ఇది వెన్నుపోటు, పన్నుపోటు ప్రభుత్వం

మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ ధ్వజం

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌.

ఎన్నికల హామీలు ఘనం.. అమలు మాత్రం శూన్యం

రెండేళ్ల చంద్రబాబు పాలనంతా బాదుడే బాదుడు

మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ ఫైర్‌

వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ని అని చంద్రబాబు నిరూపించుకున్నారు

సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు 

విద్యుత్, ఇంధన చార్జీలు తగ్గిస్తానని భారీగా పెంచేసిన చంద్రబాబు

రెండేళ్లలో రాష్ట్ర ప్రజలపై రూ.20 వేల కోట్ల విద్యుత్‌ చార్జీల భారం  

పెట్రోల్, డీజిల్‌ ధరల బాదుడుతో ఏటా రూ.8 వేల కోట్ల భారం

పార్కుల్లో వాకింగ్‌కి వెళ్లాలన్నా, అమరావతిలో బతకాలన్న కప్పం కట్టాల్సిందే

మద్యం ధరలు తగ్గించకపోగా పెంచి జనం జేబులు గుల్ల చేస్తున్నారు

ప్రెస్‌మీట్‌లో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ ఆక్షేపణ

తాడేపల్లి: రెండేళ్ల పాలనతో వెన్నుపోటుకు తాను బ్రాండ్‌ అంబాసిడర్‌ని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారని, హామీలు అమలు చేస్తానని మోసగించిందే కాకుండా వేర్వేరు పన్నులు, ఛార్జీల పేరుతో ప్రజలపై అదనపు భారం మోపి పేద ప్రజల నడ్డి విరిచేశాడని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ ధ్వజమెత్తారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు విద్యుత్‌ చార్జీలు, పెట్రోల్, డీజిల్, మద్యం రేట్లు తగ్గిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక ప్రజలపై మోయలేని భారం మోపాడని మండిపడ్డారు. విద్యుత్‌ చార్జీల రూపంలో రెండేళ్లలో ఏకంగా రూ.20 వేల కోట్లు, ఇంధన ఛార్జీల పెంపుతో ఏటా మరో రూ.8 వేల కోట్లు భారం మోపారని చెప్పారు. పెట్రోల్, డీజిల్‌ ధరల్లో ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని గుర్తు చేశారు.
    మద్యం ధరలు తగ్గిస్తానని ఎన్నికల్లో ప్రచారం చేసి, రూ.99 మద్యం, బీరు ఉత్పత్తులపై తప్ప, మిగిలిన అన్ని రకాల మద్యం బ్రాండ్లపై ఒక్కో బాటిల్‌ పై రూ.10 పెంచారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి బతుకు భారంగా మారిందని, ఆఖరుకి పార్కులో వాకింగ్‌ చేయాలన్నా, రాజధానిలో బతకాలన్నా ప్రభుత్వానికి కప్పం కట్టే దుస్థితి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రెస్‌మీట్‌లో కైలే అనిల్‌కుమార్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

