కర్నూలు జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి తీవ్రంగా విమర్శించారు. రాజకీయాలు చేయడం చేతకాక తిరుమల లడ్డూ అంశాన్ని రాజకీయ లాభం కోసం ఉపయోగించుకోవడం దారుణమని మండిపడ్డారు. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కల్తీ లేదని స్పష్టంగా చెబుతున్నప్పుడు అందరూ సంతోషించాల్సిన పరిస్థితి ఉందని, కానీ చంద్రబాబుకు మాత్రం కల్తీ ఉంటేనే సంతోషంగా ఉంటుందన్నట్లుగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, ప్రజల విశ్వాసాలతో ఇలా ఆడుకోవడం తగదని అన్నారు. తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నప్పటికీ బీజేపీ నేతలు ఎందుకు మౌనం పాటిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇటీవల తిరుపతి లడ్డూ అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు, ఇప్పుడు శ్రీశైలం దేవస్థానాన్ని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆరోపించారు. దేవుళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం అత్యంత దురదృష్టకరమని ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు.