“రైతు కన్నీరు ఆగాలంటే బడ్జెట్‌లో నిజమైన కేటాయింపులు కావాలి”

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.వి.ఎస్. నాగిరెడ్డి 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మాజీ సభ్యుడు ఎం.వి.ఎస్. నాగిరెడ్డి 2026–27 రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌పై విశ్లేషణ విడుదల చేశారు.

“రైతు కన్నీరు దేశానికి మంచిది కాదు” అని వ్యవసాయ శాఖ మంత్రి వ్యాఖ్యానించినప్పటికీ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల రైతుల కంట నీరే కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ రూ.3,32,205.33 కోట్లు కాగా, వ్యవసాయ బడ్జెట్ రూ.53,752 కోట్లు అని తెలిపారు. అందులో విద్యుత్ సబ్సిడీకి రూ.13,752 కోట్లు, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు (పోలవరం సహా) రూ.14,277 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

అయితే విత్తన సబ్సిడీకి కేవలం రూ.240 కోట్లు, వ్యవసాయ యంత్రీకరణకు రూ.139.65 కోట్లు మాత్రమే కేటాయించారని, ఇవి గత ప్రభుత్వ ఐదేళ్ల సగటుతో పోలిస్తే తక్కువవని విమర్శించారు. ప్రస్తుత విత్తన ధరలను దృష్టిలో ఉంచుకుంటే ఈ కేటాయింపులు వాస్తవికం కాదన్నారు.

 రైతుల పరిస్థితి – కీలక అంశాలు:

* రెండు ఖరీఫ్‌ల సరాసరితో పోలిస్తే సాగు విస్తీర్ణం 8 లక్షల ఎకరాలు తగ్గిందని పేర్కొన్నారు.
* ఉచిత పంట బీమా రద్దు కారణంగా ఈ ఏడాది పంట నష్టాలు తీవ్రంగా రైతులను దెబ్బతీశాయని, బీమా ప్రీమియం చెల్లించినా పరిహారం అందలేదన్నారు.
* మోంథా తుఫాన్‌కు దెబ్బతిన్న పంటలకు కనీస ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ఆరోపించారు.
* సున్నా వడ్డీ రాయితీ చెల్లింపులు లేవని తెలిపారు.
* ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన రూ.20,000 హామీ అమలు కాలేదని, బడ్జెట్‌లో రూ.6,600 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. గత ప్రభుత్వంలో లబ్ధిదారుల సంఖ్యను పరిగణిస్తే రూ.10,716 కోట్లు అవసరమని చెప్పారు.

  ధరలు – ఉత్పత్తి సంక్షోభం:

మిర్చి, పొగాకు, మామిడి రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారని, ఉల్లి, అరటి, చెరకు రైతులు ధరలు లేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు.

ప్రత్తి ధర క్వింటాలుకు రూ.5–6 వేల మధ్యే ఉండగా, దిగుబడి 4–5 క్వింటాళ్లకే పరిమితమై రైతులు భారీగా నష్టపోయారని చెప్పారు. మొక్కజొన్న MSP రూ.2,400 ఉండగా రైతులు రూ.1,500–1,800కే అమ్ముకున్నారని, సజ్జ MSP రూ.2,750 ఉండగా రూ.1,800–1,900కే విక్రయించాల్సి వచ్చిందన్నారు.

ఖరీఫ్‌లో వరి ఉత్పత్తి గత సంవత్సరం 78.5 లక్షల టన్నులైతే, ఈ ఏడాది 70 లక్షల టన్నులకే పరిమితమైందని (కేంద్ర గణాంకాల ప్రకారం) పేర్కొన్నారు.

రబీ శనగ పంటకు MSP రూ.5,650 ఉన్నా, మార్కెట్లో ధర రూ.5,000కే పడిపోయిందని తెలిపారు. ధరల స్థిరీకరణకు కేవలం మార్క్‌ఫెడ్‌కు రూ.500 కోట్లు కేటాయించడం సరిపోదన్నారు.

 హార్టికల్చర్ అంశం:

రాయలసీమను హార్టికల్చర్ హబ్ చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, కానీ దానికి పునాది వేసింది మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి  ఉచిత విద్యుత్ పథకమేనని నాగిరెడ్డి పేర్కొన్నారు. అనంతరం  వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్, సబ్‌స్టేషన్‌ల ఆధునీకరణ, 75% డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ద్వారా హార్టికల్చర్‌కు ప్రోత్సాహం అందించారని గుర్తుచేశారు.

మొత్తంగా, 20 నెలల పాలనలో సాగు తగ్గి, ఉత్పత్తులు తగ్గి, ధరలు లేక రైతాంగం సంక్షోభంలో ఉన్నా బడ్జెట్‌లో ప్రత్యేక దృష్టి కనిపించలేదని ఆయన విమర్శించారు.
 

Back to Top