అనకాపల్లి: దళితుల భూములపై జనసేన ఎమ్మెల్యే సుందరపు కన్ను పడింది. పంచదార్ల గ్రామంలో దళితుల భూముల కబ్జా ప్రయత్నాలపై వైయస్ఆర్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు. బాధిత దళితులకు మద్దతుగా మాజీ ప్రభుత్వ విప్, యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, వైయస్ఆర్‌సీపీ మీడియా అధికార ప్రతినిధి , రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మంచా నాగమల్లేశ్వరి సంఘీభావం తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గం పరిధిలో ఉన్న రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో దళితులకు కేటాయించిన భూములను కబ్జా చేయడానికి కూటమి ప్రభుత్వం చెందిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ భారీ స్కెచ్ వేశారని దళితులు ఆరోపిస్తున్నారు. సుమారు రూ.200 కోట్ల విలువైన 43.64 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితులు పేర్కొన్నారు. 1978లో సర్వే నంబర్ 2లో 31 దళిత కుటుంబాలకు మొత్తం 43.64 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని వారు తెలిపారు. ఇప్పుడు ఆ భూములను దౌర్జన్యంగా లాక్కొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ నాయకులు మాట్లాడుతూ.. దళితులకు ఇచ్చిన భూములను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. బలహీన వర్గాల హక్కులను కాపాడేందుకు పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బాధిత దళిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైయస్ఆర్‌సీపీ నాయకులు తెలిపారు.