చంద్రబాబు వంచన. దగా. బాదుడేబాదుడు:
    వెన్నుపోటుకు తానే బ్రాండ్‌ అంబాసిడర్‌ని తన రెండేళ్ల పాలన ద్వారా చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిందే కాకుండా సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. సంపద సృష్టించి ప్రజలకు పంచుతానని చెప్పిన చంద్రబాబు, సంపద సృష్టించకపోగా రెండేళ్లలోనే రూ.3.60 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని నిండా ముంచేశాడు. అది చాలదన్ననట్టు తన బాదుడే బాదుడు విధానాలతో రాష్ట్ర ప్రజలను దొరికినకాడికి దోచుకు తింటున్నాడు.
    ఎన్నికలకు ముందు కరెంట్‌ చార్జీలు, పెట్రోల్‌ డీజిల్‌ చార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దారుణంగా పెంచేశాడు. కరెంట్‌ బిల్లులు చూస్తే ప్రతి ఇంటికీ దాదాపు రెట్టింపు బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. అధికారంలోకి వచ్చాక పెట్రోల్‌ డీజిల్‌ పై సెస్‌ని సగానికి తగ్గిస్తామని నమ్మబలికారు. తీరా ఇప్పుడు చూస్తే ఇంధన ఛార్జీల్లో దేశంలోనే ఏపీ మొదటిస్థానంలో ఉంది. ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలతో ఏటా ప్రజలపై రూ.8 వేల కోట్ల అదనపు భారం పడుతోంది. ఇంధన చార్జీల పెంపుపై ప్రశ్నిస్తుంటే ఇరాన్‌ యుద్ధం పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
    ఈ పెరిగిన ఇంధన చార్జీల పేరు చెప్పి ఆర్టీసీ చార్జీలు పెంచడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కిలో మీటర్‌పై ఏకంగా రూ.5.72 పెంచుతారని చెబుతున్నారు. దీని వల్ల ప్రయాణికులపై ఏకంగా రూ.300 కోట్ల మేర భారం పడనుంది. కానీ ఆర్టీసీ నిర్వహణకు ఏటా రూ.220 కోట్లు ఇవ్వాలని సంస్థ యాజమాన్యం కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మహిళలకు ఉచిత ప్రయాణం (స్త్రీశక్తి పథకం) ఛార్జీలను ప్రభుత్వం ఆర్టీసికి ప్రతి నెలా చెల్లించకుండా, దశలవారీగా నిధులు విడుదల చేయడంతో సంస్థపై ఆర్థిక భారం పెరుగుతోంది. పద్ధతి ప్రకారం ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్రలు చేస్తున్నారు.  

మద్యం విక్రయాలు అప్‌. ప్రభుత్వ ఆదాయం డౌన్‌:
    బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూమ్‌లు రద్దు చేయడంతోపాటు, లిక్కర్‌ షాపులు, బార్ల సంఖ్యను కుదించి మద్యం విక్రయాలు, వినియోగాన్ని నియంత్రించడానికి గత ఐదేళ్ల వైయ‌స్ఆర్‌సీపీ పాలనలో వైయస్‌ జగన్‌ గారు కషి చేశారు. ఆ మేరకు ప్రభుత్వమే మద్యం విక్రయాలను నిర్వహించింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం విక్రయాలను చంద్రబాబు ఆదాయ వనరుగా మార్చేసుకున్నాడు. ఎక్కడికక్కడ బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ షాపులకు డోర్లు ఓపెన్‌ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన మద్యం ఆదాయాన్ని నేరుగా కూటమి నాయకుల జేబుల్లోకి మళ్లించాడు. అధికారంలోకి వస్తే  సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం అందిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు, తన పార్టీ నాయకులు కల్తీ మద్యం తయారు చేసి బెల్టు షాపులు ద్వారా విక్రయాలు చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రూ.99 మద్యం, బీరు ఉత్పత్తులపై తప్ప, మిగిలిన అన్ని రకాల మద్యం బ్రాండ్లపై ఒక్కో బాటిల్‌ పై రూ.10 పెంచుతూ ఈ ఏడాది జనవరి 12న ఉత్తర్వులు జారీ చేశారు.

రాజధానిలో బతకాలన్నా, పార్కులో వాకింగ్‌కి వెళ్లాలన్నా ట్యాక్స్‌:
    రాజధాని అమరావతి కేవలం సంపన్న వర్గానికి మాత్రమే అన్న సంకేతాలు ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు ఇచ్చింది. అదే దారిలో రాజధాని అమరావతి ప్రాంతంలో నివసించే ప్రజలు, వ్యాపారుల నుంచి ప్రపంచ బ్యాంక్‌ రుణపత్రం ప్రకారం అభివృద్ధి ఛార్జీలు, సెస్‌లు (రికవరీ టారిఫ్‌) వసూలు చేయనున్నారు. డబ్బుల కోసం ప్రభుత్వం ఎంతగా దిగజారి పోయిందంటే విశాఖ, గాజువాకలోని రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ఉదయం, సాయంత్రం వచ్చే వాకర్లపై గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) యూజర్‌ ఛార్జీలు విధించింది. స్టేడియంలోకి అడుగు పెట్టాలంటే నెలకు రూ.60 చొప్పున ఏడాదికి రూ.720 చెల్లించాలన్న నిబంధన పెట్టడంతో వాకింగ్‌కు వచ్చే వారి సంఖ్య వందల నుండి పదుల సంఖ్యకు పడిపోయింది. 

