ఆలయాల్లో వరుస దుర్ఘటనలు - ప్రభుత్వ వైఫల్యమే

కూటమి ప్రభుత్వం 'హిందూ ద్రోహి'

భక్తుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబు

వరుస అపచారాలు అయినా నోరు మెదపని పవన్ కళ్యాణ్

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజం

తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

శ్రీశైలంలో శివస్వాములపై లాఠీఛార్జ్ అమానుషం  

లాఠీ చార్జ్ చేసిన ఏఎస్పీపై చర్యలు తీసుకోవాలి

నైతిక బాధ్యతగా హోంమంత్రి అనిత రాజీనామా చేయాలి.

వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ 

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఆలయాలను, భక్తుల భద్రతను పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదే తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆరుగురు భక్తుల మృతి చెందగా, సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు, కాశీబుగ్గ తొక్కిసలాటలో తొమ్మిది మంది మరణించారని గుర్తు చేశారు. తాజాగా మహాశివరాత్రి వేళ శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తులపై లాఠీఛార్జ్ చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు. ఒకవైపు కనీస సౌకర్యాలు కల్పించడంలోనూ, ఆలయాల్లో జరుగుతున్న వరుస దుర్ఘటనలను నివారించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు నోరెత్తడం లేదని నిలదీశారు. శ్రీశైలంలో శివస్వాములపై లాఠీచార్జ్ కి పాల్పడ్డ ఏఎస్పీపై చర్యలు తీసుకోవడంతో పాటు నైతిక బాధ్యతగా హోంమంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఏమన్నారంటే..

● కూటమి పాలనలో భద్రత కరువైన భక్తులు...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  హిందూ దేవాలయాలకు వచ్చే భక్తులకు భద్రత లేకుండా పోతుంది. ఇప్పటికే పలుదఫాలుగా ఈ విషయం స్పష్టమైంది.  శివరాత్రి పర్వదినాన వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది శివభక్తులు శ్రీశైలం వస్తారు. తిరుమల తర్వాత శ్రీశైలం పెద్ద దేవస్థానం కావడంతో భక్తులు రద్దీ కూడా చాలా ఎక్కువుగా ఉంటుంది. గతంలో కాలినడకన శైవ మాల ధరించి... శ్రీశైలం  వచ్చే భక్తులకు 30-40 రోజుల వరకు దర్శనానికి అనుమతి ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 7 రోజులకే పరిమితం చేసి భక్తులు కాలినడకన వెళ్లే అవకాశం లేకుండా చేసింది. వాస్తవానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా.. పక్కనే ఉన్న తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా కాలినడకన శ్రీశైలం దర్శనానికి వస్తారు. అలాంటి భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వారికి సౌకర్యాలు కల్పించలేదు సరికదా. భక్తులపై పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం అత్యంత దుర్మార్గం. భక్తులకు రక్షణ కల్పించాల్సిన ఏఎస్పీ స్థాయి అధికారి వారిపై లాఠీ ఝులిపించడం అమానుషం. చిన్న పిల్లలకు, దివ్యాంగులకు, మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించలేదు. భక్తులకు మంచినీళ్ళు ఏర్పాటు చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. నిత్యం వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ పై బురదజల్లే  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితలు దీనిపై ఏం సమాధానం చెబుతారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను పూర్తిగా దెబ్బతీసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు శ్రీశైలం మల్లన్న దేవస్థానాన్ని కూడా భ్రష్టుపట్టించే పనిలో పడింది. అందులో భాగంగానే భక్తులకు కనీస సౌకర్యాలు, మంచినీళ్లు కూడా అందించలేని దుస్థితిలో ఉంది. మరోవైపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా లక్షలాదిగా మాల ధారణతో మల్లన్నస్వామి దర్శనానికి వచ్చే భక్తులపై లాఠీలతో కొట్టి గాయపర్చడం ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? 

● అయ్యప్పలను అవమానించిన చరిత్ర చంద్రబాబుదే..

