కూట‌మి ప్ర‌భుత్వానికి రైతులంటే చిన్న‌చూపు

రాజ‌ధాని నిర్మాణానికేనా డీజిల్ అవ‌స‌రం?

రైతుల‌కు అక్క‌ల్లేదా?  

అప్స‌డా మాజీ వైస్ చైర్మ‌న్ వ‌డ్డీ ర‌ఘురాం ధ్వ‌జం

తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ 
సమన్వయకర్త, అప్స‌డా మాజీ వైస్‌ చైర్మన్‌ వడ్డి రఘురాం

డీజిల్ కొరతతో రాష్ట్రంలో వ్యవసాయం, ఆక్వా రంగాల్లో తీవ్ర సంక్షోభం 

రాష్ట్రంలో 70 శాతం పెట్రోల్ బంకుల్లో డీజిల్ లేక రైతులు క్యూలలో నిలబడే పరిస్థితి

యంత్రాల ద్వారా పంట కోతలకు డీజిల్ లేక అన్న‌దాత‌ల అవ‌స్థ‌లు 

మంత్రి నాదేళ్ల మనోహర్ విధించిన డీజిల్ పరిమితుల‌లో వ్య‌వ‌సాయ రంగానికి కేటాయింపులు ఏవీ? 

రాష్ట్రంలో డీజిల్ కొర‌త లేద‌ని మంత్రి సింగపూర్ నుంచే ప్ర‌క‌ట‌న‌లా?

ఆక్వా రంగంలో టన్నుకు రూ.60–70 వేల వరకు ధరలు పడిపోవడం

డాలర్ విలువ‌ పెరిగినా రొయ్యల ధరలు తగ్గడం రైతులకు భారీ నష్టం

లారీలకు 50 లీటర్ల డీజిల్ పరిమితితో చేపల ఎగుమతులు సాధ్య‌మా? 

గతంలో రూ.3600 కోట్ల సబ్సిడీతో ఆక్వా రంగానికి ఊరట

వైయస్ జగన్ పాలన గుర్తుచేసిన రఘురాం

విద్యుత్ యూనిట్ ధరను రూ.1.50కి ఇవ్వాలని డిమాండ్

మొక్క‌జొన్న పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర క‌రువు 

డీజిల్, పెట్రోల్ ధరలు పెరగవని ప్రభుత్వం స్పష్టం చేయాలి

24 గంటల్లో డీజిల్ సమస్య పరిష్కరించకపోతే బంకుల ముట్టడిస్తాం

రైతుల‌ తరఫున వైయ‌స్ఆర్‌సీపీ పోరాటానికి సిద్ధం

స్ప‌ష్టం చేసిన వ‌డ్డీ ర‌ఘురాం

తాడేపల్లి: రాష్ట్రంలో వ్యవసాయం, ఆక్వా రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ నేత, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డి రఘురాం మండిప‌డ్డారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిన్నచూపు, చులకనభావం స్పష్టంగా కనిపిస్తోందని విమ‌ర్శించారు. రాజధాని నిర్మాణానికే డీజిల్ అవసరమా? రైతులకు అవసరం లేదా? అని తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ర‌ఘురాం ప్ర‌భుత్వాన్ని సూటిగా ప్ర‌శ్నించారు. డీజిల్ కొర‌త కార‌ణంగా మంత్రి నాదెండ్ల మనోహర్‌ప్ర‌క‌టించిన కేటాయింపుల ప‌ట్టిలో రైతుల‌కు, వ్య‌వ‌సాయ రంగానికి స్థానం లేకుండా పోయింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 24 గంట‌ల్లో డీజిల్ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూప‌క‌పోతే రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న బంకుల‌ను ముట్ట‌డిస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.
ప్రెస్‌మీట్‌లో వ‌డ్డీ రఘురాం ఏమ‌న్నారంటే..

