పొందూరులో వైయ‌స్ఆర్‌ విగ్రహం వద్ద ధ్వంసం.. 

ఆగ్రహం వ్యక్తం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు

 ప్రకాశం జిల్లా: టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో ఏర్పాటైన దివంగ‌త ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి విగ్రహం పిల్లర్‌కు అమర్చిన టైల్స్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.  రాత్రి ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. విగ్రహం పిల్లర్‌పై ఉన్న టైల్స్‌ను పగులగొట్టి పక్కకు విసిరివేయడంతో, విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగి ఉండవచ్చని గ్రామ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అలికిడి కావడంతో అప్రమత్తమైన దుండగులు అక్కడి నుంచి పరారై ఉండవచ్చని భావిస్తున్నారు.

ఈ ఘటనపై గ్రామంలోని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
వైయ‌స్ఆర్ అభిమానుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జరిగిన ఈ ఘటనను ఖండిస్తూ, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను అరికట్టాలని స్థానిక నాయకులు కోరారు.
 

Back to Top