కాకినాడ: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా, ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కేవలం అబద్ధాలు, అరాచకాలు, అవినీతి, బంధుప్రీతితో కాలం వెళ్లదీస్తోందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు చేతిలో మోసపోయామంటూ అమరావతి రైతులు మొదలుకొని, డీఎస్సీ అభ్యర్థులు జగన్‌గారిని ఆశ్రయిస్తున్నారని ఆయన వెల్లడించారు. దీంతో తట్టుకోలేకపోతున్న అధికార టీడీపీ, జగన్‌గారిపై విరుచుకుపడుతూ దుష్ప్రచారం చేస్తోందని ఆక్షేపించారు. పోలవరం ఎడమ కాలువ పనుల అంచనాను అమాంతం రూ.444 కోట్లు పెంచి, తమ వారికి దోచి పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించిందని కాకినాడలో మీడియాతో మాట్లాడిన కురసాల కన్నబాబు ఫైర్ అయ్యారు. ప్రెస్‌మీట్‌లో కురసాల కన్నబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..: ’సూపర్ సిక్స్’ అంతా సూపర్ మోసం: మూడు ప్రాంతాలలో మూడు సభలు నిర్వహిస్తామని చెప్తున్న కూటమి నేతలు, మేం అడిగే ప్రశ్నలకు దేవుడి మీద ప్రమాణం చేసి, గుండెల మీద చేయి వేసుకుని సమాధానం చెప్పగలరా? ఆడబిడ్డ నిధి ఏది? 18 నుండి 50 ఏళ్ల లోపు మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇస్తామన్న భారీ ప్రకటనలు ఏమయ్యాయి? ఎవరికైనా ఇచ్చారా? నెలకు రూ.3,000 భృతి ఒక్క నిరుద్యోగికైనా ఇచ్చారా? దమ్ముంటే లబ్ధిదారుల జాబితాలను గత ప్రభుత్వంలో మాదిరిగా సచివాలయాల్లో ప్రదర్శించగలరా? జౖగన్‌గారు అమలు చేసిన ‘అమ్మఒడి’ కాపీ కొట్టి ‘తల్లికి వందనం’ అని పేరు మార్చారు కానీ అందులో పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేదు. ఎంతమంది పిల్లలున్నా ఇస్తామని చెప్పి, తీరా చూస్తే గతంలో కంటే విద్యార్థుల సంఖ్యను తగ్గించి 20 లక్షల మందికి ఎగనామం పెట్టారు. రూ.13,112 కోట్ల బడ్జెట్ కావాల్సి ఉండగా కేవలం రూ.8,456 కోట్లు కేటాయించి, రూ.8,389 కోట్లు మాత్రమే ఖర్చు చేసి పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు. ఉచిత బస్సు, సిలిండర్ల మాయ: ఆర్టీసీలో ఉన్న 16 రకాల బస్సు కేటగిరీల్లో కేవలం 5 రకాల బస్సులకే అర్హత అని నిబంధనలు పెట్టారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అని చెప్పి రెండేళ్లలో ఇవ్వాల్సింది 6 సిలిండర్లు అయితే.. కేవలం 1 లేదా 2 సిలిండర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వైయస్ జగన్ హయాం నాటి పెన్షన్లలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఏకంగా 6 లక్షల పెన్షన్లను నిర్దాక్షిణ్యంగా పీకేశారు. అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త పెన్షన్ గానీ, కొత్త రేషన్ కార్డు గానీ, కొత్త ఇల్లు గానీ ఇచ్చిన పాపాన పోలేదు. ఆక్వా రంగానికి తీరని అన్యాయం.. పడిపోతున్న ధరలు: వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆక్వా జోన్‌లో ఎక్కడైనా సరే యూనిట్ విద్యుత్ రూ.1.50 కే ఇచ్చి రైతును ఆదుకున్నారు.