అనంతపురం : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ పేరుతో టీడీపీ దొడ్డిదారిన వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, శింగణమల నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్ ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయంలో రాజకీయ నాయకుడు అధికారుల స్థానంలో కూర్చొని ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శింగణమలలో టీడీపీ నాయకుడు నేరుగా SIR కార్యక్రమంలో జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై వైయస్ఆర్‌సీపీ శ్రేణులతో కలిసి డిప్యూటీ తహసీల్దార్‌కు, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ అధికారిని నిలబెట్టి రాజకీయ కార్యకర్త ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని శైలజానాథ్ పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు ఎన్నికల వ్యవస్థ నిష్పక్షపాతంపై ప్రజల్లో అనుమానాలు కలిగిస్తున్నాయని అన్నారు. అధికారుల కుర్చీల్లో కూర్చొని ఓటర్ల జాబితాలో జోక్యం చేసుకోవడం అత్యంత అనుచితమని విమర్శించారు. ఓటర్ల జాబితాలో ఉన్న ఓట్లను తొలగించడం, అధికార పార్టీకి అనుకూల ఓట్లను చేర్చడం వంటి చర్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన అధికారులను వెంటనే పక్కనపెట్టి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. SIR ప్రక్రియలో జోక్యం చేసుకున్న టీడీపీ నాయకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ఓటర్ల జాబితా ప్రక్రియను టీడీపీ శాసించే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోందని విమర్శించారు. యాప్‌ల పేరుతో ప్రతిపక్ష ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందనే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. SIR ప్రక్రియలో రాజకీయ జోక్యం అంటే రాజ్యాంగాన్ని, ఎన్నికల వ్యవస్థను అవమానించడమేనని శైలజానాథ్ అన్నారు. ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులను డిమాండ్ చేశారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.