గతంలోనే అయ్యప్ప స్వామి మాలధారణ వల్లే మద్యం విక్రయాలు తగ్గిపోయాయంటూ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ అయ్యప్ప స్వామి భక్తులను అవమానించేలా మాట్లాడిన ఘనత చంద్రబాబుది. అంటే ఆదాయం కోసం మాలధారణపైనా నీచమైన వ్యాఖ్యానాలు చేసిన మీరా హిందువు? ఇలాంటి దుర్మార్గమైన పనులా మీరు చేసేది? స్థానిక కూటమి ఎమ్మెల్యే కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ తీసుకోవడం మినహా భక్తులకు కల్పించిన సౌకర్యాలు శూన్యం. భక్తులు ఎండ బారిన పడకుండా కనీసం చలువ పందిళ్లు ఏర్పాటుతో పాటు, తాగునీటి సరఫరా, రోడ్లపై మ్యాట్ లు వంటివేవీ ఏర్పాటు చేయకపోవడం దారుణం. కనీసం తాగేందుకు నీళ్ళు ఇవ్వలేని అసమర్ధ ప్రభుత్వం.. ఆలయాన్ని నిర్వహించలేకపోతే మూసుకోవాలని మండిపడుతున్న భక్తుల శాపనార్ధాలు కూడా ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదు. మంత్రుల కోసం గంటల తరబడి చిన్న పిల్లలతో ఉన్న మహిళలను మానవత్వం లేకుండా దర్శనాలు నిలిపివేశారు. సామాన్య భక్తులను దేవుడికి దూరం చేస్తున్నారు.

● దర్శనానికి వస్తే - లాఠీ దెబ్బలా?

హోంమంత్రి అనితను సూటిగా ప్రశ్నిస్తున్నాను... మీడియా ముందు నీతులు చెప్పే మీరు... పవిత్రమైన దేవాలయ ప్రాంగణంలో భక్తుల మీద లాఠీఛార్జీ చేయడం ద్వారా మీ ఎస్పీ ఘోరమైన తప్పిదానికి పాల్పడ్డారు. దానికి బాధ్యతగా మిమ్నల్ని  భర్తరఫ్ చేయాలని, లేని పక్షంలో జరిగిన దానికి మీరే నైతిక బాధ్యత వహిస్తూ మీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన శాఖ మీద కనీసం పట్టు, అవగాహన లేదు. గతంలో శైవమాల వేసుకుని కాలనడక ద్వారా వచ్చే భక్తులకు 30 రోజులకు పైగా దర్శనానికి అవకాశం కల్పిస్తే.. దాన్ని 7 రోజులకు కుదిస్తే భక్తుల రద్దీ పెరుగుతుందన్న సంగతి మీకు తెలియదా? తద్వారా భక్తుల రద్దీ పెరుగుతుందని ఎందుకు అంచనా వేయలేకపోయారు? వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారని మండిపడ్డారు. పల్లకీ సేవ, కళ్యాణోత్సవంతో సహా పలు ప్రత్యేక సేవలను కూడా రద్దు చేసినా.. భక్తులకు మాత్రం దర్శనం కల్పించలేక పోవడం దారుణం. ఏఐ టెక్నాలజీ వాడుతున్నాం, సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నామని మీరు చెప్పిన పెద్ద మాటలు ఏమయ్యాయి? పోలీసు శాఖకు, రెవెన్యూ, దేవాదాయ శాఖ, అటవీ శాఖలకు మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 

● దైవదర్శనమంటే భయపడుతున్న భక్తులు..

రాష్ట్రంలో ఏదైనా పండగ వచ్చిందంటే చాలు.. తొక్కిసలాటలు, లాఠీఛార్జీ, భక్తుల మీద దాడులు భక్తులు మృతి కూటమి ప్రభుత్వానికి ఆనవాయితీగా మారింది. గుడికి దర్శనానికి వెళ్దామంటే కూడా భక్తులు భయపడే పరిస్థితి వచ్చింది. ఇది కూటమి దిక్కుమాలిన ప్రభుత్వానికి నిదర్శనం. ఈ ప్రభుత్వం హిందూ ద్రోహి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు హిందూ ద్రోహిగా మిలిపోవడం ఖాయం. ఇప్పటికైనా కూటమి పెద్దలు కళ్లు తెరిచి శివరాత్రి సందర్భంగా ప‌ట్టిసీమ‌, కోటప్ప కొండతో పాటు రాష్ట్రంలో అన్ని శైవ క్షేత్రాల్లోనూ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాలని వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు. శ్రీశైలంలో శివస్వాముల మీద దాడి చేసిన ఏఎస్పీ  మీద చర్య తీసుకోవడంతో పాటు నైతిక బాధ్యతగా హోంమంత్రి అనిత రాజీనామా చేయాలని వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

Back to Top