పోర్ట్ పేరుతో రైతుల భూముల్లో విద్యుత్ టవర్లా?

రైతులకు పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలి

మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్‌

కృష్ణాజిల్లా: మచిలీపట్నం మండలం కొత్తపూడి గ్రామంలో పోర్టు అవసరాల పేరుతో రైతుల భూముల్లో హై ఓల్టేజ్ విద్యుత్ టవర్ల ఏర్పాటుకు అధికారులు మార్కింగ్ చేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల అనుమతి లేకుండానే రెవెన్యూ అధికారులు భూముల్లో మార్కింగ్ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని గ్రామాన్ని సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. 1994-95 సంవత్సరాల్లో కొత్తపూడి గ్రామంలోని దళిత, పేద కుటుంబాలకు ప్రభుత్వం పట్టాల రూపంలో భూములు ఇచ్చిందని గుర్తు చేశారు. అనంతరం వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆ పట్టాలన్నింటినీ ఫ్రీహోల్డ్‌గా మార్చి రైతులకు పూర్తి హక్కులు కల్పించామని తెలిపారు. ఇప్పుడు పోర్టు అవసరాల కోసం ఆ భూముల్లో హెవీ విద్యుత్ లైన్ టవర్లు వేయడానికి అధికారులు మార్కింగ్ చేయడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు. హై ఓల్టేజ్ విద్యుత్ లైన్లు వెళ్తే భూముల విలువ పూర్తిగా తగ్గిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, చర్చలు జరపకుండా అధికారులు ఏకపక్షంగా చర్యలు తీసుకోవడం సరైంది కాదన్నారు. విద్యుత్ లైన్ టవర్లు వేయాలనుకుంటే రైతుల భూములను పూర్తిగా కొనుగోలు చేసి తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అసైన్డ్ భూములను సేకరించిన సందర్భాల్లో కూడా రైతులకు సంతృప్తికరమైన పరిహారం అందించి, వారి అంగీకారంతోనే పనులు చేపట్టామని పేర్ని నాని గుర్తుచేశారు. కొత్తపూడి గ్రామ రైతులకు కూడా ప్రభుత్వం ముందుగా పరిహారం చెల్లించి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పనులు ప్రారంభించాలని ఆయన కోరారు.
 

Back to Top