హైదరాబాద్: తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని వైయస్ఆర్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గడిచిన ఏడాదిన్నర కాలంగా లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేసిన సీబీఐ ఆధ్వర్యంలోని సిట్, లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు లేదని తన ఛార్జిషీట్‌లో స్పష్టంగా పేర్కొన్నా.. మరలా ప్లెక్సీలతో దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వాస్తవానికి 2018లో సింథటిక్ ఘీ కొనుగోలు చేయడం ద్వారా చంద్రబాబు హయాంలోనే కల్తీకి బీజం పడిందని ఆధారాలతో సహా భరత్ వివరించారు. మరలా జూలై 2024 లో ఏ ఆర్ డెయిరీ నుంచి వచ్చిన 4 ట్యాంకుల నెయ్యిని నాణ్యత లేదని రిజెక్ట్ చేసిన తర్వాత కూడా.. కేవలం రెండు రోజుల్లోనే వైష్టవి డెయిరీ పేరుతో అదే నెయ్యి తిరిగి వస్తే ప్రసాదంలో ఎందుకు వాడారని నిలదీశారు. నెయ్యి కల్తీ అని తెలిసినా ఆ నెయ్యిని వాడిన అధికారులపై, టీటీడీ బోర్డుపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై, సిట్ నివేదిక వెలువడిన తర్వాత కూడా ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తున్న చంద్రబాబు తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు, రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిష్టను మంటగలిపినందుకు హిందూ సమాజానికి, కోట్లాది మంది భక్తులకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేసిన సీబీఐ ఆధ్వంలోని సిట్ లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతుకొవ్వు లేదని ఛార్జిషీట్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు సిట్ ఏర్పాటు చేసి.. నివేదికను కోర్టుకు సమర్పించిన తర్వాత కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తున్నారు. తక్షణమే చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్ డీ డీ బీ, ఎన్ డీ ఆర్ ఐ రిపోర్టులు కూడా ఎలాంటి జంతుకొవ్వులు లేవని స్పష్టం చేసినా.. ఇంకా ప్రజలను ఏమార్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా ప్రజల్లో విద్వేషాన్ని నింపే కార్యక్రమం చేస్తూ... లడ్డూ ప్రసాదం తయారీకి వాడిని నెయ్యిలో బాత్రూమ్ క్లీనింగ్ కోసం వాడే రసాయనాలను కూడా కలిపారని అత్యంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. మీదీ నోరా చంద్రబాబూ? ● బాబు హాయంలోనే 2018లో సింథటిక్ ఘీ కొనుగోలు.. 28-08-2018న టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ ప్రసాదంలో నెయ్యి వాసన కోసం సింథటిక్ ఘీ సుమారు 87,750 కేజీలు కొనుగోలు చేశారు. కేజీ రూ.385 కి కొనుగోలు చేశారు. అంటే ప్లేవర్ కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో కొన్న ఈ సింథటిక్ ఘీ లో చంద్రబాబు నిన్న చెప్పిన ప్రొపిలీన్, బీటా కెరోటిన్, మాడిఫై ఘీ వంటి కృత్రిమ రసాయనాలన్నీ వాడారు. పరాగ్ మిల్క్ పుడ్ లిమిటెడ్ సంస్థ కేజీ రూ.385 లకు ఎల్ -1 కింద కాంట్రాక్టు దక్కించుకున్నారు. కేవలం నెయ్యి ప్లేవర్ కోసమే దాదాపు 87 వేల కేజీల సింథటిక్ ఘీ కొనుగోలు చేయడం ద్వారా ఎవరని ఏమార్చాలనుకుంటున్నారు చంద్రబాబు గారూ? ఎవరిపై నేరం మోపే కార్యక్రమం చేస్తున్నారు. మీ హయాంలోనే కల్తీ బయటపడంది. సింథటిక్ ప్లేవర్డ్ ఘీ కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? స్వామి వారి ప్రసాదం కోసం కల్తీ నెయ్యి మీ హయాంలోనే వాడుతూ రాష్ట్ర ప్రతిష్టను మంట గలిపే కార్యక్రమానికి చంద్రబాబు పూనుకున్నారన్న విషయం స్పష్టమవుతోంది. కేవలం రాజకీయ లబ్ది కోసమే శ్రీవేంకటేశ్వరస్వామిని పావుగా వాడుకుంటున్నాడు. హిందూ సమాజం, కోట్లాది మంది భక్తులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సిట్ నివేదిక వచ్చే లోపు కోర్టు పరిధిలో ఉన్న అంశంపై మాట్లాడవద్దని కోర్టు స్పష్టం చేసినా చంద్రబాబు నాయుడు కనీసం ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నాడు. తిరుమల లడ్డూలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో తయారు చేసిన సింథటిక్ వినియోగించారంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లతో దుష్ప్రచారం చేస్తున్నాడు. అంటే చంద్రబాబే తన రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తూ హిందువుల ప్రతిష్టను మంటగలుపుతున్నాడు. 