కర్నూలు: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే నిలిపివేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆరోపించారు. సీమ ప్రాంతానికి ప్రాణవాయువులాంటి ఈ పథకాన్ని అడ్డుకోవడం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నట్లేనని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భయపడి చంద్రబాబు వాటిని ప్రశ్నించలేదని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో భయపడి తెలంగాణ ప్రభుత్వ చర్యలపై చంద్రబాబు మౌనం పాటించారని ఆరోపించారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 854 అడుగులకు చేరకముందే తెలంగాణ ప్రభుత్వం నీటిని తరలిస్తోందని, 800 అడుగుల నీటి సామర్థ్యంతోనే సీమ ప్రజలకు సాగునీరు అందించేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. సీమలో సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు స్పందించడం లేదని అన్నారు. చంద్రబాబు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నారా లోకేష్, టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. అపర మేధావిగా చెప్పుకునే నారా లోకేష్ ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తండ్రి, కొడుకులు ఇద్దరూ రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. రాయలసీమ అభివృద్ధి పట్ల ముందుచూపుతోనే మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంపై వైయస్ జగన్ కర్నూలులో జలదీక్ష చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే కర్ణాటకలో అల్మట్టి డ్యాం సామర్థ్యాన్ని పెంచుతున్నా చంద్రబాబు ప్రశ్నించడం లేదని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకోవాలంటే వరద నీరు రావాల్సిందేనని, లేకపోతే సీమ ప్రాంతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని తెలిపారు. చంద్రబాబుకు రాష్ట్రం అంటే అమరావతి మాత్రమేనని, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కూడా కేసులకు భయపడి మరచిపోయారని విమర్శించారు. సీమ అభివృద్ధి కోసం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 5న ‘ఛలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని రైతులు, సీమ ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీమకు నీటి హక్కు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించిన ఎస్వీ మోహన్ రెడ్డి, పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాన్ని అణచివేయాలన్నా తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. రైతు ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగుతుందని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.