ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో భారీ కుతంత్రం బద్దలైంది

చంద్రబాబు కుట్రను బయటపెట్టిన ల్యాబ్‌ రిపోర్ట్స్‌ 

అయినా ఇంకా నిస్సిగ్గుగా అబద్దాల ప్రచారం

మసిపూసి మారేడుకాయ చేయాలనే ప్రయత్నం 

మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.

చంద్రబాబు కుట్రను వెంకన్న స్వామే కూల్చేశాడు

నెయ్యిలో జంతువుల కొవ్వు, పందికొవ్వు లేదని ల్యాబ్‌లు తేల్చాయి 

హిందూమత గౌరవం, కోట్లాది భక్తుల మనోభావాల్ని దెబ్బ తీశారు

చంద్రబాబు అబద్ధాన్ని ప్రచారం చేసిన పవన్, పచ్చమీడియా

నిజం బయటపడ్డాక కొత్త కుట్రలకు తెరలేపిన చంద్రబాబు

మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడి

చంద్రబాబు తెప్పించిన నెయ్యిపైనే కల్తీ ఆరోపణలు

ఆ నెయ్యి శాంపిల్స్‌ పైనే ల్యాబ్‌ రిపోర్ట్స్‌ 

అయినా వైయ‌స్ఆర్‌సీపీకి అంటగట్టే యత్నం

తిప్పి పంపించిన నెయ్యి ఎందుకు వాడారు ?   

అప్పుడు కల్తీ ఇప్పుడు ఎలా పవిత్రమైంది?

సూటిగా ప్రశ్నించిన అంబటి రాంబాబు

హర్ష్  డెయిరీకి టీటీడీలో అనుమతిచ్చింది చంద్రబాబే

అప్పట్లో కిలో నెయ్యి రూ.291కు మీరెలా కొన్నారు ?

మేం రెజెక్ట్‌ చేశాకే హర్ష్‌ డెయిరీ పేరు ‘భోలేబాబా’గా మారింది

టీటీడీలో అధికారులతోనూ బాబు రాజకీయ కుట్రలు

సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌పై చంద్రబాబు, పవన్‌ మౌనమెందుకు?

ప్రెస్‌మీట్‌లో నిలదీసిన అంబటి రాంబాబు

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో భగవంతుడిని అడ్డు పెట్టుకుని చేసిన భారీ కుట్ర బయటపడిందని, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని అడ్డు పెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందాలని, ప్రతిపక్షం మీద బురద జల్లాలని చేసిన కుట్రను ల్యాబ్‌ రిపోర్ట్‌లు భగ్నం చేశాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అబద్దాల పునాదుల మీద అసత్యాలు పోగుచేసి జగన్‌గారి మీద, వైయ‌స్ఆర్‌సీపీమీద బురద జల్లాలని చేసిన కుట్ర పటాపంచలైందన్నారు.
    దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ప్రతిష్టాత్మకమైన సంస్థల నివేదికల ద్వారా ఈ కుట్రలు భగ్నమై నిజం బయటికి వచ్చిందన్నారు. దీన్ని చూసి భరించలేక చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ఇంకా దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. ఇంకా దీన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనే వృథా ప్రయత్నం చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు.
ప్రెస్‌మీట్‌లో అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..:

కల్తీ నెయ్యి కుట్రకు అప్పుడే బీజం:
    చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024 సెప్టెంబరు 17న కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే ఈ కుట్రకు చంద్రబాబు నాంది పలికారు. ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్నారు. అంతటితో ఆగకుండా పందికొవ్వు, పశువుల కొవ్వు కలిసిందని, దాంతోనే లడ్డూలు తయారు చేశారని, వాటిని ప్రపంచంలో ఉన్న భక్తులు తినేశారని చెప్పారు. చంద్రబాబు ఆరోపణలతో దేశంలోని భక్తులంతా ఉలిక్కిపడ్డారు. పంది కొవ్వు, పశువుల కొవ్వేమిటి!. లడ్డూ ప్రసాదంలో కలిశాయని ఓ ముఖ్యమంత్రే చెప్తున్నాడని ఆశ్చర్యపోయారు. ఏ ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న అనుభవజ్ఢుడని చెప్పుకునే రాజకీయ నాయకుడు చేసిన ఆరోపణలు ఇవి. వీటిని ఆరోజే విజ్ఞులైన వారంతా ఖండించారు. 