తడిసిమోపెడు కానున్న నీటి పన్నుల భారం:
    తాగునీటి పథకాల నిర్వహణ పాలసీ పేరుతో గత ఏడాది దీపావళి నుంచి ప్రభుత్వం ప్రత్యేకంగా యూజర్‌ ఛార్జీలు వసూలు చేస్తోంది. ఆ మేరకు గ్రామీణ ప్రాంతాల ప్రజలపై ఏటా రూ.1,036.97 కోట్ల భారం మోపుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. పట్టణ ప్రజలు చెల్లించే నీటి బిల్లు కూడా తడిసి మోపెడు కానుంది. కేంద్ర నిధుల కోసం ప్రజలపై భారం మోపడానికి ప్రభుత్వం సిద్దమైంది. అమృత్‌ 2.0 షరతుల్లో భాగంగా, ప్రభుత్వం ఆ దిశలో అడుగులు వేసింది. అందుకోసం జీఓ నెం:673 జారీ చేసింది. ఇప్పటి వరకు వాడుకునే నీటికి మాత్రమే బిల్లు చెల్లించే విధానం అమలులో ఉండగా, తాజా ఉత్తర్వుల మేరకు కేంద్రం నుంచి వచ్చే ప్రతి చుక్క నీటికి ఛార్జీ చెల్లించే దుస్థితిని తీసుకొస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే నీటి సరఫరాకు ఎంత వ్యయం అయితే, ఆ మొత్తాన్ని ప్రజల నుంచి వసూలు చేయబోతున్నారు. రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థల్లో 25.6 లక్షల నీటి కుళాయి కనెక్షన్లు ఉండగా, వాటి ద్వారా ఏటా రూ.350 కోట్ల నుంచి రూ.450 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఇక నుంచి ఆ ఆదాయం గణనీయంగా పెరగనుంది.

రూ. 20 వేల కోట్ల విద్యుత్‌ ఛార్జీల భారం:
    కూటమి అధికానంలోరి వస్తే విద్యుత్‌ ఛార్జీలు పెంచేది లేదని, తగ్గిస్తామని ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి నమ్మించిన చంద్రబాబు, అధికారంలోకి రాగానే ఇక్కడా పచ్చి మోసం చేశారు. నాలుగు విడతల్లో విద్యుత్‌ ఛార్జీలు బాదారు. ఇప్పటి వరకు విద్యుత్‌ వినియోగదార్లపై అక్షరాలా రూ.20 వేల కోట్ల భారం వేశారు. అయినా నిస్సిగ్గుగా విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదని, పైగా తగ్గించామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. కూటమి అధికారంలకి వచ్చాక వేరశెనగ నూనె ఏకంగా రూ.31లు పెరిగింది. బియ్యం ధర టోకు మార్కెట్లో 26 కేజీల బస్తా ధర రూ.50 పెరిగితే, రిటైల్‌ మార్కెట్లో రూ.100 నుంచి రూ.120 వరకు పెరిగింది. 

రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపు:
    కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పడిపోవడంతో తగ్గిన ఆదాయాన్ని కవర్‌ చేసుకోవడానికి భూముల విలువలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచారు. గత ఏడాది కూడా 50 శాతం పెంచగా, ఏడాదిన్నర వ్యవధిలోనే రెండుసార్లు ఛార్జీలు దాదాపు రెట్టింపు చేశారు. రాష్ట్రంలోని 90 శాతం ప్రాంతాల్లో భూముల విలువలు సవరించడం వల్ల రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు దారుణంగా పెరిగాయి. అది మాత్రమే కాకుండా వాహనాల కొనుగోలుపై 10 శాతం రోడ్‌ సెస్‌ విధిస్తూ ఈ ఏడాది జనవరిలో ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ప్రజలపై ఏటా రూ.1500 కోట్ల భారం వేస్తోంది. కేంద్రం వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించినా, ఆ ఊరట ప్రజలకు దక్కకుండా చంద్రబాబు రోడ్‌ సెస్‌ పేరుతో బాదారని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ వివరించారు.

Back to Top