విజయవాడ: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్‌కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏబీఎన్ రాధాకృష్ణపై వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి లంపల్లి శ్రీనివాసరావు , మాజీ మేయర్ మరియు ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి , మైలవరం నియోజకవర్గ పరిశీలకురాలు బండి పుణ్యశీల తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాధాకృష్ణ రాతలు మహిళలను అవమానించేలా ఉన్నాయని పేర్కొంటూ, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాచవరం పోలీస్ స్టేషన్‌కి ర్యాలీ మాచవరం పోలీస్ స్టేషన్‌కు వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా చేరుకొని రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల నీచమైన రాతలు రాసినందుకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ , మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ , మాజీ కార్పొరేటర్లు మరియు వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వైయస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను అవమానించేలా రాసిన వ్యాఖ్యలకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించిన తప్పుడు రాతలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ పార్టీ ఇంచార్జ్ పీవీఎల్ నరసింహారాజు తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై, పార్టీ నేతల కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తుని టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఎస్. అన్నవరం నుంచి తుని టౌన్ పోలీస్ స్టేషన్ వరకు పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ… రాధాకృష్ణ వికృత మనస్తత్వం బయటపడిందని మండిపడ్డారు. రాజధాని అంశంపై వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూచించిన “మావిగాన్”ను డైవర్ట్ చేయడానికే వైయస్ఆర్‌సీపీ నాయకుల కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ జిల్లా: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వైయస్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ నరేన్ రామాంజులరెడ్డి డిమాండ్ చేశారు. కమలాపురం పోలీస్ స్టేషన్‌లో రాధాకృష్ణపై ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నరేన్ రామాంజులరెడ్డి మాట్లాడుతూ… మావిగన్ అనేది రాష్ట్రానికి ఒక ముఖ్యమైన ఆర్థిక వనరని తెలిపారు. అమరావతి రాష్ట్రానికి గుదిబండగా మారిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అసమర్థత వల్లే మావిగన్‌ను వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చారని వివరించారు. అరకు: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి అరకు వ్యాలీ పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమానికి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మహిళలపై, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరియు వైయస్ఆర్‌సీపీ నాయకుల కుటుంబ సభ్యులపై ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమైన ఆలోచనతో చేసినవని తీవ్రంగా మండిపడ్డారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా చేసిన ఈ వ్యాఖ్యలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, మహిళా కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాప్తాడు: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై రాప్తాడులో కూడా వైయస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ… రాధాకృష్ణ జర్నలిజం విలువలను పూర్తిగా విస్మరించి రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రత్యర్థులపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు అత్యంత ఖండనీయమని, వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మచిలీపట్నం: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై మచిలీపట్నం పట్టణంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం వైయస్ఆర్‌సీపీ ఇంచార్జ్ పేర్ని కృష్ణమూర్తి, మచిలీపట్నం టౌన్ ఇంచార్జ్ మేకల సుబ్బన్న ఆధ్వర్యంలో పలువురు కార్పొరేషన్ ఇంచార్జ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ… ఆంధ్రజ్యోతి సంస్థలో ప్రసారమయ్యే “కొత్త పలుకు” కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు, పార్టీ నాయకులు, ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులపై, మహిళలపై నీచమైన భాషలో దూషించడం తీవ్రంగా ఖండనీయమని తెలిపారు. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పకుండా మరింత దిగజారి ప్రవర్తించడం ఆక్షేపణీయమని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తిరుపతి: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో వైయస్ఆర్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ టౌన్ అధ్యక్షుడు మల్లం రవి చంద్ర రెడ్డి, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గీత యాదవ్, బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు యాదవ్, నల్లని బాబు మరియు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ… వైయస్ఆర్‌సీపీ మహిళా నాయకులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. వెంటనే రాధాకృష్ణపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కావలి: ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కావలిలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా నిరసన వ్యక్తం చేశారు. మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కావలి పట్టణ మరియు రూరల్ మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు కలిసి 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నందనవనం సీతాలక్ష్మి, పర్రి మహేశ్వరి, పందిటి సుమలత, వెంగల్ శెట్టి కళ్యాణి, గంధం ప్రసన్నాంజనేయులు తదితరులు మాట్లాడుతూ… మహిళలను అవమానకరంగా మాట్లాడడం సభ్య సమాజం తలదించుకునే విషయం అని అన్నారు. మహిళా కార్యకర్తల వ్యక్తిత్వాన్ని కించపరచడం అసహ్యకరమని, ఇటువంటి చర్యలు తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. అలాగే మీడియా బాధ్యతలను విస్మరించి మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం తగదని, చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. పలమనేరు: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై పలమనేరు పట్టణంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పలమనేరు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వెంకటే గౌడ మాట్లాడుతూ… ఆంధ్రజ్యోతి టెలివిజన్ చానల్‌లో ఈ నెల 4న ప్రసారమైన “వీకెండ్ కామెంట్ బై ఆర్కే” కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా, మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు దారుణమని మండిపడ్డారు. జర్నలిజంలో అనుభవం ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, ఒక పత్రిక, చానల్ యజమాని ఈ స్థాయిలో మాట్లాడటం అనేది అరుదైన విషయం అని విమర్శించారు. మహిళల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ… వైయస్ఆర్‌సీపీ నాయకుల కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం తగదని పేర్కొన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన మావిగన్ అంశంపై స్పందనను మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. మహిళలను గౌరవించడం సమాజ బాధ్యత అని, పురాణాలు, ఇతిహాసాలు కూడా అదే చెబుతున్నాయని పేర్కొన్నారు. కదిరి: వైయస్ఆర్‌సీపీ నాయకులపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై కదిరి పట్టణంలో పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కదిరి సమన్వయకర్త బి.యస్. మక్బూల్ ఆదేశాల మేరకు వైయస్ఆర్‌సీపీ నాయకులు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ… వైయస్ఆర్‌సీపీ నాయకులపై జుగుప్సాకరమైన, అవమానకర వ్యాఖ్యలు ప్రచారం చేయడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. ఏబీఎన్ రాధాకృష్ణపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఛానల్ ప్రసారాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కోరారు. రాజమహేంద్రవరం: ఆంధ్రజ్యోతి పత్రికలో అమరావతి అంశంపై రాసిన వ్యాసంలో వైయస్ఆర్‌సీపీ నేతలు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎడిటర్ రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు సబ్ ఇన్స్పెక్టర్ కేశవకు ఫిర్యాదు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి మాట్లాడుతూ… పత్రికా స్వేచ్ఛ ముసుగులో మహిళలపై, వైయస్ఆర్‌సీపీ నేతలపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండనీయమని అన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాధాకృష్ణ మహిళలకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే సీనియర్ నాయకుడు వాసంశెట్టి గంగాధరరావు మాట్లాడుతూ… రాధాకృష్ణ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో అలజడులు రేపాయని, మహిళల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మార్తి నాగేశ్వరరావు, మజ్జి అప్పారావు, మార్గాని సురేష్, రజనీకాంత్, అరే చిన్ని, తిరగాటి దుర్గారావు, బిల్డర్ చిన్నా, రొక్కం త్రినాథ్, సప్ప ఆదినారాయణ, దుర్వాసుల సత్యనారాయణ, యజ్జవరపు శ్రీను, నందం స్వామి, శాండీ, అందనపల్లి సత్యనారాయణ, చెక్క వెంకటేశ్వరరావు, ఉమా యాదవ్, ఇమ్రాన్, బబ్లూ, గౌరీ శంకర్, కటకం చిన్నా, గుడివాడ అప్పారావు, వట్టికూటి కృష్ణవేణి, అనురాధ తదితరులు పాల్గొన్నారు. కనిగిరి: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కనిగిరి పట్టణంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం స్థానిక కనిగిరి పోలీస్ స్టేషన్‌లో నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ఎస్‌ఐకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ… వైయస్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన మావిగన్‌కు వస్తున్న ప్రజా స్పందనను జీర్ణించుకోలేకే రాధాకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. వైయస్ఆర్‌సీపీ నాయకులు, ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులపై నీచమైన, నికృష్టమైన భాషలో వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజం తలదించుకునే విషయం అని పేర్కొన్నారు. జర్నలిజం ముసుగులో ఇష్టమొచ్చినట్లు రాయడం తగదని, ఇది పూర్తిగా ఖండనీయమని అన్నారు. ఆదోని: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ అధినేత రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదోని నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కర్నూల్ పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాయి ప్రసాద్ రెడ్డి నివాసం నుండి ఆదోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ చేపట్టి, అనంతరం రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ర్యాలీ సందర్భంగా “రాధాకృష్ణ డౌన్ డౌన్”, “మహిళల అవమానాన్ని సహించము” వంటి నినాదాలతో పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌లో ప్రసారమవుతున్న “వీకెండ్ విత్ ఆర్కే” కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకుల కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా మహిళలపై చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమైనవని, అసభ్యకరమైనవని తీవ్రంగా ఖండించారు. ఈ విధమైన వ్యాఖ్యలు సమాజంలో మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనపర్తి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా ప్రసారమైన “వీకెండ్ కామెంట్ బై ఆర్కే” కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారు, పార్టీ నాయకులు, ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ అనపర్తి నియోజకవర్గంలో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో, నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి కార్యాలయం ఆధ్వర్యంలో వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం నేతలు గురువారం (09-04-2026) ఉదయం అనపర్తి పోలీస్ స్టేషన్‌లో ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఫిర్యాదు పత్రం సమర్పించారు. వైయస్ఆర్‌సీపీ నేతల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దూషణలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మహిళా నేతలు పేర్కొన్నారు. “పత్రిక, ఛానల్ ఉన్నాయనే కారణంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించం. మహిళలపై ఇలాంటి అసభ్యకరమైన రాతలు సమాజానికి ప్రమాదకరం” అని వారు స్పష్టం చేశారు. రాధాకృష్ణ రాతలు బూతు కంటే ప్రమాదకరంగా మారాయని, వెంటనే వాటిని వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, పాత్రికేయ బాధ్యతలను మరిచి వ్యక్తిగత దూషణలకు దిగడం తీవ్రంగా ఖండనీయమని, మహిళల గౌరవాన్ని తుంగలో తొక్కేలా రాసిన రాతలు మీడియా నైతికతకు విరుద్ధమని విమర్శించారు. “ఇలాంటి వికృతమైన రాతలు రాసే వ్యక్తిని ఇకపై జర్నలిస్ట్‌గా సంబోధించవద్దు” అంటూ పాత్రికేయ లోకానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఇమ్మండి విజయ కుమారి, తూర్పుగోదావరి జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు వారా కుమారి, జామిశెట్టి గంగా భవాని, తేతలి కళావతి, నూతిక లక్ష్మి, వేమగిరి సత్యవతి, రేజెట్టి రాజ్యలక్ష్మి, ముప్పిడి శారమ్మ, కె. భాగ్యలక్ష్మి, ఉండ్రాజపు రత్న కుమారి, చంద్రమల్ల బుజ్జి తదితరులు పాల్గొన్నారు. గుంతకల్లు, పాలకొల్లు, నెల్లూరులో నిరసనలు గుంతకల్లు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షురాలు వై. నైరుతి రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పాలకొల్లులో వైయస్ఆర్‌సీపీ ఇంచార్జి గుడాల శ్రీహరి గోపాలరావు నేతృత్వంలో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరులో రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆధ్వర్యంలో పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, రాధాకృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ, “మహిళలపై చేసిన వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్ని అవమానించేలా ఉన్నాయి” అని తీవ్రంగా ఖండించారు. నరసాపురం, నిడదవోలు, భీమవరం ప్రాంతాల్లో ఆందోళనలు నరసాపురం నియోజకవర్గంలో స్థానిక నాయకులు ఫిర్యాదు చేసి మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, మహిళలు కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భీమవరంలో సమన్వయకర్త చిన్నవిల్లి వెంకట రాయుడు నేతృత్వంలో ఫిర్యాదు చేస్తూ రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళగిరి, తెనాలి, విజయవాడలో ఫిర్యాదులు మంగళగిరిలో సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తెనాలిలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విజయవాడ సెంట్రల్‌లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమక్షంలో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందజేశారు. రంపచోడవరం, జగ్గంపేట, మైలవరం ప్రాంతాల్లో ఆగ్రహం రంపచోడవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆధ్వర్యంలో అడ్డతీగల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జగ్గంపేటలో మాజీ మంత్రి తోట నరసింహం పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మైలవరంలో జోగి రమేష్ ఆదేశాల మేరకు పామర్తి శ్రీనివాసరావు కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ నాయకులు మాట్లాడుతూ, జర్నలిజం ముసుగులో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు. రాధాకృష్ణ వ్యాఖ్యలు వినడానికి కూడా అసహ్యంగా ఉన్నాయని, ఇవి ఒక్క వ్యక్తిని కాదు మొత్తం మహిళా సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.