తాడేపల్లి: తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకలోని విజయదుర్గ పీఠాధిపతి శ్రీ వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) గారి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్యం గారి మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ వేలాది మంది భక్తులకు మార్గదర్శకులుగా నిలిచిన సుబ్రహ్మణ్యం గారి మరణం ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటని వైయస్ జగన్ అన్నారు. ధర్మ పరిరక్షణ, సనాతన ఆధ్యాత్మిక విలువల ప్రచారం, భక్తి మార్గ బోధన కోసం ఆయన జీవితాంతం అంకితభావంతో కృషి చేశారని గుర్తుచేశారు. సుబ్రహ్మణ్యం గారి సేవలు, ఆధ్యాత్మిక బోధనలు భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్న ఆయన, ఈ మరణం భక్తజనులకు తీవ్ర వేదన కలిగించిందన్నారు. సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని కొనియాడారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులకు, శిష్యులకు, భక్తులకు వైయస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని దేవుడు వారికి ప్రసాదించాలని ప్రార్థించారు. పరమపదించిన సుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.