బ‌డ్జెట్ స‌మావేశాల్లోపు త‌ల్లికి వంద‌నం బ‌కాయిలు చెల్లించాలి

శాస‌న‌మండ‌లి విప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ డిమాండ్ 

స‌చివాల‌యం: త‌ల్లికి వంద‌నం పెండింగ్ బ‌కాయిలు బ‌డ్జెట్ స‌మావేశాలు ముగిసేలోపు చెల్లించాల‌ని మండ‌లి విప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ త‌ల్లికి వంద‌నం పేరిట ప్ర‌తి విద్యార్థికి రూ. 15 వేలు చెల్లిస్తామ‌ని హామీ ఇచ్చిన‌ కూట‌మి ప్ర‌భుత్వం, మొద‌టి ఏడాది పూర్తిగా ఎగ‌నామం పెట్ట‌డ‌మే కాకుండా రెండో ఏడాది కేవ‌లం రూ. 13వేలే ఇచ్చి చేతులు దులిపేసుకుంద‌ని.. 15 శాతం మందికిపైగా విద్యార్థుల‌కు రూ. 8 వేలు, రూ. 9 వేలు మాత్ర‌మే ఇచ్చార‌ని శాస‌న‌మండ‌లి విప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆరోపించారు. కంపెనీల ఏర్పాటు పేరుతో రాష్ట్రంలోని విలువైన భూముల‌ను 99పైస‌ల‌కే చంద్ర‌బాబు త‌న బినామీల‌కు ఇష్టారాజ్యంగా దారాద‌త్తం చేయ‌డంపై ఆయ‌న మండిప‌డ్డారు. ప్ర‌భుత్వం భూకేటాయింపుల విష‌యంలో నిబంధ‌న‌లు పాటించ‌డం లేద‌ని ఆరోపించారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే..

● భూములు ఉచితంగా రాసిచ్చేస్తే పారిశ్రామికాభివృద్ధి జ‌రిగిపోతుందా?

శాస‌న‌మండ‌లి ప్ర‌శ్నోత్స‌రాల స‌మ‌యంలో రెండు అంశాలు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి. కంపెనీల ఏర్పాటు పేరుతో 99 పైస‌ల‌కే భూములు ఇష్టారాజ్యంగా క‌ట్టబెట్ట‌డంతోపాటు సీఎం చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుడు, ఎంపీ భ‌ర‌త్‌కి చెందిన‌ గీతం కాలేజీ రూ. 5వేల కోట్ల విలువ చేసే 55 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని ఆక్ర‌మించుకుంటే దాన్ని క్ర‌మ‌బ‌ద్ధీక‌రించే ప్ర‌క్రియ‌కు తెర‌లేపింది. ప‌క్క రాష్ట్రాల్లో బ‌హిరంగ వేలం ద్వారా ప‌రిశ్ర‌మ‌ల‌కు భూములు ఇస్తుంటే ఇక్క‌డ మాత్రం చంద్ర‌బాబు త‌న అనుయాయ‌కుల‌కు బినామీల‌కు ప్ర‌భుత్వ భూమిని 99 పైస‌ల‌కే ధారాదత్తం చేస్తున్నాడు. దీనిపై మండ‌లిలో ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే సూటిగా స‌మాధానం చెప్ప‌కుండా దాట‌వేస్తున్నారు. భూ కేటాయింపుల విష‌యంలో ప్ర‌భుత్వం నిబంద‌న‌లు పాటించ‌డం లేదు. లూలూ, స‌త్వా, ఉర్సా త‌దిత‌ర కంపెనీల‌కు వేల కోట్ల విలువైన ప్ర‌భుత్వ భూముల‌ను రాసిచ్చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి కుటుంబ స‌భ్యుల‌కు ఉచితంగా 55 ఎక‌రాలు రాసిచ్చేస్తే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జ‌రిగిపోతుందా? 
కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి 20 నెల‌లు దాటినా కొత్త‌గా ఒక్క‌రికీ సామాజిక పింఛ‌న్లు మంజూరు చేయ‌లేదని వారే ఒప్పుకున్నారు. ఎప్పుడిస్తారంటే.. స్ప‌ష్టమైన తేదీ ప్ర‌క‌టించ‌కుండా ఇస్తామ‌ని చెప్పి త‌ప్పించుకుంటున్నారు. ఎంత‌మంది పిల్ల‌లుంటే అంద‌రికీ త‌ల్లికి వంద‌నం రూ. 15 వేలు ఇస్తామ‌ని చెప్పి కూట‌మి ప్ర‌భుత్వం మోసం చేసింది. ఏ ఒక్క‌రికీ రూ. 15 వేలు ఇవ్వ‌క‌పోగా 15 శాతం మందికి ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేయ‌లేద‌ని నిల‌దీశాం. పైగా చాలా మంది ఖాతాల్లో కేవ‌లం రూ. 7 వేలు రూ. 8 వేలు, రూ. 9 వేలు జ‌మ చేసి ప్ర‌భుత్వం చేతులు దులిపేసుకున్న విష‌యాన్ని కూడా స‌భ దృష్టికి తీసుకొచ్చాం. దీనిపై ప్ర‌శ్నిస్తే స‌రిగా స‌మాధానం చెప్ప‌డం లేదు. అబ‌ద్ధం చెబుతున్నార‌ని అడ్డ‌గోలుగా మాట్లాడుతున్నారు. ప్ర‌తిప‌క్షం త‌ర‌ఫున ఏ ప్ర‌శ్న అడిగినా ప్ర‌భుత్వం స‌మాధానం చెప్ప‌లేక‌పోతుంది. ప్ర‌భుత్వం ఒంటెద్దు పోక‌డ‌లు పోతోంది. బ‌డ్జెట్ స‌మావేశాలు పూర్త‌య్యే లోపు త‌క్ష‌ణం త‌ల్లికి వంద‌నం బ‌కాయిలు చెల్లించాలి. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో ఠంచ‌న్‌గా అమ‌లు చేసిన అమ్మ ఒడి ప‌థ‌కానికి పేరు మార్చి పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. ప్ర‌భుత్వ చ‌ర్య‌ల కార‌ణంగా చాలామంది విద్యార్థులు చ‌దువుల‌కు దూర‌మ‌వుతున్నారని బొత్స స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు.

Back to Top