హెలీప్యాడ్ స్థలంపై సీఎం చంద్రబాబువి పచ్చి అబద్ధాలు

ఆధారాలతో సహా నిలదీసిన వైయ‌స్ఆర్‌సీపీ నేత దొంతిరెడ్డి వేమారెడ్డి

తాడేపల్లి వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి

తాడేపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో  హెలీప్యాడ్ కోసం రైతు భూమిని బలవంతంగా లాక్కున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మండిపడ్డారు. దశాబ్దాలుగా రైల్వే ఆధీనంలో ఉన్న ఆ భూమిని ఏ రైతు సాగుచేసిన ఆధారాల్లేవని స్పష్టం చేశారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందునే.. వైయ‌స్ఆర్‌సీపీపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అబద్దాలతో ఎంతకాలం ప్రజలను మభ్యపెడతారని నిలదీశారు. ఇంకా ఏమన్నారంటే...

● అది రైల్వే స్థలం.. సాగు భూమి కాదు!

తాడేపల్లిలో పుట్టి పెరిగిన వ్యక్తిగా హెలీ ప్యాడ్ నిర్మించిన ఆ భూమి చరిత్ర నాకు  పూర్తిగా తెలుసు. హెలీప్యాడ్ ఏర్పాటు చేసిన స్థలం మొదట రైల్వే సంస్థకు చెందినది. ఆ తర్వాత దానిని 'ఈఐడీ ప్యారీ లిమిటెడ్' అనే ఎరువుల కంపెనీకి లీజుకు ఇచ్చారు. ఆ కంపెనీ మూతపడ్డాక ఆ స్థలాన్ని వేలంలో వేరొకరు పాడుకున్నారు. రికార్డుల ప్రకారం అది ఇప్పటికీ రైల్వే మరియు ప్రభుత్వ భూమిగానే ఉంది. అక్కడ ఎప్పుడూ వ్యవసాయం జరగలేదని, రైతులు సాగు చేయలేదు. 

సర్వే నంబరు 223/226/సి2 లలోని 10.04 ఎకరాల స్థలం 2015లోనే (టీడీపీ హయాంలోనే) కలెక్టర్ ఆధీనంలో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. 2015లో ఆర్.సి. నంబర్ 22/7 ప్రకారం ఈ భూమి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాకముందే అది ప్రభుత్వ భూమిగా ఉన్నప్పుడు, మేము రైతును మోసం చేశామని చెప్పడం సిగ్గుచేటు. 

● నిబంధనల ప్రకారమే హెలీప్యాడ్ ఏర్పాటు

ముఖ్యమంత్రి భద్రత మరియు ప్రయాణ అవసరాల కోసం ఏవియేషన్ కార్పొరేషన్ నిబంధనలను అనుసరించి, వైయస్.జగన్ ప్రభుత్వంలో అన్ని అనుమతులతోనే  తాడేపల్లిలో హెలీప్యాడ్ నిర్మించాం. మా హయాంలో ఎవరి భూమినీ ఆక్రమించలేదు, ఎవరికీ అన్యాయం చేయలేదన్నది పచ్చినిజం. 

● హామీల నెరవేర్చలేకే  బురద జల్లే రాజకీయం!

చంద్రబాబు గారూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక, వాటిపై మేము ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక మాపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. అబద్ధాలతో ఎంతకాలం కాలం వెళ్లదీస్తారు? భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించడంతో పాటు, తప్పుడు ప్రచారాలు మాని, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని వేమారెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top