శాసనసభలో మన గొంతు వినిపించకూడదని ప్రభుత్వ కుట్ర

అందుకే ఏకైక ప్రతిపక్ష పార్టీ అయినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు

మండలిలో మంచి సంఖ్యా బలం ఉంది

అక్కడ ప్రజా సమస్యలపై గట్టిగా గొంతెత్తాలి. 

ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలి

ఎమ్మెల్సీలకు శ్రీ వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం

లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టారు

వైయ‌స్ఆర్‌సీపీపై నిరంతరం బురద జల్లుతూ దుష్ప్రచారం చేస్తున్నారు

లడ్డూ వ్యవహారంలో సమాధానం చెప్పాల్సింది, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందీ చంద్రబాబే

చంద్రబాబు హయాంలోనే ట్యాంకర్ల సరఫరా 

రిజెక్ట్‌ అయినా నెయ్యి మళ్లీ టీటీడీలోకి వచ్చిందీ చంద్రబాబు హయాంలోనే

సీబీఐ సిట్‌ ఛార్జిసీటుకు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే

శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

కూటమి ప్రభుత్వ పాలనంతా స్కామ్‌ల మయం

విశాఖలో రూ.5 వేల కోట్ల భూమిని చంద్రబాబు తన బంధువుకు కట్టబెట్టారు 

గతంలో ఏనాడూ, రాష్ట్రంలో అలా జరగలేదు

ఏ ముఖ్యమంత్రి ఇలా బరితెగించలేదు

వీటన్నింటినీ మండలిలో గట్టిగా నిలదీయాలి

పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో శ్రీ వైయస్‌ జగన్‌

తాడేపల్లి: శాసనసభ, మండలి బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన మండలి సభ్యులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..:

ప్రజల తరఫున గొంతు వినిపించకూడదనే ప్రధాన ప్రతిపక్షంగా వైయ‌స్ఆర్‌సీపీని గుర్తించడం లేదు:
    అందరూ యుద్దంలో ఉన్నారు. నా కంటే మీకే ఇంకా బాగా తెలుసు. అందుకే మీరు కూడా బెటర్‌గా పోరాడతారు. మనకు అసెంబ్లీలో బలం తక్కువ. అక్కడ మన గొంతు వినపడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. అయినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. ఎందుకంటే, మనకు ఆ గుర్తింపును ఇస్తే, విపక్షనేతకు కూడా సీఎంకు ఎంత సమయం ఇస్తారో దాదాపుగా సమయం మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టే, మన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై గొంతెత్తలేం కాబట్టి, ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్నాం. ఆధారాలతో సహా, అన్నీ వివరిస్తున్నాం.

మండలిలో బలం ఉంది కాబట్టి..:
    కౌన్సిల్‌లో మనకు బలం ఉంది. కాబట్టి మనకు మాట్లాడే అవకాశం వస్తుంది. మనకు మైక్‌ ఇస్తారు కాబట్టి, ప్రజల సమస్యలను గట్టిగా వినిపించే వీలుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు. సబ్జెక్టుల వారీగా పూర్తి అవగాహన పెంచుకొండి. అప్పుడే మనం గట్టిగా మాట్లాడగలం. దేనికైనా మంచి ప్రిపరేషన్‌ అవసరం. అవగాహన పెంచుకుంటే బాగా మాట్లాడగలుగుతాం. ఏ అంశంపై మాట్లాడినా తగిన ఆధారాలు, సాక్ష్యాలు చూపి మాట్లాడాలి. అప్పుడే మన గొంతు బలంగా పోతుంది. 

లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు:
    అంబటి రాంబాబు, జోగిరమేష్‌ ఇళ్లపై దాడులు, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్‌రెడ్డిపై దాడులు కానీ, కాకాణి గోవర్థన్‌రెడ్డిపై అక్రమ కేసులు.. ఇవన్నీ కూడా లడ్డూ వ్యవహారంలో ప్రశ్నించడాన్ని తట్టుకోలేక చంద్రబాబు చేసినవే. చివరకు చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని మనం గుళ్లలో పూజలు చేసినా, చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఏకంగా భౌతిక దాడులు చేస్తున్నారు. ఒక అబద్ధం సష్టించి, దానికి రెక్కలు కట్టి ప్రచారం చేయడం తొలిసారి చూస్తున్నాం. అసలు కల్తీ నెయ్యి సరఫరాకు, వైయ‌స్ఆర్‌సీపీకి ఏమాత్రం సంబంధం లేదు. 

