తాడేపల్లి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారంటూ కూటమి ప్రభుత్వంపై వైయస్ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో విరుచుకుపడింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు "వెన్నుపోటుకు రెండేళ్లు" పేరుతో గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు, విజయవాడ నుంచి కాకినాడ వరకు, నెల్లూరు నుంచి రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. నిరసనల్లో భాగంగా టీడీపీ మేనిఫెస్టో ప్రతులు, సూపర్ సిక్స్ హామీల బాండ్లు, ఎన్నికల ప్రచార కరపత్రాలను నాయకులు, కార్యకర్తలు దహనం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రెండేళ్లుగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. గుంటూరు గుంటూరు లాడ్జి సెంటర్, శారదా కాలనీ ఆర్చి సెంటర్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు పాలన రెండేళ్లలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. శ్రీకాకుళం సారవకోట, జలుమూరు ప్రాంతాల్లో జరిగిన నిరసనల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొని సూపర్ సిక్స్, నిరుద్యోగ భృతి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి హామీలు అమలు కాలేదని మండిపడ్డారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాకినాడ కాకినాడ రూరల్ కరపలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ రెండేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండూ కుంటుపడ్డాయని ఆరోపించారు. రైతులు, ఆక్వా రంగం, ఆరోగ్య రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని పేర్కొన్నారు. విజయవాడ విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో కూటమి ప్రభుత్వం ప్రజల శ్రేయస్సును విస్మరించిందని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైందని, నగర అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్నారు. మరోవైపు పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో భారీ నిరసన చేపట్టి మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. నెల్లూరు పొదలకూరులో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఉచిత గ్యాస్, తల్లికి వందనం వంటి పథకాలపై ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రాయలసీమలోనూ నిరసనల జోరు కళ్యాణదుర్గం, తంబళ్లపల్లె, వైయస్సార్ జిల్లా తదితర ప్రాంతాల్లో కూడా భారీ ర్యాలీలు నిర్వహించారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులు, బీసీలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడాన్ని నిరసిస్తూ నాయకులు మండిపడ్డారు. చంద్రగిరి నుంచి జగ్గంపేట వరకు ఒకే నినాదం చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నాయకత్వంలో అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు జరిగాయి. జగ్గంపేటలో మాజీ మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే స్వరంతో "సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్", "ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం" అంటూ నినాదాలు మార్మోగాయి. పోరాటం మరింత ఉధృతం చేస్తాం: వైయస్ఆర్‌సీపీ ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేసిన వైయస్ఆర్‌సీపీ నేతలు, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల ఆశలను వమ్ము చేసిందని, ఆ అసంతృప్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే "వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.