వైయస్. జగన్ హయాంలో ఉన్న 64 వేల ఆక్వా కనెక్షన్లలో 58 వేల కనెక్షన్లకు సబ్సిడీలు ఇస్తే.. ప్రస్తుత ’కోతల ప్రభుత్వం’ కొత్తగా ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వడం లేదు. నిన్ననే ఆక్వా ఎక్స్‌పోలో చంద్రబాబు మాట్లాడుతూ ’బ్లూ ఎకానమీ’ తెస్తాం, ఆక్వా కారిడార్‌గా మారుస్తాం అంటూ గొప్పలు చెప్తున్నారు. ఇది తల్లికి తిండి పెట్టలేని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్లు ఉంది. వైయస్. జగన్ హయాంలో కరెంట్ సబ్సిడీ ఇచ్చి రొయ్యల మేత ధరలు పెరగకుండా నియంత్రించాం. కానీ కూటమి రాగానే మేతల ధరలు విపరీతంగా పెరిగాయి. వనామీ, టైగర్ ఫీడ్ ధరలను కేజీకి రూ.8 నుండి రూ.10 పెంచాలని చూస్తే వైయస్ఆర్‌సీపీ, రైతులు రోడ్డెక్కి గొడవపడితే భయపడి వెనక్కి తగ్గారు తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదు. 100 కౌంట్ రొయ్యల ధర రూ.270 నుండి రూ.210 కి పడిపోయి రైతులు టన్నుకు రూ.50 వేల నుండి రూ.60 వేలు నష్టపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. రాష్ట్రంలో వరి, జొన్న, టమాట, ఉల్లి, మామిడి, పొగాకు వంటి ఏ పంటకూ కనీస మద్దతు ధర లేదు. రైతుల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది. గతేడాది ఏకంగా 393 మంది రైతులు, 2,672 మంది రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఈ ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఆసుపత్రుల్లో మందుల్లేవు. బీచ్‌లలో మద్యం మాత్రం పుష్కలం!: రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం, ఆరోగ్యశ్రీ పూర్తిగా గాలిలో కలిసి పోయాయి. విశాఖ, విజయవాడ, కాకినాడ, గుంటూరు ఏ జీజీహెచ్‌కి వెళ్లినా మందుల సరఫరా లేదు. సర్జికల్ ఎక్విప్‌మెంట్ లేక ఆపరేషన్లు నిలిచిపోయాయి. వెంటిలేటర్లు, డయాలసిస్ మెషిన్లు, చివరకు హాస్పిటల్ లిఫ్టులు కూడా రిపేరులో ఉన్నాయి. ఉత్తరాంధ్ర తలమానికం విశాఖ కేజీహెచ్‌లో మందుల్లేక రోగులు అల్లాడుతున్నారని, వైద్యులు ఆవేదన చెందుతున్నారని ఎల్లో మీడియానే రాసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మందుల్లేవు కానీ.. రాష్ట్రంలో ’మందుకు’ (లిక్కర్) మాత్రం కొరత లేదు. విశాఖపట్నం, చీరాల బీచ్‌లలో ఉదయం నుండి రాత్రి వరకు మద్యం అందుబాటులో ఉంచేలా ’బీచ్ షాక్స్ పాలసీ’కి ఆమోదం తెలిపారు. ఎన్నికల్లో రూ.99కే క్వార్టర్ మద్యం ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు రూ.140 కి అమ్ముతూ దోచుకుంటున్నారు. వీటిని ప్రశ్నిస్తే లోకేష్ తన ’రెడ్ బుక్ రాజ్యాంగం’ పేరుతో అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారు.‘ అమరావతి రైతుల కంట కన్నీరు.. 55 వేల ఎకరాల మాయాజాలం!: అమరావతి రైతులను కంటికి రెప్పలా కాపాడతానన్న చంద్రబాబు, నేడు ఆ రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నారు. పెద్దలకు కేటాయించినంత వేగంగా చిన్న రైతులకు ఎందుకు ప్లాట్లు ఇవ్వడం లేదు. ఇటీవల జగన్‌ను కలిసిన అమరావతి రైతులు చెప్పిన నిజాలు వింటే ఆశ్చర్యం వేస్తుంది, భూమి ఇవ్వని ఒక రైతు పొలం మధ్యలోంచి కాలువ తవ్వి మట్టి అమ్ముకున్నారు, మరో రైతు భూమి ఇవ్వలేదని పక్కనున్న రిజర్వాయర్‌కు గండి కొట్టి అతని పొలాన్ని కూడా చెరువుగా మార్చారు, ఇంకో రైతు ఒప్పుకోకపోయినా బలవంతంగా రిటర్నబుల్ ప్లాట్లను అతని భూమిలోనే రిజిస్ట్రేషన్ చేశారని ఆధారాలతో సహా బయటపెట్టారు. 