సాలూరు: సాలూరు సాక్షి టీవీ విలేకరి నల్లి శ్రీనివాసరావుపై దాడి దుర్మార్గమని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఖండించారు. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఆయన, రిపోర్టర్‌ను పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ, ప్రశాంతమైన సాలూరులో ఇలాంటి దారుణ ఘటన జరగడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం వల్లే ఇటువంటి దురాగతాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్టులపై దాడులు జరగడం దురదృష్టకరమని పేర్కొన్న ఆయన, నల్లి శ్రీనివాసరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఘటనలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని కోరారు.