కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదంతొక్కిన చేనేతలు

నేతన్నలకు అండగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ – “చేనేతల పోరు”కు  విశేష స్పందన

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా : అబద్ధపు హామీలతో అధికారాన్ని దక్కించుకున్న కూటమి ప్రభుత్వం చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేసి వేలాది నేతన్న కుటుంబాలను నాశనం చేసే దిశగా పాలన కొనసాగిస్తోందని ఆరోపిస్తూ, చేనేత-మరమగ్గాల నేతన్నలతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “చేనేతల పోరు” కార్యక్రమం  మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషాశ్రీ చరణ్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు. సోమందేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాదిగా చేనేత కార్మికులు పాల్గొని కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

నేతన్నలకు నిజమైన భరోసా ఇచ్చింది జగనన్నే 
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో “వైయస్ఆర్ నేతన్న నేస్తం” పథకం ద్వారా ప్రతి నేతన్న కుటుంబానికి సంవత్సరానికి రూ.24,000 ఆర్థిక భరోసా కల్పించారని గుర్తు చేశారు. ఆప్కోకు ఉన్న రూ.108 కోట్ల బకాయిలను పూర్తిగా చెల్లించి చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక నాయకుడు వైయస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారేనని అన్నారు. అలాగే 50 సంవత్సరాలు నిండిన ప్రతి నేతన్నకు నూతన పెన్షన్ అమలు చేసి వారికి సామాజిక భద్రత కల్పించారని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వంలో చేనేత రంగం నిర్వీర్యం

కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా, రాష్ట్ర జౌళిశాఖ మంత్రి సవిత చేనేత వ్యవస్థను కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. నేతన్నల సమస్యలను గాలికొదిలేసి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. జగనన్న ప్రభుత్వంలో కేంద్రంతో చర్చించి పట్టు రేషం ధరను రూ.3,500–3,700 మధ్యే నియంత్రించారని, కానీ ఈ కూటమి ప్రభుత్వంలో అదే ధర రూ.6,300 నుంచి రూ.6,500కి పెరిగి నేతన్నలపై భారంగా మారిందన్నారు. పట్టుచీర తయారీలో ఉపయోగించే జెర్రీ రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయని తెలిపారు.

ఉద్యమం ప్రకటించగానే హడావుడి ప్రకటనలు

“చేనేతల పోరు” కార్యక్రమాన్ని ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే జౌళిశాఖ మంత్రి సవిత అమరావతికి వెళ్లి ఏప్రిల్ నుంచి ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించడం, నేతన్నలపై నిజమైన చిత్తశుద్ధి లేకపోవడానికి నిదర్శనమని ఉషాశ్రీ చరణ్ విమర్శించారు. రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు.

నేతన్నల కోసం డిమాండ్లు

  • ఉషాశ్రీ చరణ్  ఈ సందర్భంగా కీలక డిమాండ్లు వెల్లడించారు.
  • కేంద్ర బడ్జెట్లో చేనేత రంగానికి రూ.25,000 కోట్లు కేటాయించాలి
  • రాష్ట్ర బడ్జెట్లో కనీసం రూ.2,000 కోట్లు చేనేత రంగానికి కేటాయించాలి
  • సహకార సంఘాలకు చెల్లించాల్సిన రూ.203 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి
  • ముఖ్యమంత్రి హామీ మేరకు ప్రతి సంవత్సరం రూ.25,000 ఆర్థిక సహకారం ఆలస్యం లేకుండా అందించాలి
  • అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డ చేనేత కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
  • 50 సంవత్సరాలు నిండిన ప్రతి నేతన్నకు నూతన పెన్షన్ వెంటనే అమలు చేయాలి
  • కేంద్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ బోర్డును పునరుద్ధరించాలి 
Back to Top