55 వేల ఎకరాలు చాలవన్నట్లు మళ్లీ భూసేకరణ అంటూ ఎవరి కోసం ఈ మాయాజాలం చేస్తున్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టులోనే విమానాలు దిగడం లేదు కానీ.. కేంద్ర విమానయాన మంత్రి మీ పార్టీ వాడే కాబట్టి, అమరావతిలో మళ్లీ 5 వేల ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్ కడతామని చెప్తున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం దోపిడీ.. మనోళ్లకే వందల కోట్ల నజరానా!: ‘మనోడే.. దోచి పెట్టేద్దాం‘ అనే చందంగా పోలవరం ప్రాజెక్టులో కూటమి పెద్దలు అవినీతికి తెరలేపారు. పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన 5, 5–అ ప్యాకేజీలలో గతంలో ఉన్న రూ.352.60 కోట్ల అంచనా వ్యయాన్ని.. ఈ 24 నెలల కాలంలోనే ఏకంగా రూ.796.65 కోట్లకు (రూ.444 కోట్లు అదనంగా) పెంచేసి కాంట్రాక్టును రామోజీరావు కుమారుడి వియ్యంకుడికి చెందిన ఆర్‌వీఆర్ కంపెనీకి కట్టబెట్టారు. నిబంధనల ప్రకారం 15 శాతం కంటే అంచనా వ్యయం పెరిగితే టెండర్లు పిలవాలి కానీ, ఏకంగా 100 శాతం పెంచేసి నామినేషన్లపై ఎలా ఇస్తారు? వైయస్. జగన్ హయాంలో రూ.100 కోట్లు దాటితే జ్యుడీషియల్ ప్రివ్యూకి వెళ్లాలనే నిబంధన ఉంటే.. ఈ కూటమి ప్రభుత్వం ఆ నిబంధననే రద్దు చేసింది. అదే విధంగా పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు సంబంధించి టీడీపీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబుకు చెందిన ’ఎస్ ఆర్ కన్‌స్ట్రక్షన్స్’కు రూ.102 కోట్ల నజరానా కాంట్రాక్ట్ కట్టబెట్టారు. గతంలో ఆయన చేసిన పనులన్నీ నాణ్యత లేక నీళ్లు వదలగానే కొట్టుకుపోయినా మళ్లీ ఆయనకే దోచిపెట్టారు. 99 పైసలకే ఎకరం.. ల్యాండ్ స్కామ్‌లు: ప్రగతి ముసుగులో విశాఖలో అత్యంత విలువైన భూములను కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా ధారాదత్తం చేస్తోంది. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ కంపెనీలకు ఎకరం కేవలం 99 పైసల చొప్పున 22.19 ఎకరాలు కట్టబెట్టారు.. వీటి సంగతి ఎలా ఉన్నా.. చివరకు ఏడాది క్రితమే పుట్టిన ’ఉర్సా’ (అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఇన్ ప్యాకేజీ సిస్టమ్స్) అనే సంస్థకు కూడా 99 పైసలకే భూములిచ్చారు. ఐటీ కంపెనీల పేరిట భూములు లాక్కొని, లోపల మాత్రం 40 శాతం హౌసింగ్‌కు అమ్ముకోవచ్చని నిబంధనలు మార్చడం పెద్ద స్కామ్.