మెల్‌బోర్న్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అంటే సంక్షేమం, ప్రజాసేవకు నిలువెత్తు నిదర్శనమని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివ రెడ్డి కొనియాడారు. అస్ట్రేలియా దేశంలోని మెల్‌బోర్న్‌లో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియా వైయస్ఆర్‌సీపీ విక్టోరియా కన్వీనర్ కృష్ణా రెడ్డి, సహ కన్వీనర్ భరత్, సభ్యులు బ్రహ్మ రెడ్డి, సురేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రామాంజి, నాగార్జున నేతృత్వంలో జరిగిన వేడుకల్లో ఎన్ఆర్ఐ గ్లోబల్ కో-ఆర్డినేటర్ ఆలూరు సాంబశివ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి, పార్టీ నేతలు కాసు మహేష్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వర్చవల్‌గా హాజరయ్యారు. విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైయస్ఆర్ విశ్వసనీయత, నమ్మకానికి మారు పేరుగా దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి నిలిచారని ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. వైయస్ఆర్ అనేది పేరు కాదని.. ఓ బ్రాండ్ అని పేర్కొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైయస్ఆర్‌ది. తెలుగు ప్రజల గుండెల్లో మహానేత ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. మహానేత చూపిన మార్గమే మాకు మార్గదర్శనమని, వైయస్ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు కూడా రాజన్న రాజ్యం మళ్లీ రావాలని కోరుకుంటున్నారని, దేవుడు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నానని విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ వేడుకలు మెల్బోర్న్‌లో ఉన్న తెలుగు కమ్యూనిటీకి పునఃప్రేరణనిచ్చాయని కన్వీనర్ కృష్ణారెడ్డి, భరత్ పేర్కొన్నారు.