విశాఖపట్నం: తిరుమల శ్రీవారి లడ్డుపై కూటమి నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గాజువాక నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ల్యాబ్ నివేదికలు స్పష్టం చేశాయని తెలిపారు. అయినప్పటికీ అబద్ధాన్ని నిజం చేయాలనే ఉద్దేశంతో కూటమి నాయకులు నిరాధార ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు. మొన్నటి వరకు జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేసిన కూటమి నేతలు ఇప్పుడు లడ్డూలో కెమికల్స్ కలిసాయని మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ లబ్ధి కోసం దేవుడి పేరును ఉపయోగించడం దురదృష్టకరమని అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు లడ్డూ వివాదాన్ని డైవర్షన్ రాజకీయాలుగా ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో భారీగా ఖర్చులు చేసి అవినీతి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తిరుమల లడ్డుపై నిరాధార ఆరోపణలు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడులు చేసి, అనంతరం అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూడా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం బాధాకరమని తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి అన్నారు. రెండు సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. కూటమి నాయకులు తిరుమల శ్రీవారి లడ్డుపై చేసిన ఆరోపణలకు ప్రజలకు, స్వామివారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.