అలాగే, బీచ్ రోడ్డులో మంత్రి లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీకి చెందిన గీతం క్యాంపస్‌కు రూ.5 వేల కోట్ల విలువైన 54 ఎకరాల ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తుంటే, వైయస్ఆర్‌సీపీ ఆందోళనల నేపథ్యంలో ఎంపీ భరత్ స్పందిస్తూ అది రూ.5వేల కోట్లు కాదు రూ.1000 కోట్లే అని ట్వీట్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. అంటే వారికి వెయ్యి కోట్లు చాలా తక్కువగా కనిపిస్తోందా?. రెండేళ్ల అప్పు రూ.2.83 లక్షల కోట్లు.. ఎటు పోయింది?: జగన్ హయాంలో కరోనా లాంటి కష్టకాలంలో కూడా అప్పు తెచ్చి నేరుగా పేదల సంక్షేమ పథకాలకు పారదర్శకంగా అందించాం. అప్పట్లో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని దుష్ప్రచారం చేసిన చంద్రబాబు.. ఈ రెండేళ్లలోనే ఏకంగా రూ.2.83 లక్షల కోట్లు అప్పులు చేశారు. వైయస్.జగన్ రూ.4 వేల కోట్లు అప్పు తెస్తే ’అప్పుల మోత’ అని రాసే పచ్చ పత్రికలు, చంద్రబాబు అదే రూ.4 వేల కోట్లు తెస్తే ’రుణ సమీకరణ’, ’సంపద సృష్టి’ అని భజన చేస్తున్నాయి. ఈ రెండేళ్లలో తెచ్చిన రూ.2.83 లక్షల కోట్ల అప్పు దేనికి ఖర్చు చేశారో మీ విజయోత్సవ సభల్లో పారదర్శకంగా చెప్పే ధైర్యం ఉందా?‘ వ్యవస్థల విధ్వంసం.. వైయస్ఆర్‌సీపీ పోరాటాల కార్యాచరణ: అంబేద్కర్ విగ్రహం నిర్లక్ష్యం: బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ వైయస్ఆర్‌సీపీఅని, జగన్ హయాంలో విజయవాడలో నిర్మించిన దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహ నిర్వహణను కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. ఏపీలో పోలీస్ ఉన్నతాధికారులు పోలీసులను బాబు అనుకూల వర్గం, జగన్ అనుకూల వర్గం అని రెండుగా చీల్చి పోస్టింగులు ఇస్తూ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారన్నారు. పంచాయతీ శానిటరీ వర్కర్లకు మూడు నెలలుగా జీతాల్లేక చేతులెత్తేస్తే అధికారులు బ్రతిమాలి పనులు చేయిస్తున్నారు. వెన్నుపోటు పార్టీ: తిరుమల లడ్డూ కల్తీ అంటూ ఏడాది పాటు డైవర్షన్ పాలిటిక్స్ చేసిన కూటమి నేతలు, జగన్ పార్టీని గొడ్డలి పార్టీ అంటున్నారని.. కానీ ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుది ’వెన్నుపోటు పార్టీ’ అని పిలవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, లోకేష్ తన ’రెడ్ బుక్’ రాజ్యాంగంతో గొంతు నొక్కాలని చూసినా భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం ఉన్న కోట్లాది మంది ప్రజలు వైయస్ఆర్‌సీపీ వెనుక ఉన్నారని గుర్తుచేశారు. ఈ రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అరాచకాలు, అవినీతి కుంభకోణాలు, సంక్షేమ పథకాల కోతలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పక్షాన రాజీలేని పోరాటం చేస్తుందని ప్రకటించారు. ఇందులో భాగంగానే జూన్ 4, 5 తేదీలలో మండల స్థాయి ధర్నాలను విజయవంతం చేశామని.. రాబోయే జూన్ 8, 9 తేదీలలో నియోజకవర్గాల్లో కూటమి వెన్నుపోట్లను ఎండగడుతూ సభలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజైన జూన్ 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు, బాధిత నిరుద్యోగులు, రైతులతో కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి తీరుతామని కురసాల కన్నబాబు స్పష్టం చేశారు.