పామర్రు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ మెగా స్కామ్‌గా మారిందని, నిరుద్యోగులను దగా చేశారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. గురువుల నియామకాల వంటి కీలక ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా మాయమైందని, స్పోర్ట్స్ కోటా పేరుతో భారీ అవకతవకలు జరిగాయని, ఇది అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఐటీ శాఖలో పరిశ్రమల కోసం 99 పైసలకే భూములు ఇచ్చి బాగానే పోగేసుకుంటున్నారు కదా.. అమరావతిలో అడుగుకు రూ.20 వేల కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్లు కొట్టేస్తున్నారు కదా.. ఇప్పుడు టీచర్ల నియామకాలలో కూడా ఇన్ని తప్పుడు పనులా? అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను సూటిగా ప్రశ్నించారు. కృష్ణా జిల్లా పామర్రులోని ఆరేపల్లి కళ్యాణ మండపం వద్ద పార్టీ నేతలు కైలే అనిల్‌కుమార్, వరికూటి అశోక్‌కుమార్‌లతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. 16 వేలకుపైగా టీచర్ పోస్టుల భర్తీలో మెరిట్ లిస్ట్ విడుదల చేయకుండా గోప్యంగా మార్కులు పంపించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. టెట్, డీఎస్సీ రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో 421 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, వారి సర్టిఫికెట్లు వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిజాయితీగా నియామకాలు జరిగితే పూర్తి వివరాలు విడుదల చేయాలని, లేకపోతే మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణకు ఆదేశించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. ప్రెస్‌మీట్‌లో పేర్ని నాని ఏమన్నారంటే.. - అక్రమాల పుట్టగా విద్యాశాఖ చంద్రబాబు ప్రభుత్వంలో మరి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి చాలా విచిత్రంగా ఉంది. తన శాఖను గాలికి వదిలేసి మిగతా అన్ని శాఖల్లో లోకేష్ వేలు పెట్టి ఏదో ఉద్ధరిస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారు. సమాజానికి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే గురువులను నియమించాల్సిన విద్యాశాఖ ఇప్పుడు అక్రమాల పుట్టగా మారింది. ఐటీ శాఖలో పరిశ్రమల కోసమని 99 పైసలకే ఎకరం భూములు ఇచ్చి వెనకేసుకుంటున్నారు.. అమరావతిలో చదరపు అడుగుకు రూ.20 వేలతో టెండర్లు ఇచ్చి కమీషన్లు కొట్టేస్తున్నారు.. ఇప్పుడు టీచర్ల నియామకాలలో కూడా అదే అవినీతి కొనసాగిస్తున్నారు. - మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చి.. 16 వేల టీచర్ పోస్టుల భర్తీ పేరుతో మెగా డీఎస్సీని కూటమి ప్రభుత్వం దగా డీఎస్సీగా మార్చేసింది. 3.30 లక్షల మంది పరీక్షలు రాస్తే మెరిట్ లిస్ట్ విడుదల చేయాలి కదా? కానీ ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో బయటపెట్టకుండా సెల్‌ఫోన్లకు సీక్రెట్ మెసేజ్‌లు పంపుతున్నారు. ఎంత డబ్బు ఇస్తే అంత ర్యాంక్ ఇస్తారా? పైగా డీఎస్సీపై ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడతామని విద్యాశాఖ నుంచే హెచ్చరికలు చేయించడం దారుణం. - టెట్, డీఎస్సీ లేకుండానే టీచర్ పోస్టులా? 