12మంది విద్యార్థినిలను ఎలుకలు కరిస్తే చోద్యం చూస్తారా?

వైయ‌స్ఆర్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆగ్ర‌హం

ఎ.కొండూరు కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని సంద‌ర్శించిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

ఎన్టీఆర్ జిల్లా: క‌స్తూర్భా పాఠ‌శాల‌లో 12మంది విద్యార్థినిలను ఎలుకలు కరిస్తే విషయం బయటకు పొక్కకుండా దాచి పెట్టి అధికారులు చోద్యం చూస్తారా అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిప‌డ్డారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఎ.కొండూరు కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని దేవినేని అవినాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో 12 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన బయటకు రాకుండా పాఠశాల సిబ్బంది ప్రయత్నించారని ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థినులకు కనీస సదుపాయాలు కూడా కల్పించని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. 

విద్యార్థినుల సమస్యలు వింటే గుండె తరుక్కుపోయే పరిస్థితి కనిపిస్తోందన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, కనీస సౌకర్యాలు కూడా లేవని తెలిపారు. డార్మిటరీలో పిల్లలు పడుకునే చోటే ఎలుకలు పట్టే బోన్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అక్కడి నిర్లక్ష్యాన్ని చూపిస్తోందన్నారు. అద్వానమైన వాతావరణంలో విద్యార్థినులు చదువుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల చదువు తన బాధ్యత అని చెప్పిన మంత్రి నారా లోకేష్ ఇప్పుడు దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో పాఠశాలల రూపురేఖలు, విద్య, పౌష్టికాహారం మెరుగ్గా ఉండేదని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో తమ సమస్యలను పట్టించుకోవడం లేదని విద్యార్థినులు వాపోయారని పేర్కొన్నారు. పౌష్టికాహారంలో భాగంగా ఆదివారం ఇవ్వాల్సిన చికెన్ కూడా అందించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎలుకలు, దోమల సమస్య కొత్త విషయం కాదని, గతంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుక కరవడంతో చిన్నారి మృతి చెందిన ఘటన తెలిసిందే అన్నారు. కోట్లు ఖర్చు చేసి దోమలపై దండయాత్ర చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.

నాడు–నేడు కార్యక్రమం ద్వారా సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనన్నారు. పిల్లల చదువు, భవిష్యత్తుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ప్రత్యేక సమావేశం నిర్వహించారా అని ప్రశ్నించారు. ఘటన తర్వాత ఆర్డీవో విద్యార్థినులతో కలిసి భోజనం చేయడం సంతోషకరమని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారానికి ఒక్కసారైనా ఆర్డీవో స్థాయి అధికారి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు. ఈ ఘటనపై ఆర్డీవోకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్యలను వివరించనున్నట్లు చెప్పారు. పసుపు కండువాలు వేసుకుని పనిచేస్తున్న అధికారులు ప్రజా సంక్షేమం కోసం పని చేయాలని సూచించారు. ఎక్కడ సమస్య తలెత్తినా ప్రతిపక్షంగా వైయ‌స్ఆర్‌సీపీ తప్పకుండా ప్రశ్నిస్తుందని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు.

Back to Top