ఏ కొవ్వూ లేదని తేల్చిన ల్యాబ్‌లు.
ఆ నివేదికలతో సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌ :

    రాజకీయాల్లో ప్రత్యర్థులపై కక్ష సాధించాలంటే వేరేలా ప్రయత్నాలు చేయొచ్చు కానీ హిందూ ధర్మానికి భంగం కలిగేలా ప్రపంచంలో అందరూ కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రసాదంలో పందికొవ్వు కలిసిందని చేసిన ఆరోపణ సహించరానిది. అంతకు ముందే టీటీడీ ఛైర్మన్‌ గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ చేసిన సుప్రీంకోర్టు.. చీవాట్లు పెట్టి మీ సిట్‌ కాదు సీబీఐ ఆధ్వర్యంలో సిట్‌ వేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ శాంపిల్స్‌ ను సెకండ్‌ ఒపీనియన్‌ కోసం మళ్లీ ల్యాబ్స్‌ కు పంపమని ఆదేశించింది. ఆ శాంపిల్స్‌ పరిశీలించిన ప్రతిష్టాత్మక ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ.. అందులో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని తేల్చి చెప్పాయి. ఆ నివేదికల ఆధారంగా, చంద్రబాబు చేసిన ఆరోపణలు తప్పని సిట్‌ తేల్చింది. అదే విషయాన్ని పొందుపర్చిన సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. అయినా మీడియా బలంతో, అధికార బలంతో జగన్మోహన్‌ రెడ్డి,వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌ రెడ్డి ఫొటోలతో దారుణంగా ఫ్లెక్సీలు పెడుతున్నారు. 

మీ హయాంలో నెయ్యిపైనే ల్యాబ్‌ రిపోర్టులు:
    చంద్రబాబు 2024లో అధికారంలోకి వచ్చాక జూన్‌ 12, జూన్‌ 25, జూలై 6, జూలై 12 తేదీల్లో వీఆర్‌ డెయిరీ నుంచి లడ్డూ ప్రసాదానికి నెయ్యి ట్యాంకర్లు వెళ్తే శాంపిల్స్‌ తీసుకున్నారు. ఇది జరిగింది చంద్రబాబు ప్రభుత్వంలోనే. ఈ శాంపిల్స్‌ ను ల్యాబ్స్‌ కు పంపించి, నెయ్యి కల్తీ జరిగిందని ప్రచారం మొదలుపెట్టారు. స్వయంగా ల్యాబ్‌ రిపోర్ట్స్‌ లోనే ఇలా జరగొచ్చు అని చెప్తే.. వాటిని పట్టుకుని చంద్రబాబు నానా రాద్దాంతం చేశారు. దీని మీద సుప్రీంకోర్టు వెళ్తే చీవాట్లు పెట్టింది. ఆ తర్వాత సిట్‌ వేస్తే విచారణ జరిపి తాజాగా నివేదిక ఇచ్చింది. దున్నపోతు ఈనిందంటే కట్టేయండి అన్న చందాన పవన్‌ కళ్యాణ్‌ కూడా తిరుపతి వెళ్లి, మెట్లు కడిగి, అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024 జూన్, జూలైలో తీసుకున్న శాంపిల్స్‌ లో పూర్తి పరీక్షలు చేయకుండా, సెకండ్‌ ఒపీనియన్‌ కూడా లేకుండా అయోధ్యకు పంపిన లడ్డూల్లో జంతుకొవ్వు కలిసిందని ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేసారు.

ఆ డెయిరీలకు అనుమతిచ్చింది చంద్రబాబే:
    నెయ్యి కల్తీ పేరుతో ఆధారాలు లేకపోయినా రాజకీయంగా వైయ‌స్ఆర్‌సీపీపై బురదజల్లడంతో పాటు శ్రీవారిని కూడా అడ్డుపెట్టుకుని ఆయన ప్రసాదంలో పందికొవ్వు పేరుతో కలియుగ దైవాన్ని అపవిత్రం చేశారు. ఇవాళ ఏ కొవ్వూ లేదని తేలిపోయింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తిప్పి పంపిన నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరిగి వాడామని ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడు కల్తీ నెయ్యిని ఎందుకు వాడారో చెప్పండి. తిప్పిపంపిన ట్యాంకర్లను తిరిగి తెప్పించి వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది అపచారం కాదా వీళ్లు చెప్పాలి.
    నెయ్యిపై రిపోర్ట్‌ ఇచ్చిన సంస్థలు రెండూ ప్రతిష్టాత్మకమైనవే. ఇందులో ఒకటి హర్యానాలోని కర్నాల్‌ లో ఉన్న నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ (ఎన్డీఆర్‌ఐ), అలాగే గుజరాత్‌ లోని ఆనంద్‌ లో ఉన్న నేషనల్‌ డెయిరీ డెవలప్మెంట్‌ బోర్డ్‌ (ఎన్డీడీబీ). టెండర్లు దక్కించుకున్న ఏఆర్‌ డెయిరీ నెయ్యి పంపిణీ మొదలుపెట్టింది చంద్రబాబు హయాంలోనే. మేం అనుమతి ఇచ్చినా చంద్రబాబు హయాంలో సరఫరా చేస్తుంటే సరి చూసుకోవాలిగా. మీ పాలనలో సరఫరా అయిన నెయ్యికి కూడా మేం ఎలా బాధ్యత వహిస్తాం ?, భోలేబాబాకు తొలుత అనుమతి ఇచ్చింది చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే. ముందు హర్ష డెయిరీగా పేరు పెట్టుకుని, ఆ తర్వాత పేరు మార్చుకున్నారు. భోలేబాబాకు పాలు లేవని ఇవాళ పచ్చమీడియాలో రాతలు రాస్తున్నారు. అటువంటి డెయిరీకి మీరు అనుమతి ఎలా ఇచ్చారు?.
    చంద్రబాబు అధికారంలో ఉండగా అనుమతిచ్చిన భోలే బాబాగా చెప్తున్న హర్ష డెయిరీ కిలో నెయ్యి రూ.291కి ఎలా ఇచ్చింది?, ఇప్పుడు ఇంత చౌకగా ఎలా నెయ్యి కొనుగోలు చేశారని ప్రశ్నిస్తున్న వారు ముందు దీనికి సమాధానం చెప్పాలి. హిందూ ధర్మాన్ని గౌరవించే వారు ఇలాంటి చేష్టల్ని ఖండించాల్సిందే. 

