తాడేపల్లి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రతినిధుల పదవీకాలం ముగియడమే తడవుగా, గ్రామ పంచాయతీల నిధులను కొల్లగొట్టేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన కుట్రలకు తెరలేపిందని వైయస్ఆర్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్ర రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 2న సర్పంచుల పదవీకాలం పూర్తి కాగానే, ఏప్రిల్ 3న ఆగమేఘాల మీద ‘నీటి భద్రత’ పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన జీవోల వెనుక అసలు ఉద్దేశం టీడీపీ నేతలను పందికొక్కుల్లా మేపడమేనని మండిపడ్డారు. కేంద్రం విడుదల చేసిన రూ. 1,026 కోట్ల నిధులను ఇన్నాళ్లూ తొక్కిపెట్టి, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలన అడ్డం పెట్టుకుని అధికారుల ద్వారా నిధులు మళ్లించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. బీసీ జనాభాను తేల్చకుండా, ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తూ గ్రామాల్లో దోపిడీకి బాటలు వేస్తున్నారని విమర్శించారు. ఒకవైపు మాజీ సర్పంచులకు బిల్లులు చెల్లించకుండా హక్కులను కాలరాస్తూ, మరోవైపు వైయస్ఆర్‌సీపీ హయాంలో నియమితులైన 8,500 మంది పంచాయతీ సెక్రటరీల జీతాల్లో కోత విధిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని.. ఈ అక్రమాలపై తాము పోరాటం చేస్తామని రవీంద్ర రెడ్డి హెచ్చరించారు." ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... - నిధుల తొక్కిపెట్టి, సర్పంచులపై మానసిక క్షోభ.. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం కింద విడుదల చేసిన రూ. 1,026 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కావాలనే తొక్కిపెట్టింది. వైయస్ఆర్‌సీపీ పోరాటాల ఫలితంగా ఆ నిధులు విడుదలైనప్పటికీ, సర్పంచుల పదవీకాలం ముగిసే వరకు ఒక్క రూపాయి కూడా డ్రా చేయనివ్వకుండా అధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చారు. సర్పంచుల అకౌంట్లలో డబ్బు ఉన్నా, తాగునీరు మరియు పారిశుధ్య పనులకు కూడా ఖర్చు చేయనివ్వకుండా అడ్డుకోవడం సర్పంచులను మానసిక క్షోభకు గురిచేయడమే. - టీడీపీ నేతలను మేపడానికే కొత్త జీవోలు.. ఏప్రిల్ 2వ తేదీతో సర్పంచుల పదవీకాలం ముగియగానే, ఏప్రిల్ 3న ఆగమేఘాల మీద ‘నీటి భద్రత’ పేరుతో ప్రభుత్వం జీవో విడుదల చేయడం వెనుక పెద్ద కుంభకోణం ఉంది. "కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులను పందికొక్కుల్లా మేపడానికే ఈ జీవోలు తెచ్చారు. స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలను ఉపయోగించుకుని ప్రజాధనాన్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. స్పెషల్ ఆఫీసర్లకు, అధికారులకు ఒకటే హెచ్చరిక.. మీరు అధికార పార్టీ నేతల కోసం తప్పుడు చెక్కులపై సంతకాలు పెడితే కోర్టుల ముందు దోషులుగా నిలబడక తప్పదు". - ఎన్నికల నిర్వహణలో వైఫల్యం – బీసీలపై వివక్ష.. ఏప్రిల్ తో సర్పంచుల పదవీకాలం ముగియనున్న నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వంతో సెప్టంబరులోనే సంప్రదించింది. రానున్న ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ.. ఎన్నికల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. అయినా కూటమి ప్రభుత్వం కావాలనే ఈ అంశాన్ని తొక్కిపెట్టింది. బీసీ జనాభాను తేల్చకుండా, రిజర్వేషన్లు ఖరారు చేయకుండా కాలయాపన చేస్తూ.. గ్రామాల్లో తమ పార్టీ నేతలు దోచుకోవడానికి వీలుగా స్పెషల్ ఆఫీసర్ల పాలనను పొడిగిస్తోంది. - దొంగ బిల్లుల కుంభకోణం.. గతంలో (2016-19) పనులు చేసినట్టుగా టీడీపీ నేతలు దొంగ బిల్లులు రాసుకుని ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. చట్టబద్ధంగా పనిచేసిన వైయస్ఆర్‌సీపీ మాజీ సర్పంచులకు బిల్లులు ఆపేసి, పాత పనుల పేరుతో టీడీపీ నేతలకు చెల్లింపులు చేయడం దారుణం. "కూటమి నేతల అవినీతిని భరించలేకే కేంద్రం ఎన్‌ఆర్‌ఈజీఎస్ చట్టాన్ని ‘జీ రామ్ జీ’గా మార్చింది. దీనిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి". - పంచాయతీ సెక్రటరీలపై కక్ష సాధింపు.. వైయస్ఆర్‌సీపీ హయాంలో నియమితులయ్యారనే నెపంతో 8,500 మంది పంచాయతీ సెక్రటరీలపై ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. "జీవో 91 ప్రకారం వారికి రావాల్సిన రూ. 28,250 బేసిక్ జీతాన్ని, జీవో 60 ద్వారా రూ. 25,250కి తగ్గించి ప్రతి ఉద్యోగికి నెలకు రూ. 3 వేల నష్టం చేకూర్చారు. ఇది చాలా అన్యాయం.తక్షణమే ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన జీవో 60 ను ఉపసంహరించుకుని పాత జీవో ప్రకారం వారికి రావాల్సిన జీతాన్ని చెల్లించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ వెన్నపూస రవీంద్రరెడ్డి డిమాండ్ చేశారు.