తాడేపల్లి: బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం కొత్త నారికేళ్ళపల్లి (కేఎన్ పల్లి)కు చెందిన వైయస్ఆర్‌సీపీ స్థానిక నాయకులు వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఇటీవల తమ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మూకలు అర్ధరాత్రి తమ ఇళ్లపై దాడి చేసి తలుపులు బద్దలు కొట్టి ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు బంగారం, నగదు దోచుకెళ్లారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేమూరు వైయస్ఆర్‌సీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్‌బాబు మాట్లాడుతూ, చుండూరు మండలం కొత్త నారికేళ్ళపల్లిలో వైయస్ఆర్‌సీపీ బీసీ నేత, సర్పంచ్ అంగిరేకుల నాగేశ్వరరావు ఇంటిపై టీడీపీకి చెందిన రౌడీషీటర్ బాలకోటిరెడ్డి పచ్చమూకలతో కలిసి దాడి చేశాడని వైఎస్ జగన్‌కు వివరించారు. గ్రామంలో వైయస్ఆర్‌సీపీసానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని బాలకోటిరెడ్డి తరచూ మారణాయుధాలతో దాడులు చేస్తున్నాడని ఆరోపించారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఉన్నప్పటికీ తమకు రక్షణ కల్పించడం లేదని బాధితులు వాపోయారు. ఈ విషయాన్ని బాపట్ల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా తమ కుటుంబాలకు, ప్రాణాలకు భద్రత లభించడం లేదని, ప్రాణభయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని బాధిత కుటుంబాలు తెలిపారు. టీడీపీ ప్రభుత్వంపై నమ్మకం లేక ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయంలో విజ్ఞప్తి చేసిన విషయాన్ని కూడా వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఘటనలపై స్పందించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్ఆర్‌సీపీకార్యకర్తలు, నాయకులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. టీడీపీ గూండాల దాడులు, దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. బాధితులకు పార్టీ లీగల్ సెల్ తరఫున అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. చట్టవ్యవస్థను కాపాడాల్సిన పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరమని తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో వేమూరు వైయస్ఆర్‌సీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్‌బాబు, మాజీ జెడ్పీటీసీ గాదె శివరామిరెడ్డి, చుండూరు మండల పార్టీ అధ్యక్షుడు రఘురామిరెడ్డి, అంగిరేకుల నాగేశ్వరరావు, శివమ్మ, విష్ణు, ఊరుబండి కోటేశ్వరరావు, బాలాజీ నాయక్, స్వప్న, అంగిరేకుల తిరుపతమ్మ, శ్రీను, ఉయ్యూరు రవిశంకర్‌రెడ్డి, వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ సభ్యుడు మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.