రాష్ట్రంలో రాక్షస పాలన

రెడ్ బుక్ రాజ్యాంగంపై మాజీ మంత్రి మార్గాని భరత్ ధ్వ‌జం

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం:  రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న సాగుతోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ మండిప‌డ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో మాజీ మంత్రి అంబటి రాంబాబును కలిసిన అనంతరం రెడ్‌బుక్ రాజ్యాంగంపై ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.  ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో “రెడ్ బుక్ రాజ్యాంగం” అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ చర్యలు భారత రాజ్యాంగాన్ని, అలాగే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ను అవమానించడమేనని వ్యాఖ్యానించారు.

ఇళ్లపై రౌడీ మూకలతో దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా బెయిల్‌పై విడుదల చేస్తున్నారని, మరోవైపు అంబటి రాంబాబు, మాజీ మంత్రి జోగి రమేష్పై తీవ్ర చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఒక వ్యాఖ్యపై క్షమాపణ చెప్పినా కూడా అంబటి రాంబాబుపై సుమారు 47 కేసులు పెట్టడం అమానుషమని పేర్కొన్నారు. దీనిని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు.

రాజకీయ కక్షలతో ఇళ్లపై పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయని, ఆ సమయంలో ఇళ్లలో మహిళలు మాత్రమే ఉన్నారని తెలిపారు. అలాంటి ఘటనల్లో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. చట్టం, న్యాయ వ్యవస్థలను పక్కన పెట్టి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కారణంగా ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని, కానీ ప్రజలు ఈ పరిణామాలను గమనిస్తున్నారని భరత్ అన్నారు. భవిష్యత్తులో ప్రజలు తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు. అలాగే తిరుపతి లడ్డు అంశంపై వచ్చిన పరిణామాల తర్వాత రాజకీయ కక్షలు మరింత పెరిగాయని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ప్రతిపక్షాన్ని అణచివేయడం సరైంది కాదని మార్గాని భరత్ తెలిపారు.

Back to Top