తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము, కుటుంబ సభ్యులు తాడేపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నకిలీ మద్యం కేసులో అరెస్టై 83 రోజుల పాటు జైలుశిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన జోగి సోదరులు, తమపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, వాటివల్ల తాము, తమ కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులను వైయస్ జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ స్పందిస్తూ, రాజకీయ కక్షతో పెట్టే తప్పుడు కేసులకు వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కేసులను ధైర్యంగా, చట్టబద్ధంగా ఎదుర్కోవాలని సూచించారు. పార్టీ ప్రతి నాయకుడు, కార్యకర్తకు అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. అవసరమైన న్యాయ సహాయం పార్టీ లీగల్ సెల్ ద్వారా పూర్తిస్థాయిలో అందిస్తామని తెలిపారు. అక్రమంగా వేధింపులకు పాల్పడే పాలకుల తీరును ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు వారికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ భేటీలో జోగి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను వైయస్ జగన్ ఆప్యాయంగా తెలుసుకుని, ధైర్యం చెప్పారు. కష్టకాలంలో పార్టీ నేతలకు అండగా ఉంటానని ఆయన భరోసా కల్పించారు.