అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ పరామర్శ

టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన కార్లను పరిశీలించిన మాజీ సీఎం

గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. అండ‌గా ఉంటాన‌ని మాజీ సీఎం ధైర్యం చెప్పారు. గుంటూరులోని అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ గూండాలు దాడి చేసి ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యులను హతమార్చేందుకు ప్రయత్నించారని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పేందుకు వైయస్ జగన్ స్వయంగా వారి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దాడిలో ధ్వంసమైన కార్లను వైయస్ జగన్ పరిశీలించారు. నివాసంలో జరిగిన విధ్వంసాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన దాడి తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే గొంతులను అణిచివేయడానికి ఇటువంటి దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.

దాడి ఘటనలో బాధితుడైన అంబటి రాంబాబు పైనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించడం అన్యాయమని వైయ‌స్ జగన్ త‌ప్పుప‌ట్టారు. రాష్ట్రంలో చట్టం, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, అధికార పార్టీకి చెందిన గూండాలు రెచ్చిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై మాట్లాడే నాయకులను భయపెట్టే ప్రయత్నం జరుగుతోందని జగన్ ఆరోపించారు. అంబటి రాంబాబు కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని భితం కల్పించారు. ఇటువంటి దాడులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.

Back to Top