2018లోనే చంద్రబాబు తన హయాంలో రూ.3.74 కోట్లతో ఆర్టిఫిషియల్ ఘీ ప్లేవర్ ఎందుకు కొనుగోలు చేశారు? ఇది మీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదం కాదా? మీరే సింథటిక్ ఘీ కొనుగోలు చేసి దాన్ని ప్రసాదాల తయారీలో వాడి ఇప్పుడు తిరిగి మాపై నిందలు వేస్తున్నారా? ● వైయస్ఆర్‌సీపీ పై తప్పుడు ప్రచారం.. చివరకు జాతీయ మీడియాతో మాట్లాడుతూ... వైయస్ఆర్‌సీపీ నేతలు నెయ్యి కల్తీ జరిగిందని అంగీకరించారని పచ్చి అబద్దాలు చెబుతున్నారు. మా పార్టీ నేతలు సీబీఐ నివేదికలో పొందుపరిచిన అంశాలనే ప్రస్తావించారు.ప్రసాదంలో జంతుకొవ్వులు లేవు... వెజిటబుల్ ఆయిల్ కలిసిందన్న నివేదికలో అంశాలనే చెప్పారు. వాస్తవానికి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే కల్తీ జరిగింది. నాలుగు ట్యాంకుల నెయ్యి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని చెప్పి వెనక్కి పంపిస్తే.. తిరిగి అదే నెయ్యిని వేరే ఇన్ వాయిస్ లతో మరలా తీసుకొస్తే ఆ నెయ్యితో మీ హయాంలోనే లడ్డూలు తయారు చేశారు. ఎవరిది తప్పిదం? మా హయంలో ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదు కాబట్టే... చంద్రబాబు ఆరోపణలు చేయగానే సీబీఐతో విచారణ చేయించాలని టీటీడీ మాజీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అది మా నిబద్దత. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ లో సీబీఐతో పాటు ఏపీ అధికారులు కూడా ఉన్నారు. సీబీఐ సిట్ తన నివేదికలో జంతుకొవ్వులు లేవని చెప్పింది. సిట్ కలెక్ట్ చేసిన శాంపిల్స్ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సేకరించారు. కూటమి ప్రభుత్వం నియమించిన ఈవో, టీటీడీ బోర్డు సభ్యులు అధికారంలో ఉండగానే.. తప్పు జరిగితే ఎందుకు చర్యలు తీసుకోలేదు. వెనక్కి పంపిన 4 ట్యాంకుల నెయ్యి తిరిగి వెనక్కి ఎలా వచ్చింది? దాన్ని లడ్డూ ప్రసాదంలో ఎలా వాడారు? ఈ తప్పిదానికి పాల్పడ్డ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తులు కలియుగ ప్రత్యక్షదైవం ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎలా వ్యవహరిస్తారు? దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు. మరోవైపు 2019-24 వరకు తిరుమల మహా ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేస్తున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాన్ని పదే, పదే సర్క్యులేట్ చేస్తున్నారు. ఒకే మెసేజ్ ని వివిధ రకాల పేర్లతో ఉద్దేశపూర్వకంగా దుష్ర్పచారం చేస్తున్నారు. ● వైయస్ఆర్‌సీపీ పాలనలో స్వామి వారికి విశేష సేవలు... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి శ్రీ వేంకటేశ్వరస్వామిపై అపారమైన భక్తిశ్రద్ధలున్నాయి. అందుకే వైయస్.జగన్ హయాంలో శ్రీవాణి ట్రస్టు ఏర్పాటు చేసి... దాని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 2500 పైగా ఆలయాలు నిర్మించారు. అది హిందూ ధర్మం పై మా పార్టీకి ఉన్న నమ్మకం. నాలుగు దఫాలుగా సీఎంగా ఉన్న చంద్రబాబు తన హాయంలో టీటీడీ నుంచి ఎన్ని దేవాలయాలు నిర్మించారో చెప్పగలరా? మా కులదైవం అని చెప్పుకునే చంద్రబాబు మీరు మా హాయంలో నిర్మించిన దేవాలయాల్లో 10 శాతం కూడా నిర్మించలేదు. పైగా కృష్ణా పుష్కరాల్లో 40కు పైగా హిందూ దేవాలయాలను కూలగొట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్.జగన్ హయాంలో వాటిని పునర్ నిర్మించారు. ఎవరికి నమ్మకం ఉంది? తెలుగుదేశం పార్టీ హయాంలోనే కల్తీ జరిగింది. గతంలో టీటీడీ చైర్మన్ గా వై వీ సుబ్బారెడ్డి ఉన్నప్పుడు కల్తీ పై ఆరోపణలు వస్తే దాన్ని మైసూరు ఎఫ్ టీ ఆర్ ఐ ల్యాబ్ కు పంపించారు. ఇది మా పార్టీకున్న నిబద్దత. కానీ టీడీపీ తమ హయాంలోనే తప్పు జరిగినా దాన్ని మా పై రుద్దడంతో పాటు తిరుమలను రాజకీయ క్షేత్రంగా మార్చడం అత్యంత దుర్మార్గం. 2018లో మీ హాయంలో సింథటిక్ ఘీ ఎందుకు కొనాల్సి వచ్చిందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. స్వామి వారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ నివేదికలో స్పష్టమైన నేపధ్యంలో.. ఇప్పటికైనా చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు, క్షమాపణ చెప్పాలని మార్గాని భరత్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.