లడ్డూ వివాదంతో రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు

వైయ‌స్ఆర్‌సీపీ క‌ర్నూలు జిల్లా అధ్య‌క్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి

కర్నూలు: తిరుమల లడ్డూ వివాదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో మలుపు తిప్పుతూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డూ అంశం తర్వాత ఇప్పుడు శ్రీశైలంలో కూడా లడ్డూ కల్తీ జరిగిందంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరమని అన్నారు. 2024 జూన్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగిందని గుర్తు చేశారు. జూలై నెలలో కూడా చంద్రబాబు హయాంలోనే నెయ్యి ట్యాంకులు వచ్చాయని, వాటిని టిటిడి బోర్డు తిరస్కరించినప్పటికీ మళ్లీ వినియోగించారని తెలిపారు. ఈ విషయాన్ని సిట్ నివేదిక కూడా వెల్లడించిందని చెప్పారు.

లడ్డూ తయారీలో ఎటువంటి కల్తీ జరగలేదని, జంతు కొవ్వు కలవలేదని సీబీఐ విచారణలో తేల్చినా చంద్రబాబు మాత్రం సోషల్ మీడియా, ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం కొనసాగిస్తున్నారని విమర్శించారు. సీబీఐ చార్జిషీట్‌లో వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి పేర్లు లేకపోయినా వారికి క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేయడం రాజకీయ ద్వేషాన్ని చూపిస్తోందన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలనలో అనేక తప్పులు జరిగాయని ఆరోపించారు. ప్రస్తుతం తక్కువ ధరకు నెయ్యి దొరకదని చెబుతున్న చంద్రబాబు, తన పాలనలోనే రూ.270కు నెయ్యి కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ స్పష్టత ఇచ్చిన వెంటనే శ్రీశైలంపై కొత్త ఆరోపణలు చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. లడ్డూ తయారీలో బాత్‌రూమ్‌లో వాడే కెమికల్స్ కలిపారని చెప్పడం పూర్తిగా అసత్యమని, అలాంటిదేమైనా జరిగి ఉంటే భక్తులు అస్వస్థతకు గురయ్యేవారని అన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం నారా లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. హిందువుల నుంచి వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డిని దూరం చేయాలనే ఉద్దేశంతో దేవస్థానాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో తిరుమలలో తొక్కిసలాటలు జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయారని, సింహాచలం, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో కూడా భక్తులపై పోలీసులు దాడులు చేసిన ఘటనలను గుర్తుచేశారు. పుష్కరాల సమయంలో జరిగిన ఘటనలు కూడా చంద్రబాబు నిర్లక్ష్యానికి ఉదాహరణలని అన్నారు. లడ్డూ వివాదంపై బీజేపీ అగ్రనేతలు ఎందుకు మౌనం పాటిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని బీజేపీ నేతలకు కూడా తెలుసని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే హిందువులు, ప్రజలు తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు. శ్రీశైలం దేవస్థానంలో శివ స్వాములపై లాఠీచార్జ్ చేయించడం దారుణమని, భక్తులకు సరైన వసతులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వాముల ఆగ్రహానికి చంద్రబాబు గురికాక తప్పదని వ్యాఖ్యానించారు.
 

Back to Top