ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిల్స్‌తో దాడులు చేసి చంపేయాలన్న కుట్ర చేయడం దుర్మార్గమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికెళ్లి వారి కుటుంబ సభ్యులని పరామర్శించిన అనంతరం పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. 20 నెలల చంద్రబాబు పాలన, సీబీఐ సిట్ ఛార్జిషీట్ తర్వాత కూడా ఇంకా దిగజారిపోయి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే కొడుకు లోకేష్‌కే కాదు.. చంద్రబాబుకి కూడా చిప్ చెడిపోయిందేమో అని ప్రజలంతా అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్సార్సీపీని రాజకీయంగా ఎదుర్కోలేక దేవుడిని రాజకీయాల్లోకి మా పార్టీపై బురదజల్లడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రభుత్వమే దాడులను ప్రేరేపించడం సిగ్గుచేటని చెప్పారు. ఇలాంటి దాడులను ఎదుర్కొనే అన్ని న్యాయ మార్గాలను ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు. సీబీఐ సిట్ చార్జిషీట్ లో తాము కోరుకున్న విధంగా జంతువుల కొవ్వు కలిసిందని చెప్పకపోవడంతో ఇప్పుడు ఏకసభ్య కమిషన్ పేరుతో రాజకీయ కక్షసాధింపు చర్యలకు పూనుకుంటున్నారని విమర్శించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మీదనే చంద్రబాబుకి విశ్వాసం లేకుండా ఇంకా తిరుమల లడ్డూపై దిగజారి మాట్లాడుతున్న చంద్రబాబుకి కలియుగ దైవమే తగిన విధంగా బుద్ధి చెబుతాడని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ప్రెస్‌మీట్‌లో బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడారంటే..: దాడులకు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారు?: కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద అక్రమ కేసులు, రౌడీలతో దాడులు చేయించి ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడి చేసే సంస్కృతిని చంద్రబాబు రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. రాష్ట్రాన్ని ప్రమాదకరమైన స్థితిలోకి చంద్రబాబు తీసుకెళ్లిపోతున్నాడు. ఇలాంటి ప్రభుత్వం ఇంకా కొనసాగినంత కాలం రాష్ట్ర ప్రజలకు నష్టమే తప్ప భద్రత ఉండదని 20 నెలలుగా జరుగుతున్న దాడులు చూస్తే అర్థమైపోతుంది. శాంతిభద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలే ప్రతిపక్ష నాయకుల మీద దాడులను ప్రోత్సహించడంపై ఏం సమాధానం చెప్పుకుంటారు. పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిల్స్ విసురుతుంటే పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారు. పోలీసులే టీడీపీ నాయకులతో కుమ్మక్కై దాడులు చేస్తుంటే నిందితులకు ఎస్కార్టుగా వ్యవహరించారు. ఎన్నికలప్పుడు గొప్పగొప్ప మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. అడుగడుగునా వారి చర్యలు చూస్తుంటే చేతిలో అధికారం ఉందనే అహంకారం కనిపిస్తోంది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందిపోయి రౌడీలు, గూండాలను తీసుకొచ్చి దాడులను ప్రోత్సహించి శాంతిభద్రతలకు విఘాతం కల్పించడం సిగ్గుచేటు. ప్రభుత్వమే దగ్గరుండి ప్రతిపక్ష నాయకుల మీద హత్యాయత్నం చేసే ఈ చర్యలను ప్రజాస్వామ్య వాదులు తీవ్రంగా ఖండించాలి. ఇంత జరుగుతుంటే బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు? గొప్ప గొప్ప కబుర్లు చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ దాడులకు ఏం సమాధానం చెబుతారు? సుప్రీంకోర్టు మీద చంద్రబాబుకి నమ్మకం లేదా?: తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసి సీబీఐ సిట్ ఛార్జిషీట్‌లో పేర్కొన్న తర్వాత కూడా చంద్రబాబు, లోకేష్‌లు తప్పుడు ప్రచారం ఆపలేదు. కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుడిని రాజకీయాల్లోకి లాగడం మానుకోవాలని, జంతువుల కొవ్వు కలవలేదని చెప్పిన తర్వాతైనా తప్పుడు ప్రచారం ఆపాలని మంత్రి లోకేష్ కి హితవు పలుకుతూ జోగి రమేష్ మాట్లాడారు. లోకేష్‌కి చిప్ చెడిపోయింది కాబట్టే ఇంకా తప్పుడు ఆరోపణలు చేస్తూ స్వామి వారి ప్రతిష్టను దిగజార్చుతున్నాడని చెప్పాడు. అందులో ఏం తప్పుందని ఆయన ఇంటి మీద దాడికి టీడీపీ గూండాలను ఉసిగొల్పారు? మీ తప్పులను ప్రశ్నిస్తే పెట్రోల్ బాంబులతో దాడులు చేసి చంపేస్తారా? పజ్రాస్వామ్యంలో ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదు. దీనిపై ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మాకున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటాం. టీడీపీ దురాగతాలపై పోరాడతాం. వైయస్ఆర్‌సీపీని రాజకీయంగా లేకుండా చేయాలన్న దురాశతో చేస్తున్న ఇలాంటి చర్యలను ప్రజలు ఎప్పటికీ హర్షించరు. ఇలాంటి దాడులకు వైయస్ఆర్‌సీపీ వెరవదు. సిట్ ఛార్జిషీట్ అనుకూలంగా లేదనే ఈ ఏకసభ్య కమిషన్: ప్రభుత్వం విఫలమైన ప్రతిసారీ తిరుమల లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే కూటమి నాయకులు పనిగా పెట్టుకున్నారు. సీబీఐ సిట్ చార్జిషీట్‌ని కూడా వక్రీకరించేలా దుష్ప్రచారం చేయడం చూస్తుంటే చంద్రబాబుకి సుప్రీంకోర్టు అంటే విశ్వాసం లేనట్టుంది. చంద్రబాబుకి చేతనైతే మంచి పాలన అందజేసి ప్రజల మన్ననలు పొందాలి. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత చంద్రబాబునాయుడిదే. సీబీఐ సిట్ ఛార్జిషీట్ తమకు అనుకూలంగా లేదనే ఆవేదనతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఏకపక్షంగా నివేదిక ఇప్పించుకోవడం కోసమే చంద్రబాబు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు.