అమరావతి: సీబీఐ నియమించిన సిట్ నివేదికలో తిరుమల లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు ఆరోపణలు అబద్దాలని తేలినా ఇంకా దుష్ప్రచారం చేయడంపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి లోని వైయస్ఆర్‌సీపీ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... తిరుమల లడ్డూలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిశాయంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన విష ప్రచారం హిందూ సమాజాన్ని తీవ్రంగా గాయపరిచిందని ఆయన మండిపడ్డారు. సీబీఐ నేతృత్వంలోని సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఎక్కడా జంతుకొవ్వు ఉన్నట్లు ఆధారాలు లేవని స్పష్టం చేసినా.. ఇంకా బుకాయించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. సిట్ నివేదిక తర్వాత కూడా చంద్రబాబు దేవుడికి క్షమాపణ చెప్పకుండా.. మరింత సంస్కారహీనంగా లడ్డూ ప్రసాదంలో టాయిలెట్ క్లీనింగ్ కెమికల్స్ వాడారంటూ అత్యంత దుర్మార్గమైన ప్రచారం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కూటమి నేతలు కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారని ఆక్షేపించారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే... ● సిగ్గూ, శరం లేకుండా తప్పుడు ప్రచారం.. తిరుమల లడ్డూలో ఎలాంటి జంతుకొవ్వూ లేదని సీబీఐ సిట్ ఛార్జిషీట్ దాఖలు చేసినా సాక్షాత్తూ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి తో కూటమి ప్రభుత్వం లోని మంత్రులు భయం, భక్తితో పాటు సిగ్గూశరం లేకుండా మాట్లాడుతున్నారు. దేవుడు చూస్తున్నాడన్న ఆలోచన కూడా లేకుండా వీళ్లు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుడిగా తీవ్ర ఆవేదన కలుగుతోంది. 2024 సెప్టెంబరులో లడ్డూ లో జంతుకొవ్వు కలిపారని చంద్రబాబు ఆరోపించగా... మరో అడుగు ముందుకేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష పేరుతో నానా యాగీ చేశారు. చివరకు కోర్టు ఆదేశాలతో సీబీఐ నియమించిన సిట్ నివేదికలో ఎక్కడా పంది, జంతుకొవ్వులు, చేపనూనేలు లేదని స్పష్టం చేసింది. దీంతో అడ్డంగా దొరికిపోయామన్న దుగ్దతో వివిధ మార్గాల్లో తిరుమల ప్రసాదాన్ని కించపరిచే విధంగా ఇప్పటికీ అత్యంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి మంత్రులకు సవాల్ విసురుతున్నాను. సిట్ దర్యాప్తు నివేదికలో జంతుకొవ్వు, పందికొవ్వు ఉందని నిరూపంచగలరా? ఎన్ డీ డీ బీ, ఎన్ డీ ఆర్ ఐ నివేదికల్లో జంతుకొవ్వు ఉందని చూపించగలరా? సూటిగా సమాధానం చెప్పకుండా.. ప్రశ్నించిన విలేకరుల మీద అరిస్తే అబద్దం నిజం అయిపోదు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించలేనప్పుడు, ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అయిన సందర్భాల్లో ఇలాంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడ్డం చంద్రబాబుకు అలవాటు. ప్రభుత్వ తప్పుడు ప్రచారాన్ని నిలదీస్తే... వారిపైనా వారి కుటుంబ సభ్యుల పైనా దాడి చేస్తారు. ● సిట్ నివేదికతో బాబు కొత్త డ్రామా.. సిట్ నివేదిక వచ్చిన తర్వాత చంద్రబాబువి తప్పుడు ఆరోపణలను ప్రజలకు అర్ధమైంది. దీంతో తమను ప్రజలు నమ్మడం లేదని గ్రహించిన చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపాడు. తనతో పాటు పత్రికా సమావేశంలో కూర్చున్న ఉపముఖ్యమంత్రి, బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ మాధవ్ తో పాటు ఉన్న మంత్రులు సహా ఎవరి మొహాల్లోనూ జీవకళ లేదు. ఇదే విషయాన్ని జోగి రమేష్ ఇంటికి వెళ్లినప్పుడు ఆర్కే రోజా గారు ప్రస్తావిస్తే... దానిని సగం సగం కట్ చేసిన వీడియోలతో టీవీ5 లో మా పార్టీ మీద నెట్టి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. మీరు బుద్ధి లేని వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా నియమించారు. కేవలం రాజకీయం కోసం శ్రీ వేంకటేశ్వరస్వామికి అపచారం చేయడం అత్యంత దుర్మార్గం. కట్ అండ్ పేస్ట్ వీడియోలతో వైయస్ఆర్‌సీపీ నేతల దుష్ప్రచారం చేస్తూ ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీం కోర్టు నియమించిన సిట్ లో మీ అధికారులే ఉన్నారు. వాళ్లే ఎలాంటి జంతుకొవ్వు లేదని నిర్ధారించినప్పుడు మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా? లేదా? అలా చేయకుండా తిరిగి ఎదురుదాడి చేస్తారా? మీరు శ్రీ వేంకటేశ్వరస్వామి కంటే పెద్ద స్ధాయిలో ఉన్నారా? సుప్రీంకోర్టునే ధిక్కరిస్తారా? సుప్రీం కోర్టు నియమించి సీబీఐ సిట్ లో మీరు చెప్పిన జంతుకొవ్వుపై పూర్తి వివరణ ఇచ్చారు. మీకు అదెందుకు కనిపించడం లేదు? లడ్డూలో జంతుకొవ్వు, పందికొవ్వు చేపనూనెలు ఉన్నాయన్న మీ ఆరోపణలు సిట్ ఛార్జిషీట్ సాక్షిగా తప్పని తేలిని నేపధ్యంలో.