఎదురుగా నిర్మిస్తున్న పరకామణి భవనాన్ని త్వరలో ప్రారంభిస్తాం. పరకామణి‌లో చిల్లర నాణేల ప్యాకింగ్‌కు రూ.2.80 కోట్లతో యంత్రాలు కొనుగోలు చేస్తున్నాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెనుకబడిన ప్రాంతాల్లోని గిరిజనులు, మత్స్యకారులను తీసుకొచ్చి దర్శనాలు చేయించాలని నిర్ణయించాం. శ్రీ వేంకటేశ్వర నామకోటి పుస్తకాలను  ప్రచురించాలని నిర్ణయించాం. కళ్యాణకట్ట క్షురకులకు పీస్ రేట్ రూ.11 నుండి రూ.15 కు పెంచాలని నిర్ణయించాం.

ఎఫ్ఎంస్ కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులతో కమిటీ వేశాం. కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు టీటీడీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సీఎం హామీ మేరకు టీటీడీలో పనిచేసే కార్మికులను ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్‌లో కలిపాం. కాంట్రాక్టర్ కింద పని చేసే కార్మికులను ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో కలపలేం. ఇప్పటి దాకా టీటీడీకి ప్రత్యేకమైన ఐటీ వింగ్ లేదు. టీటీడీ ఐటీ వింగ్ కోసం అర్హత కలిగిన ఉద్యోగులతో ప్రత్యేక టీటీడీ ఐటీ వింగ్ ఏర్పాటు చేస్తాం' అని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 

Back to Top