కూనిపోగు ఇర్మియాకు అండగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి 

 దళిత నాయకుడికి జరిగిన అన్యాయంపై అధికారులకు వినతి 

కలిగిరి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కూనిపోగు ఇర్మియాకు చెందిన బోర్లను తొలగించడం కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఉదయగిరి వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇర్మియాకు న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

మేకపాటి రాజగోపాల్ రెడ్డి, యువనేత మేకపాటి అభినవ్ రెడ్డి ఆదేశాల మేరకు కలిగిరి తహసీల్దార్ కార్యాలయంలో కూనిపోగు ఇర్మియా స్థానిక రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పందిటి కామరాజు, కలిగిరి మండల కన్వీనర్ కాటం రవీంద్రారెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఒంగోలు రాఘవేంద్ర, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి దావులూరి వెంకటేష్, కలిగిరి ఎస్సీ సెల్ అధ్యక్షుడు వేల్పల తిరుపాల్‌తో పాటు తెల్లపాడు గ్రామస్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇర్మియా మాట్లాడుతూ, తనకు న్యాయం జరగని పక్షంలో జాతీయ ఎస్సీ కమిషన్, మానవ హక్కుల సంఘాలను ఆశ్రయించి జరిగిన అన్యాయాన్ని వివరిస్తామని తెలిపారు. ఇర్మియాకు జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే కొత్త బోరు ఏర్పాటు చేయడానికి అవసరమైన సహాయం అందిస్తామని మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముందుకు రావడం తనపై పార్టీ నాయకత్వానికి ఉన్న ఆదరణకు నిదర్శనమని ఇర్మియా పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో అండగా నిలిచిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మేకపాటి అభినవ్ రెడ్డి, ఎస్సీ సెల్ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
 

Back to Top