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు హిందూ సమాజానికి, భక్తులకు క్షమాపణ చెప్పాలని వైయస్ఆర్‌సీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం. జంతుకొవ్వు లేదని తేలిపోవడంతో మరలా చంద్రబాబు మరో కొత్త డ్రామాకు తెరతీశారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో టాయిలెట్ కెమికల్స్ తో పాటు ఇతర రసాయనాలు వాడారని అత్యంత దుర్మార్గమైన ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. టీవీ5లో అయితే మరింత జుగుప్సాకరంగా తప్పుడు ప్రచారం చేస్తూ... దేవుడి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులైతే ఇంత దుర్మార్గంగా తప్పుడు ప్రచారం చేయరు. ● మీ హయాంలో కల్తీ నెయ్యితో లడ్డూలు - సిట్ నివేదికలో వాస్తవాలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెయ్యిలో నాణ్యత లేదని 4 ట్యాంకులు వెనక్కి పంపించడం, అవి మరలా మరో డెయిరీ పేరుమీద తిరుమలకు రావడం, ఆ కల్తీ అయిన నెయ్యినే లడ్డూ ప్రసాదంలో వాడారని సీబీఐ నివేదికలో చెప్పడం చూస్తుంటే తప్పు జరిగిందే చంద్రబాబు పాలనలో అని స్పష్టంగా అర్ధం అవుతుంది. మరి ఇప్పుడు శిక్ష ఎవరికి విధించాలి? తిరుపతి ప్రసాదాన్ని హిందువులు తీసుకోకుండా తప్పుడు ప్రసాదం చేయడం దుర్మార్గం. మీ తప్పుడు ప్రచారాన్ని భక్తులు నమ్మడం లేదు చంద్రబాబూ? తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదేళ్లలో ప్రసాదంపై ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. ● బాబు పాలనలో ఆలయాల్లో అపచారాలు.. కూటమి ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆలయాల్లో అపచారాలు చోటుచేసుకున్నాయి. ప్రమాదాలు, దాడులు జరిగాయి. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోయిన ఘటన, గోశాలలో ఆవులు మరణం, కొండపైన మద్య మాంసాలతో పట్టుబడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. సింహాచలంలో నాణ్యత లేని గోడ కూలి భక్తులు చనిపోవడంతో పాటు ప్రసాదంలో నత్త వచ్చిందని భక్తులు ఫిర్యాదు చేస్తే.. వారిపైనే తిరిగి కేసు నమోదు చేశారు. అన్నవరం ప్రసాదాల విక్రయకేంద్రంలో యధేచ్చగా ఎలుకులు స్వైరవిహారం చేస్తుంటే పట్టించుకునేవారు లేరు. ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం చేశారు. ప్రొద్దుటూరులో వారాహి అమ్మవారి గుడిని అటవీశాఖ అధికారులు ఎందుకు కూల్చివేశారు. మీ వాహనానికి మాత్రం వారాహి అని పేరుమాత్రం పెట్టుకుంటారు. ఇది 2024లో మాత్రనే జరిగినవి.. 2014 నుంచి 2019 వరకు మీ ప్రభుత్వ హయాంలో దేవాలయాల మీద లెక్కలేనన్ని దాడులు జరిగాయి. అంతర్వేది రథం దగ్ధంపై మా ప్రభుత్వ హాయంలో సీబీఐ దర్యాప్తుకు లేఖ రాస్తే వారు స్పందించలేదు. మా ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలోన్నింటి వెనుక టీడీపీ హస్తం ఉంది. ఆ రోజుల్లో రాముల వారి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనలో నిందితులకు మీరు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తారా? హిందవుల అని చెప్పుకుంటే సరిపోదు.. చెప్పులతో దేవుడ్ని కొలిచే మీరు హిందువులు అని చెప్పుకోవడం మాకు సిగ్గుచేటుగా ఉంది. పవన్ కళ్యాణ్ వి 'స్క్రిప్ట్' పాలిటిక్స్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయోధ్యకు లక్ష లడ్డూలు పంపించారని ఊగిపోయారు. ఆ రోజు టీటీడీ బోర్డు మెంబరు సౌరభ్ బోరా, మై హోం రామేశ్వరరావులు స్వచ్ఛమైన నెయ్యితో చేసిన లడ్డూలు పంపిస్తే వాటిపైనా ఆరోపణలు చేశారు. సినిమాల్లో స్క్రిప్ట్ ప్రకారం వేషాలు వేయడం అలవాటు.. అదే విధంగా రాజకీయాల్లో కూడా వివిధ వేషాలు వేశారు. తొలుత పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు, బీజేపీతో ఉన్నారు, ఆ తర్వాత మార్కిస్టు అన్నారు. వాళ్ల అమ్మ గారు దేవుడికి దీపం పెడితే వాళ్ల నాన్న గారు సిగరెట్ వెలిగించుకుంటారని చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ మా ఇంట్లో ఎప్పుడూ రామనామం వినిపిస్తుందన్నారు. ఆయన సోదరుడు నాగబాబు అయితే నేను దేవుడ్ని నమ్మను, దేవుడు లేడు అని చెప్పి.. ఇవాళ మరలా దేవుడు గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడితే వినాల్సి రావడం రాష్ట్ర ప్రజల ఖర్మ. వీళ్లా హిందూ దేవుళ్లను, దేవాలయాలను పరిరక్షించేది. ఆయన్ను ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు నిజమైన భక్తులైతే మీరు చేసిన ఆరోపణలు అబద్దమని తేలిన నేపధ్యంలో... సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో సహా కూటమి మంత్రులు దేవుడికి క్షమాపణ చెప్పాలని వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.