సీబీఐ ఛార్జిషీటుకు సమాధానం చెప్పాల్సిందీ, చేసిన తప్పులకు క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబే:
    లడ్డూ వ్యవహారానికి సంబంధించిన పరిణామాలను ఒకసారి చూస్తే.. ఈ వ్యవహారంలో ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే. లెంపలేసుకోవాల్సిందీ చంద్రబాబే. 
    ఒకసారి జరిగిన తీరు చూస్తే, రాష్ట్రంలో మార్చి 16, 2024న ఎన్నికల కోడ్‌ వస్తే, మే 13న, పోలింగ్‌ జరిగింది. మే 15న టీటీడీలో నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్లు ఓకే చేసి, ఏఆర్‌ డెయిరీకి కాంట్రాక్ట్‌ ఇచ్చారు. జూన్‌ 4, ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ప్రభుత్వం మారింది. చంద్రబాబు సీఎం అయిన తర్వాతనే నెయ్యి సరఫరా ప్రారంభమైంది. జూన్‌ 12, 20, 25 జూలై 4న మొత్తం నాలుగు ట్యాంకర్లను ఏఆర్‌ డెయిరీ సరఫరా చేసింది. అవన్నీ ల్యాబ్‌ పరీక్షల్లో పాస్‌ అయ్యాయి.
    ఆ తర్వాత జూలై 6, 12 తేదీల్లో వచ్చిన నాలుగు ట్యాంకర్లు నెయ్యి నాణ్యత పరీక్షలో ఫెయిల్‌ కావడంతో వెనక్కి పంపారు. జూలై 23న ల్యాబ్‌ రిపోర్టు రావడంతో, జూలై 25న నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపించారు. అయితే ఆ ట్యాంకర్లను జూలై 27న శ్రీకాళహస్తిలో వైష్ణవి డెయిరీకి సమీపంలో పార్క్‌ చేశారు. ఆ తర్వాత అవే ట్యాంకర్లు మరో డెయిరీ పేరుతో ఆగస్టు, సెప్టెంబరులో తిరిగి టీటీడీకి పంపారు. అలా వచ్చిన నెయ్యిని వాడారని, సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కూడా రాసింది. వెనక్కి పంపిన ట్యాంకర్లు తిరిగి టీటీడీలోకి వస్తే, జరిగిన పరిణామాలు, జరిగిన తేదీలు చూస్తే మొత్తం ఇవన్నీకూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగాయి. మరి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? 
    నిజానికి 2014–19 మధ్య ప్రీమియర్‌ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. ఆ కంపెనీ 2019లో సరఫరా ఆపేసింది. కానీ, దాన్ని కేవలం మన ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. అంతకు ముందు సరఫరాకు సంబంధించి ప్రస్తావించడం లేదు.

టీటీడీలో నెయ్యి సప్లైపై ఒక పక్కా విధానం:
    టీటీడీలో నెయ్యి సేకరణకు టీటీడీలో ఒక పటిష్ట విధానం ఉంది. నెయ్యి తెచ్చిన ట్యాంకర్లు కేంద్ర ప్రభుత్వం అక్రిడిటెడ్‌ ల్యాబ్‌ నుంచి సర్టిఫికెట్‌ తీసుకురావాలి. అలా వచ్చిన ట్యాంకర్‌లోని నెయ్యిని మళ్లీ టీటీడీ కూడా పరీక్షిస్తుంది. ఆ రిపోర్టు కూడా పాజిటివ్‌గా ఉంటేనే, లోపలికి పంపిస్తారు. ఇదే పద్ధతిలో నాణ్యత లేక మన హయాంలో 18 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపాం. అంతకు ముందు చంద్రబాబు హయాంలో కూడా 2014–19 మధ్య 15 ట్యాంకర్లు వెనక్కి పంపారు. మరి ఇలాంటి పద్ధతి ఉన్నప్పటికీ కూడా దొడ్డిదారిన రిజెక్ట్‌ చేసినవి, తిరిగి టీటీడీకి వచ్చాయంటేం, దానికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? మరి వీటన్నింటినీ మన పార్టీకి, మన ప్రభుత్వ కాలానికి ఆపాదించి రోజూ బురదజల్లుతున్నారు. 

2014–19 మధ్య కూడా అభియోగాలు ఎదుర్కొంటున్న కంపెనీలు నెయ్యి సరఫరా:
    సీబీఐ ఛార్జిషీటులో అభియోగాలు ఎదుర్కొంటున్న కంపెనీలు 2014–19 మధ్య కూడా సప్లై చేశాయి. ప్రీమియర్‌ డెయిరీ 2016,  2017, 2018 లో కూడా నెయ్యిని సప్లై చేసింది. కానీ, కేవలం మన ప్రభుత్వానికి ఆపాదించి కుట్రలు చేస్తున్నారు. 

కూటమి ప్రభుత్వం. స్కామ్‌ల మయం:
    మరోవైపు కూటమి ప్రభుత్వం స్కామ్‌ల మయంగా మారింది. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడి చేస్తున్నారు. రూ.5 వేల కోట్ల విలువైన భూమి 54 ఎకరాలు గీతమ్‌ వర్సిటీకి ఇచ్చేశారు. ఏ ముఖ్యమంత్రీ తన సొంత బంధువులకు ఎవరూ ఇలా ఇచ్చుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్త నినాదం వినిపిస్తోంది. అదే ‘క్యాష్‌..  సూట్‌కేసు.. రాజేష్‌.. లోకేష్‌.’. ఇది బాగా వినిపిస్తోంది.
    ఈ అంశాలన్నింటిపైనా సభలో గట్టిగా గొంతు వినిపించాలి. పోరాడాలి. చిత్తశుద్ధితో కష్టపడి పని చేయండి. కళ్లు మూసి తెరిచేలోపు మూడేళ్లు గడుస్తాయి. వచ్చేది మన ప్రభుత్వమే. ఇప్పుడు కష్టపడి పని చేస్తున్న వారందరికీ, తగిన గుర్తింపు ఉంటుంది. పనితీరు ఆధారంగా మీకు మీ పదవులు తిరిగి వస్తాయి కూడా. అలాగే ఇంతకన్నా మంచి పదవులు కూడా దక్కే అవకాశం మీకు ఉందని శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

Back to Top