వ్య‌వ‌సాయ రంగం అంటే ఈ ప్ర‌భుత్వానికి చిన్న‌చూపు

రాష్ట్రంలో ఆక్వా రంగం, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నా కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. ఈ ప్రభుత్వానికి వ్యవసాయ రంగం అంటే చిన్నచూపు, చులకన భావం మాత్రమే ఉంది. ఇవాళ డీజిల్ కొరత విపరీతంగా ఉంది. రాష్ట్రంలో 4510 బంకులు ఉంటే అందులో 70 శాతం బంకుల్లో డీజిల్ లేదు. డీలర్లు, ప్రభుత్వం కుమ్మక్కై రైతులకు డీజిల్ అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాజధాని నిర్మాణానికే డీజిల్ అవసరమని కేంద్రానికి లేఖలు రాస్తున్నారు… రైతులకు అవసరం లేదా?. మన ఎంపీ కేంద్ర మంత్రిని కలిసి డీజిల్ కొరత ఉందని చెబితే, వాళ్లు అలాంటిది ఏమీ లేదని చెబుతున్నారు. ఈ ప్రభుత్వంలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడ్డారు. ఇప్పుడు పంట కోత దశలో కూడా డీజిల్ కోసం బంకుల వద్ద క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది.  

నాదేండ్ల మ‌నోహ‌ర్‌కు రైతుల‌కు క‌నిపించ‌లేదా?

గతంలో కూలీలతో కోతలు కోసేవారు. ఇప్పుడు యంత్రాలతో కోతలు చేస్తున్నారు. కానీ ఆ యంత్రాలకు డీజిల్ లేక రైతులు అవస్థలు పడుతున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాత్రం బైక్‌కు 2 లీటర్లు, కారుకు 15 లీటర్లు, లారీలకు 50 లీటర్లు, బస్సులకు 100 లీటర్లు మాత్రమే డీజిల్ ఇవ్వాలని ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అందులో రైతుకు ఎంత డీజిల్ అవసరమో ఈ ప్రభుత్వం ప్ర‌క‌టించ‌లేదు.  రైతులంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిన్నచూపో దీన్నిబట్టి అర్థమవుతోంది. రాష్ట్రంలో రైతు లేడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంటే మంత్రి మాత్రం సింగపూర్‌లో షికార్లు కొడుతున్నారు. అక్కడి నుంచే ఏపీలో డీజిల్ కొరత లేదని స్టేట్‌మెంట్ ఇస్తున్నారు.  

సంక్షోభంలో  ఆక్వా రంగం

ఆక్వా రంగంలో ట్రంప్ ట్యాక్స్ పేరుతో టన్నుకు రూ.60–70 వేల వరకు తగ్గించారు. ఇరాన్–అమెరికా యుద్ధం సాకుగా మరోసారి రూ.30–40 వేల వరకు తగ్గించారు. ఇప్పుడు డీజిల్ కొరత పేరుతో టన్నుకు రూ.10 వేలు తగ్గించారు. ఇలాంటి పరిస్థితిలో ఆక్వా రంగం బాగుందా? సంక్షోభంలో ఉందా? మంత్రే చెప్పాలి. డాలర్ విలువ రూ.53 నుంచి రూ.96కి పెరిగినా, రొయ్య ధర మాత్రం కేజీకి రూ.10 తగ్గింది. వైయస్ జగన్ ఫీడ్ రేటు రూ.25 తగ్గించాలని డిమాండ్ చేస్తే, అప్పట్లో కేవలం రూ.4 మాత్రమే తగ్గించారు. ప్రాసెసింగ్ యూనిట్ల విషయంలో ప్రభుత్వం కుమ్మక్కై రైతులను నష్టపరుస్తోంది. ప్రతిరోజూ 4 వేల టన్నుల చేపలు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తాయి. సుమారు 2 వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ లారీలకు 50 లీటర్ల డీజిల్ మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. ఈ 50 లీటర్లతో బెజవాడ దాకా వెళ్తుంది.. ఆ తర్వాత ఎలా? 

చేపలను కార్గో విమానాల్లో పంపాలా?