అధికారులు రాజకీయ కుట్రలో భాగం కావద్దు:
    చిన్నప్పన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ కాదు, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి దగ్గర పనిచేసిన వ్యక్తి. ఆయన దగ్గరే జీతం కూడా తీసుకున్నాడు. చిన్నప్పన్‌ పీఏ అయితే ఛార్జిషీట్‌ లో వైవీ సుబ్బారెడ్డి పేరు ఉండాలిగా, ఎందుకు లేదు. లడ్డూకు నామాలు పెట్టి మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. వీళ్లకు అడ్డూ అదుపూ లేదు. టీటీడీ బోర్డు ఛైర్మన్‌ డబ్బు కోసం దేనికైనా సిద్దపడే వ్యక్తి. ఆయనకు వెంకటేశ్వరస్వామి మీద కాదు డబ్బుల మీద, బూతు బొమ్మలు చూపించడం మీద, నూజేన్‌ ఆయిల్‌ లాంటి ఉత్పత్తులు తయారు చేసి డబ్బులు దండుకోవడంలో, జూబ్లీ పార్క్‌ ల్లో డబ్బులు కాజేసే కార్యక్రమంలో ఉంది. ఆయన అపవిత్రుడు కాబట్టే కొండమీద అపచారాలు జరుగుతున్నాయి.
    మేం నాస్తికులు అంటున్న ఆయన పెద్ద ఆస్తికుడు మరి. ఐఏఎస్‌ అయిన శ్యామలరావు, ఐఆర్‌ఐఎస్‌ వెంకయ్య చౌదరికి ఏం పోయేకాలం వచ్చింది. మీరు భగవంతుడి దగ్గర కాపలా కాయకుండా నాటకాలు నడిపిస్తే భగవంతుడు క్షమించడు. వీరిద్దరిపై మాకు గౌరవం ఉంది. ధర్మాన్ని పాటించాల్సిన వీళ్లు చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగస్వాములై మా మీద బురదజల్లుతున్నారు. కానీ ప్రభుత్వాలు శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకోండి. లడ్డూ ప్రసాదం మీద ఆరోపణలు చేసిన వాళ్లు పుట్టగతుల్లేకుండా పోతారు. 

మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..
    తిరుమలలో వాడిన నెయ్యికి సంబంధించి సీబీఐ సిట్‌ పూర్తి వాస్తవాలతో కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ ఎందుకు మాట్లాడటం లేదు?. ఉప ముఖ్యమంత్రి ఆయనకు ఓ పార్టీ ఉందని గుర్తుంచుకోవాలి. మీరు చంద్రబాబు చెంచా అని మేం అనుకుంటున్నాం. కానీ జనం మాత్రం చంద్రబాబు చెంచా అనే అనుకుంటున్నారు. చంద్రబాబు చెప్పింది మాత్రమే వినకుండా పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి. పవన్‌ ఇంతవరకూ పొలిటిషియన్‌ గా మారలేకపోయారు. చంద్రబాబు, లోకేష్‌ చెప్పింది చేయడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ల అవినీతిలో నాకు భాగం లేదని పవన్‌ కళ్యాణ్‌ చెప్పాలి. ఆయన బీజేపీ, టీడీపీ.. ఇలా ఎవరికి ఏ వేషం కావాలంటే ఆ వేషం వేస్తున్నారు.
    అధికారం కోసం ప్రతిపక్షాల్ని దెబ్బతీయడం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారతారు. భగవంతుడు లేదు, తండ్రి లేదు, పిల్లనిచ్చిన మామ లేదు, పవన్‌ కళ్యాణ్‌ కూడా లేదు. ఆయనకు కొడుకు మాత్రమే ఉండాలి. కొడుకు వారసుడు కాబట్టి తనను మాత్రమే చంద్రబాబు లెక్క చేస్తాడని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

Back to Top