అనంతపురం: రాష్ట్రంలో పరిపాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం రాజకీయంగా అభద్రతా భావంలో ఉన్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 20 నెలల్లో కూడా సక్రమంగా అమలు చేయలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి ఆరోపణలను దాచిపెట్టేందుకు కల్తీ మద్యం, వివేకానందరెడ్డి హత్య, చివరకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, టీడీపీ నేతలు ప్రచారం చేశారని అన్నారు. ఈ ఆరోపణలపై వైయస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రమణ్యం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాలతో సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సిట్ విచారణలో భాగంగా ఎన్‌డీఆర్‌ఏ, ఎన్‌డీడీబీ ల్యాబ్‌లు నిర్వహించిన పరీక్షల్లో లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు లేదని తేలినా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు దుష్ప్రచారం ఆపడం లేదని మండిపడ్డారు. సిట్ నివేదికలో వాస్తవాలు బయటకు రావడం చంద్రబాబుకు రుచించకపోవడంతో మళ్లీ తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని విమర్శించారు. శ్రీవారి లడ్డూను కోట్లాది మంది భక్తులు మహాప్రసాదంగా స్వీకరిస్తారని, అలాంటి పవిత్ర ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దురదృష్టకరమని అన్నారు. లడ్డూలో కెమికల్స్ కలిపారని మరోసారి ఆరోపణలు చేయడం ఆశ్చర్యకరమని, పరిపాలన అనుభవం ఉన్న నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ఆ ప్రశ్నలు వచ్చినప్పుడల్లా లడ్డూ వివాదంతో దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. కేబినెట్ సమావేశాల్లో కూడా ఇదే చర్చ జరుగుతోందని, చంద్రబాబుకు ‘జగన్ ఫోబియా’ పట్టుకుందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో తనకు అడ్డువచ్చిన వారిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం చంద్రబాబుకు అలవాటేనని, వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కూడా తప్పుడు ప్రచారం చేయాలని చూస్తున్నారని అన్నారు. తక్కువ ధరకు నెయ్యి దొరుకుతుందా అని ప్రశ్నిస్తున్న చంద్రబాబు, తన హయాంలోనే ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ నుంచే తక్కువ ధరకు నెయ్యి కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పరిపాలనలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని, శ్రీవారి లడ్డూ అంశంలో తనకు అనుకూలంగా నివేదిక వచ్చే వరకు విచారణ కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 20 నెలల్లో రూ.3 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం ఆ డబ్బు ఎక్కడ ఖర్చు చేసిందో కూడా చెప్పలేని పరిస్థితి ఉందని విమర్శించారు. శ్రీవారి లడ్డూ అంశంపై చేసిన ఆరోపణలపై వాస్తవాలు బయటపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు, కూటమి నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఇచ్చిన హామీల అమలు, పరిపాలనపై దృష్టి పెట్టాలని అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు.