కాకాణి కుటుంబంపై ప్ర‌భుత్వం క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఫైర్‌

నెల్లూరు జిల్లా :   మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి కుటుంబంపై పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మండిప‌డ్డారు. కోవూరు పోలీసులు వాట్సాప్ ద్వారా జారీ చేసిన నోటీసులపై ఆమె ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.

గుమ్మళ్లదిబ్బలో గంజాయి మత్తులో మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి ఆమె మృతి చెందిన ఘటనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఇప్పటికే విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గంజాయి విచ్చలవిడితనం, ప్రభుత్వ వైఫల్యం కారణంగానే బాలిక మృతి చెందిందని కాకాణి పూజిత ఆవేదన వ్యక్తం చేయడంతో ఆమెకు కూడా నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు.

మైనర్ బాలిక మృతి ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించడం, మీడియా సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలు, పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టడాన్ని జీర్ణించుకోలేక ఆధారాలతో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేయడం సరైంది కాదని ఆమె విమర్శించారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడమే నేరంగా భావిస్తూ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం, విచారణ పేరుతో పోలీస్ స్టేషన్లకు పిలవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ప్రజలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు.

ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపులకు పాల్పడుతున్నా తాము ధైర్యంగా ఎదుర్కోగలమని కాకాణి పూజిత ధీమా వ్యక్తం చేశారు. మైనర్ బాలిక మృతి ఘటనలో లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పలేని పోలీసులు వివరణ కోరడం విడ్డూరమని విమర్శించారు. అదే సమయంలో నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై కూడా పోలీసులు నోటీసులు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. అలాగే తిరుమల శ్రీ వారి లడ్డూ ప్రసాదం అంశంపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, ప్రభుత్వం మరియు పోలీసులు దీనిని గుర్తుంచుకోవాలని కాకాణి పూజిత సూచించారు. పక్షపాత ధోరణితో వ్యవహరించడం తగదని హెచ్చరించారు.

Image

Back to Top