తాడేపల్లి: డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని వైయస్ఆర్‌సీపీ డీఎస్సీ పోరాట కమిటీ నిర్ణయించింది. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కల్పలత, పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, అభ్యర్థుల అభ్యంతరాల పరిష్కారంలో జరిగిన అవకతవకలపై విస్తృతంగా చర్చించారు. డీఎస్సీ కారణంగా నష్టపోయిన అభ్యర్థుల తరఫున న్యాయపోరాటాన్ని కొనసాగించడంతో పాటు, ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తి దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. బాధిత అభ్యర్థులతో త్వరలోనే మరో సమావేశం నిర్వహించాలని కూడా నిర్ణయించారు. డీఎస్సీ-2025లో చోటుచేసుకున్న అక్రమాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు స్పందించడం లేదని కమిటీ సభ్యులు ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి మించిన స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎస్‌సీఈఆర్టీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ కృష్ణా జిల్లా టాపర్‌గా నిలవడం, అత్యధిక మార్కులు సాధించినప్పటికీ ఉద్యోగం పొందకపోవడం వెనుక ఉన్న కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ఫలితాలపై 30 వేలకుపైగా గ్రీవెన్సులు వచ్చినప్పటికీ అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అక్రమాలపై ప్రశ్నిస్తున్న అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం, వారిపై తప్పుడు ప్రచారం చేయడం వంటి చర్యలకు కొందరు ఉన్నతాధికారులు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే డీఎస్సీ అంశంపై పలు రిట్ పిటిషన్లు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. డీఎస్సీ-2025లో వెలుగులోకి వచ్చిన ప్రతి అంశంపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరిపించి, సీబీఐ విచారణకు ఆదేశించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ డీఎస్సీ పోరాట కమిటీ డిమాండ్ చేసింది.