వైఫల్యాలు ప్రశ్నిస్తుంటే మంత్రుల్లో సహనం నశిస్తోంది

నోటికొచ్చినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు

మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఫైర్‌

అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ.

మంత్రి లోకేష్‌ విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించాడు 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆయన చెప్పినవన్నీ అసత్యాలే

రాష్ట్రంలో దారుణంగా క్షీణించిన శాంతి భద్రతలు

యథేచ్ఛగా దాడులు. నిందితులకు స్టేషన్‌ బెయిల్‌

బాధితులకు మాత్రం జైలు. ఇదెక్కడి న్యాయం?

మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపణ

వెలగపూడి: ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రశ్నిస్తుంటే మంత్రులు సహనం కోల్పోయి పరుషంగా మాట్లాడటం, నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్పడం చేస్తున్నారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. కూటమి నాయకులకు బయట అబద్ధాలు మాట్లాడటం అలవాటైపోయి అవే అబద్ధాలను సభలో కూడా చెబుతున్నారని ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఏం చేశామో చెప్పుకోకుండా గత ప్రభుత్వం అంటూ ఇప్పటికీ మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నారని మండిపడ్డారు. 
మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ ఇంకా ఏమన్నారంటే..:

అదే పనిగా అవాస్తవాల ప్రచారం:
    రూ.6 వేల కోట్లకు పైగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని, ఖచ్చితమైన గడువు ప్రకటించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. గత ప్రభుత్వం పెట్టిపోయిన రూ.4 వేల కోట్ల బకాయిలు కూడా చెల్లించాల్సి వస్తోందని సభ సాక్షిగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. 2024, మార్చిలో ఎన్నికల కోడ్‌ రావడంతో, ఆగిన ఆఖరి త్రైమాసికానికి సంబంధించిన రూ.700 కోట్లు మినహా వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఎక్కడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఆపలేదు. నిజానికి అవి కూడా అప్పుడు చెల్లించాలని భావించినా ఎన్నికల కమిషన్‌కు టీడీపీ ఫిర్యాదు చేసి అడ్డుపుల్ల వేసి అడ్డుకుంది. గతేడాది కూటమి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలున్నీ వైయస్సార్సీపీ హయాంలో చెల్లించాల్సినవే అన్నట్టుగా అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతున్నారు.
    విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ అబద్ధాలతో బరి తెగించి మాట్లాడుతున్నాడు. ఇలాంటి చర్యలతోనే రాష్ట్రంలో విద్యా రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాడు. వైయస్సార్‌సీపీ హయాంలో నాడు–నేడు కార్యక్రమం ద్వారా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లోనే అన్నీ పూర్తిగా నిర్వీర్యం చేసింది. ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థలను నాశనం చేశారు. 

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి:
    మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ల ఇళ్ల మీద జరిగిన దాడులను ప్రస్తావిస్తూ.. దిగజారిన శాంతి భద్రతల గురించి ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం సమాధానం చెప్పలేక పారిపోయింది. అంబటి రాంబాబు తల్లిని తీవ్రంగా దూషిస్తే నిందితుల మీద చర్యలు తీసుకోవాల్సిందిపోయి ఆయన్నే అరెస్టు చేశారు. దాడులకు పాల్పడిన నిందితులకు మాత్రం స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపారు. ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద పెట్రోల్‌ బాంబులు, యాసిడ్‌ దాడులు జరగడాన్ని ఈ ప్రభుత్వం సమర్థించుకుంటుందా?. పైగా వారినే అరెస్టు చేసి, జైలుకు పంపిస్తున్నారు!. ఇదెక్కడి న్యాయం?.
     సీఎం చంద్రబాబు పరిపాలన పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకే కాదు.. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకే రక్షణ లేకుండా పోయింది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు దాడులు చేస్తున్న అరాచక శక్తులకు ఎస్కార్టుగా వ్యవహరిస్తున్నారు. గవర్నర్‌గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా వైయస్సార్సీపీకి మండలిలో ఎక్కువ మంది బలమున్నా ఆ మేరకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఒక్క పథకం అమలు చేయకపోయినా సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ అని గప్పాలు కొట్టుకుంటున్నారు. 

అందుకే నాపై తప్పుడు కథనం:
    గీతం కాలేజీ రూ.5 వేల కోట్లు విలువైన 55 ఎకరాల భూమి కట్టబెట్టడాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఆంధ్రజ్యోతి పత్రిక నా మీద దుష్ప్రచారం చేస్తోంది. చంద్రబాబు తన కుటుంబ సభ్యుడికి అప్పనంగా ప్రభుత్వ సంపదను దోచి పెడుతున్నందుకు నిలదీస్తే నాపై పథకం ప్రకారం బురద జల్లే కార్యక్రమానికి ఎల్లో మీడియా తెర లేపింది. నా కుటుంబానికి రూ.30 లక్షలకే, 30 ఎకరాలు గత ప్రభుత్వం ఇచ్చేసినట్టు ఆంధ్రజ్యోతి ఒక కట్టుకథ అల్లింది. పైగా వార్తలో ఒకలా, హెడ్డింగ్‌లో మరోలా రాసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ భూములు ఎక్కడున్నాయో వారే చెప్పాలి. గీతం కాలేజీ 55 ఎకరాల భూములు కబ్జా చేసిందని, దాన్నే ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తున్నట్టు ఎంపీ భరత్‌ స్వయంగా చెప్పాడు. ఇకపై తన గురించి వార్తలు రాయాలనుకుంటే ఆంధ్రజ్యోతికి తన లేటెస్ట్‌ ఫొటోలు పంపుతానని, ఆ పత్రికకు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ చురకలంటించారు.

Back to Top