తాడేపల్లి : మైనారిటీల సమస్యల పరిష్కారంతో పాటు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అరాచకాలపై బలమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మైనారిటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, మైనారిటీ నాయకులు కేవలం తమ వర్గ సమస్యలకే పరిమితం కాకుండా ప్రజల సమస్యలపై పోరాడే నాయకులుగా ఎదగాలని సూచించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైయస్ జగన్ పాలన సాగించారని, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలను పూర్తిగా మోసం చేసిందని సజ్జల విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు కాకుండా పోయాయని, ఇప్పటికే అమలులో ఉన్న అనేక సంక్షేమ పథకాలకు కూడా కోతలు విధించారని ఆరోపించారు. వైయస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులను ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లలోనే చేసిందని, అయినప్పటికీ ప్రజలకు చెప్పుకోదగ్గ ఒక్క మంచి పని కూడా చేయలేకపోయిందని విమర్శించారు. జగన్ మరో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే రాష్ట్ర అభివృద్ధి దిశ పూర్తిగా మారిపోయేదని అన్నారు. ఇటీవల చంద్రబాబు చేసిన “గొడ్డలి పార్టీ” వ్యాఖ్యలపై స్పందిస్తూ, వైయస్ఆర్‌సీపీ ప్రజలను మోసం చేసే శక్తులపై పోరాడే పరుశురాముడి గొడ్డలి లాంటిదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. డీఎస్సీ-2025 నియామకాల అంశంపై మాట్లాడుతూ, బాధిత అభ్యర్థులు వైయస్ జగన్‌ను కలిసి తమ సమస్యలు వివరించినా, వాటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం విమర్శలకు దిగడం విచిత్రమని అన్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది ఉద్యోగాలను ఎలాంటి వివాదాలు లేకుండా భర్తీ చేశామని, ప్రస్తుతం డీఎస్సీ నియామకాల్లో అనేక అనుమానాలు తలెత్తాయని పేర్కొన్నారు. మైనారిటీలకు వైయస్ఆర్‌సీపీ ఎప్పుడూ అండగా నిలిచిందని, భవిష్యత్తులో కూడా అదే విధంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, ఓటర్ల జాబితాలో అనుకూల ఓట్ల తొలగింపునకు అవకాశం ఇవ్వకుండా ప్రతి కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేసి పార్టీ బలాన్ని చాటాలని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాను సమర్థవంతంగా వినియోగిస్తూ పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.