2012 నుంచి రాష్ట్ర ప్రభుత్వ నియామకాలలో స్పోర్ట్స్ కోటా కింద 2 శాతం రిజర్వేషన్ అమలులో ఉంది. రాత పరీక్షల్లో అర్హత సాధించిన క్రీడాకారులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేవారు. కానీ 2025 ఏప్రిల్ 19న జీవో నెం.47, జీవో నెం.4 తీసుకొచ్చి స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచారు. అంతేకాదు.. టెట్, డీఎస్సీ రాయకుండానే నేరుగా టీచర్ పోస్టులు పొందేలా మార్పులు చేశారు. 3.30 లక్షల మంది పోటీ పడుతున్న నియామకాల్లో దొడ్డిదారిన ఎంపికలు చేశారు. అది నిజమైన సర్టిఫికేటా? నకిలీదా? అభ్యర్థి నిజంగా ఆటగాడా? కాదా? అన్నది కూడా పట్టించుకోలేదు. - నియామక ప్రక్రియ అపహాస్యం స్పోర్ట్స్ కోటాలో ఉన్న 29 ఆటలను 67 ఆటలుగా మార్చి జీవో విడుదల చేశారు. టెన్నికాయిట్, రబ్బర్ బాల్, తాడు లాగే ఆటలు, బొంగారాల ఆటల్ని కూడా చేర్చి నియామక ప్రక్రియను అపహాస్యం చేశారు. ఈ విధంగా 421 మందిని నేరుగా వ్యాయామ ఉపాధ్యాయులుగా నియమించారు. ఇది దగా డీఎస్సీ.. మెగా స్కామ్ కాకపోతే మరేమిటి? స్పోర్ట్స్ కోటాలో నియమించిన 421 మంది సర్టిఫికెట్లు బయటపెట్టాలని సవాల్ చేస్తున్నాను. దమ్ముంటే, నిజాయితీగా నియామకాలు చేశామని చెప్పగలిగితే ఆ 421 మంది వివరాలు బయటపెట్టండి. వాళ్లు టెట్, డీఎస్సీ రాశారా? ఏ కాలేజీల్లో చదివారు? ఎన్ని మార్కులు సాధించారు? అన్న పూర్తి వివరాలు వెల్లడించండి. మెరిట్ లిస్ట్ కూడా బయటపెట్టలేని పరిస్థితిలో సినిమా డైలాగులు చెప్పడం ఉపయోగం లేదు. సినిమా డైలాగులు చెప్పడం కాదు. బాలకృష్ణ సినిమాలు చేసి డబ్బులు సంపాదిస్తారు.. లోకేష్ స్కామ్‌లు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్ లోకేష్. - ప్రశ్నిస్తే కేసులు పెడతారా? పెట్టుకోండి డీఎస్సీ అవకతవకలను ప్రశ్నిస్తే కేసులు పెడతారా? పెట్టండి.. కైలే అనిల్, వరికూటి అశోక్, రమేష్ యాదవ్, పేర్ని నానిపై కేసులు పెట్టండి. మేం తప్పులను నిలదీస్తున్నాం. టీచర్ల నియామకాలు పూర్తయ్యాక వెంటనే 3 శాతం స్పోర్ట్స్ కోటా పేరుతో జీవో తీసుకొచ్చారు. రాత పరీక్షల్లో అర్హత సాధించిన తర్వాతే స్పోర్ట్స్ కోటా ఉండాలి. కానీ ఈ ఒక్క జీవోతో దొడ్డిదారిన తలుపులు తెరిచి కొందరిని లోపలికి పంపించారు. వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఎంపికయ్యారు? అన్నది ప్రజలకు చెప్పాలి. టీచర్ల నియామకాల్లో ఈ ఒక్క స్పోర్ట్స్ కోటా నియామకానికే టెట్, రాతపరీక్షలు లేకుండానే ఉద్యోగాలు ఇచ్చారు. ఇది కాంపిటేటివ్ పరీక్షల వ్యవస్థను అవమానపరచడమే. స్పోర్ట్స్ కోటాలో నియమించిన వారి సర్టిఫికెట్లు వెంటనే బయటపెట్టాలి. మొత్తం నియామకాలపై సీబీఐ విచారణ జరిపి ప్రభుత్వం తన నీతి, నిజాయితీని నిరూపించుకోవాలి. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రశ్నించడం మానేసి రోజుకో మాట, పూటకో మాట మాట్లాడుతూ పిట్టల దొరలా వ్యవహరిస్తున్నారు” అని పేర్ని నాని విమర్శించారు.