వైయస్ జగన్‌ పర్యటనపై భయపడుతున్న ప్రభుత్వం

మామిడి రైతులు దూరంగా ఉండాలంటూ బెదిరింపులు

పర్యటన రద్దైనట్లు తప్పుడు ప్రచారం

ఎన్ని ఆటంకాలు కల్పించినా 9న బంగారుపాళ్యం పర్యటన ఖాయం

స్పష్టం చేసిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి 

మామిడి రైతులపై కూటమి సర్కార్ దాష్టీకం

గిట్టుబాటు ధర కల్పించడంలో నిర్లక్ష్యం

నష్టాలు తట్టుకోలేక తోటలను కొట్టేస్తున్న రైతులపై వేధింపులు

16 చెట్లను కొట్టేసిన రైతుకు రూ.12,750 జరిమానా విధింపు

మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం

తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి: చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు వస్తున్న ప్రతిపక్ష నేత, మాజీ సీఎం వైయస్ జగన్ పర్యటనకు అడుగుడుగునా ఆటంకాలు కల్పించేందుకు సిద్దమైందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ జగన్ పర్యటనకు మామిడి రైతులు హాజరుకాకూడదంటూ కూటమి నేతలు బెదిరింపులకు దిగడం వారి దివాలాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. మరోవైపు వైయస్ జగన్ పర్యటన వాయిదా పడిందని, రద్దైనట్లుగా కూటమి నేతలు తప్పుడు ప్రచారానికి దిగారని మండిపడ్డారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా, అనుమతులు ఇవ్వకపోయినా సరే మామిడి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు ఈనెల 9న బంగారుపాళ్యం కు వైయస్ జగన్ రావడం ఖాయమని స్పష్టం చేశారు.

ఇంకా ఆయనేమన్నారంటే...

మామిడి రైతుల కోసం ఈ నెల 9న బంగారుపాళ్యం వస్తున్న నేపథ్యంలో మామిడి రైతులపై కూటమి నాయకులు వేధింపులు ప్రారంభించారు. ఎవరైనా వైయస్ జగన్‌ను కలవడం, తమకు నష్టం జరిగింది, ఈ ప్రభుత్వం ఆదుకోలేదని చెప్పకూడదంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. వైయస్ జగన్‌ను చూసి ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయన పర్యటనకు వెళ్ళే వైయస్ఆర్‌సీపీ నేతలపై క్రిమినల్ కేసులు పెడతారని, రైతులు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలంటూ రైతులను భయపెట్టే ప్రచారం ప్రారంభించారు. కూటమి నేతలు ఎన్ని ఆటంకాలు కల్పించినా ఆయన  పర్యటన ఖచ్చితంగా జరిగే తీరుతుంది. వైయస్ జగన్ వస్తున్నారని తెలియగానే రైతులు పెద్ద ఎత్తున ఆయనను కలిసి, తమ గోడును వెళ్ళబోసుకునేందుకు సిద్దంగా ఉన్నారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో రైతులకు కేజీకి రూ.16 చొప్పున కొనుగోలు చేయించుకునేందుకు అక్కడి ఎన్డీఏ నేతలు కేంద్రం నుంచి హామీని పొందారు. కానీ ఎపీలోని కూటమి ప్రభుత్వం మాత్రం కేంద్రంను ఈ విషయంలో ఒప్పించుకునే సత్తా లేక కనీసం దీనిపై మాట్లాడేందుకు కూడా ముందుకు రావడం లేదు. మామిడి పల్ప్ ఫ్యాక్టరీలతో నామమాత్రంగా సమావేశాలు నిర్వహించి, గొప్పగా మద్దతుధర ఇస్తున్నామని బ్యానర్లు కట్టుకోవడానికే ఈ ప్రభుత్వం పరిమితమైంది.

మామిడి తోటలు తొలగిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు అంటూ వేధింపులు

ఈనెల 4వ తేదీన టి.కుమార్ అనే చిత్తూరు మండలం తుమ్మిండగు గ్రామానికి చెందిన ఒక రైతు మామిడి పండిస్తే సరైన రేటు వచ్చే అవకాశం కనిపించడం లేదు, ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదనే ఆవేదనతో తన తోట లోని మామిడి చెట్లను కొట్టేసి, ఆ భూమిలో ఇతర పంటలను వేసుకోవాలని భావించారు. ఈ విషయం తెలిసి అటవీశాఖ అధికారులు అక్కడికి హుటాహుటిన వెళ్ళి, టి.కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వైయస్ జగన్ వస్తున్నారని తెలిసి, తోటను నరికేసుకుంటున్నావా, ఈ సమయంలో చెట్లు నరికేసుకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది, వెంటనే దీనిని నిలిపివేయాలంటూ సదరు రైతును భయపెట్టారు, వేధించారు. ఆయన తన తోటలో 16 మామిడి చెట్లను కొట్టేశారు. అలా చెట్లు కొట్టేసినందుకు ఆ రైతుపై కక్షతో రూ.12,750 జరిమానా విధించి, వెంటనే చెల్లించాలని బలవంతం చేశారు. దానికి సంబంధించిన జరిమానా డిమాండ్ నోట్‌ను కూడా ప్రజలు చూసేందుకు ప్రదర్శిస్తున్నాం. ఇదీ కూటమి ప్రభుత్వం మామిడి రైతులపై చేస్తున్న అరాచకం. కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేలేని ఈ అటవీశాఖ అధికారులు, నాలుగేళ్ల వయస్సు ఉన్న పదహారు మామిడి చెట్లను నరికేసుకున్నందుకు ఒక రైతుపై రూ.12,750 జరిమానాను విధించడం కక్షసాధింపు కాదా? ఒకవైపు మామిడికి ప్రభుత్వం కనీసం సరైన రేటు కల్పించలేక పోతున్నారు, మరోవైపు మామిడి తోటలను నిర్వహించలేక, నష్టాలను భరించలేక మామిడి చెట్లను తొలగించాలనుకుంటే, ఆ రైతులపై అటవీశాఖ అధికారులతో వేధింపులకు గురి చేస్తున్నారు. ఇదేనా రైతుల పట్ల చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది? రైతుల ఉసురుపోసుకుంటారా? దీనిపై వైయస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తుంటే చంద్రబాబు సహించలేక పోతున్నారు. 

మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిస్తూ...

  • పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడూ నిద్రలేచి, అర్థం లేని వ్యాఖ్యలు చేస్తుంటాడు. ఆయన మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. 
  • వైయస్ జగన్ పర్యటనల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వాలని, భద్రత కల్పించాలని రెండుసార్లు జిల్లా కలెక్టర్‌ను కలిసి లిఖితపూర్వకంగా కోరాం. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా సరే వైయస్ జగన్ జిల్లాకు వచ్చి, మామిడి రైతులను కలిసేది ఖాయం.
Back to Top