ఉపాధి హామీ కూలీలకు వెంటనే వేతనాలు చెల్లించాలి 

పార్వతీపురం మన్యం జిల్లాలో అవినీతి ఆరోపణలపై విచారణకు డిమాండ్ 

పార్వతీపురం మన్యం జిల్లా:  జిల్లాలో ఉపాధి హామీ పథకంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీ పంచాయతీ రాజ్ విభాగం ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ యస్వంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. 2025 డిసెంబర్ నెల నుండి పెండింగ్‌లో ఉన్న కూలీల వేతనాలను తక్షణమే విడుదల చేయాలని, అలాగే ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ, జిల్లాలో అనేక గ్రామాల్లో ఉపాధి హామీ పనులు సక్రమంగా జరగక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నెలల తరబడి వేతనాలు రాక కుటుంబాలు ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే చేపట్టాల్సిన చర్యలను వారు వివరించారు. ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన వేతనాలను ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లించాలని, పనిస్థలాల్లో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే కూలీలు అడిగిన వెంటనే పని కల్పించి వలసలను అరికట్టాలని, నకిలీ మస్టర్లను పూర్తిగా అరికట్టి పారదర్శకంగా పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఉపాధి హామీ పనుల్లో బయటపడిన అవినీతి అంశాలపై వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పనుల కొరతతో కూలీలు వలస బాట పడుతున్న పరిస్థితిని ప్రభుత్వం గమనించి, అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి వారికి ఉపాధి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గం పంచాయతీ విభాగం అధ్యక్షులు బంకూరి రవికుమార్, రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి బంకపల్లి వాసుదేవరావు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సర్వీశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర ఆర్‌టీఐ విభాగం ప్రధాన కార్యదర్శి దేవుపల్లి నాగరాజు, బాలగూడభ మాజీ సర్పంచ్ బూర సూర్యనారాయణ, మండల సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ చెరుకుబిల్లి వినోద్ తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top