గుంటూరు జిల్లా: ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలం యామర్రు గ్రామంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను టీడీపీ నాయకులు చించివేయడాన్ని ప్రశ్నించినందుకు వైయస్ఆర్‌సీపీ నేతల ఇళ్లపై కర్రలు, రాడ్లతో దాడులకు పాల్పడ్డారని ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిలో గాయపడిన వైయస్ఆర్‌సీపీ నేతలను బలసాని కిరణ్‌కుమార్ పరామర్శించి, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల గ్రామంలోని ఎస్సీ కాలనీలో వైయస్ఆర్‌సీపీ నాయకులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను కొందరు టీడీపీ నాయకులు మద్యం మత్తులో కావాలనే చించివేశారని ఆరోపించారు. అనంతరం గ్రామ వీధుల్లో బూతులు తిడుతూ రెచ్చగొట్టారని, “ఫ్లెక్సీలు ఎందుకు చింపారు” అని ప్రశ్నించడంతో అధికార మదంతో కర్రలు, రాడ్లు తీసుకుని కార్యకర్తల ఇళ్లపై దాడులకు దిగారని మండిపడ్డారు. ఘటనపై సరైన విచారణ చేయకుండా మండల పార్టీ అధ్యక్షుడు వీరనారాయణతో పాటు వైయస్ఆర్‌సీపీ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బెదిరించారని ఆయన ఆరోపించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ఏకపక్షంగా టీడీపీకి కొమ్ముకాస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని అన్నారు. దాడికి పాల్పడిన టీడీపీ నాయకులపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేకుంటే న్యాయపరంగా పోరాటం చేస్తామని బలసాని కిరణ్‌కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వట్టిచెరుకూరు మండలం, యామర్రు గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.