ప్రొద్దుటూరు: వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 23 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించామని, అలాంటి హౌసింగ్ ప్రాజెక్టులో రూ.1.75 కోట్ల విలువైన ఐరన్ కడ్డీలు మాయమవడం అత్యంత తీవ్రమైన విషయం అని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ వ్యవహారంలో హౌసింగ్ ఏఈ కేఎల్ సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేసి కోర్టు రిమాండ్ విధించడం విచారణలో కీలక పరిణామమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ.1.75 కోట్ల విలువైన ఐరన్ కడ్డీలను దొంగతనంగా తరలించిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన శిక్షకు గురికావాల్సిందేనన్నారు. ప్రభుత్వ ఆస్తులను దోచుకున్న వారిని గుర్తించి, వారి వద్ద నుంచి మొత్తం ఐరన్‌ను పోలీసులు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం 268 టన్నుల ఐరన్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటేనే పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని అన్నారు. ఈ హౌసింగ్ ఐరన్ దొంగతనం వ్యవహారానికి స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కార్యాలయానికి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయని, వాటిపై కూడా సమగ్ర దర్యాప్తు జరగాలని కోరారు. డీడీఆర్‌సీ సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి స్వయంగా హౌసింగ్ శాఖలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని గుర్తు చేసిన రాచమల్లు, ఆ ఫిర్యాదును తాను కూడా స్వాగతిస్తున్నానన్నారు. నిజాలు వెలుగులోకి రావాలంటే నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.