గతంలో పాలీ కెమికల్ ప్రచారం వల్ల చేపల లోడ్లు ఆగిపోయినప్పుడు, వైయస్ జగన్ 24 గంటల్లో సమస్య పరిష్కరించి ఎగుమతులు పునరుద్ధరించారు. ఇప్పుడు డీజిల్ కొరత వల్ల ఎగుమతులు కష్టమయ్యాయి. ఇక చేపలను కార్గో విమానాల్లో పంపాలా?. ఆక్వా రైతులకు ప్రొక్యూర్‌మెంట్ జరుగుతోంది కానీ ప్రాసెసింగ్ పాయింట్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. లారీలకు 50 లీటర్ల డీజిల్ మాత్రమే ఇస్తే, ఆ రోయ్యలు ఆ పాయింట్లకు ఎప్పుడు చేరుతాయి?

ఒక్క కొత్త కనెక్షన్ అయినా ఇచ్చారా?

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగానికి సుమారు 64 వేల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వైయస్ జగన్ సీఎం గా ఉన్నప్పుడు 4.64 లక్షల ఎకరాలు కల్చర్ చేసి, 3.57 లక్షల ఎకరాలను ఆక్వా జోన్‌లోకి తీసుకువచ్చి రూ.3600 కోట్లు సబ్సిడీ ఇచ్చాం. కానీ ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఆక్వా రంగానికి ఎంత సహాయం చేసింది?. అసెంబ్లీలో మాత్రం ‘సూపర్ సిక్స్… సూపర్ హిట్’ అంటున్నారు. కానీ అన్నింటిలో కమీషన్లు తీసుకోవడంలోనే ఈ ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ రెండేళ్లలో ఒక్క కొత్త కనెక్షన్ అయినా ఇచ్చారా? చూపించండి.

గతంలో చంద్రబాబు ప్రభుత్వం యూనిట్ రూ.2కే ఇస్తామని చెప్పి మోసం చేసింది. బకాయిలు పెట్టిపోతే, వైయస్ జగన్ వచ్చాక వాటన్నింటిని తీర్చి యూనిట్ రూ.1.50కే ఇచ్చారు. మొక్కజొన్న పంట విస్తారంగా వచ్చింది. తెలంగాణలో క్వింటాల్‌కు రూ.2400 ఇస్తుంటే, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు చెప్పాలి. డీజిల్ కొరత ఉందని ఈ ప్రభుత్వానికి తెలియదా? గతంలో ఆర్‌బీకేల ద్వారా పంట కోతల సమయంలో అవసరాలు, నష్టాలు, మద్దతు ధరలపై ముందుగానే సమాచారం ఇచ్చేవారు.

కూట‌మి ప్ర‌భుత్వానికి 24 గంట‌లే డేట్‌లైన్‌

రాష్ట్రంలో 24 గంటల్లో డీజిల్ సమస్య పరిష్కరించకపోతే, వైయస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంకులను ముట్టడిస్తాం. డీజిల్‌పై రూ.20 పెరుగుతుందని మీరే లీకులు ఇస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో కొరత లేకపోతే ఇక్కడే ఎందుకు ఉంది? ఐవోసీ డీలర్లకు మేలు చేసేలా ప్రభుత్వం పనిచేస్తోందా? మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేయాలి… డీజిల్, పెట్రోల్ ధరలు పెరగవని చెప్పగలరా? రేపు ధరలు పెరిగితే, ఈ సంక్షోభాన్ని కావాలనే సృష్టించారని ప్రజలు అర్థం చేసుకుంటారు. 

గతంలో పొగాకు, మామిడి, మిరప రైతుల సమస్యల్లో ఉంటే వైయస్ జగన్ పోరాటం చేస్తే తప్ప మీ ప్రభుత్వంలో చలనం రాలేదు. ఇప్పుడు కోకో రైతులు తీవ్ర నష్టపోతున్నా ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆక్వా రంగానికి త‌క్షణమే యూనిట్ ధరను రూ.1.50కు సబ్సిడీగా ఇవ్వాలి. స‌బ్సిడీ ఇవ్వ‌కపోతే ఆక్వా రైతుల తరఫున  ఉద్యమం తప్పదు. వైయస్ జగన్, వైయ‌స్ఆర్‌సీపీ ఎప్పుడూ రైతులు, ఆక్వా రైతులకు అండగా ఉంటాయ‌ని వ‌డ్డీ ర‌ఘురాం స్ప‌ష్టం చేశారు.

Back to Top