తాడేపల్లి: వ్యవసాయం గాడి తప్పితే మిగిలిన ఏ రంగం ముందుకెళ్లదని స్వామినాథన్ చెప్పారని ఇవాళ వ్యవసాయ బడ్జెట్లో రాసుకున్నారని, కానీ ఇక్కడ ప్రభుత్వం గాడి తప్పింది కాబట్టి రాష్ట్రమే కుదేలవుతోందని వ్యవసాయశాఖ మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ప్రభుత్వం గాడితప్పిందనేది ఇవాళ పెట్టిన బడ్జెట్లోనే అర్దమవుతోందన్నారు. రైతుల్ని గాలికొదిలేసింది కాక గత ప్రభుత్వ చేదు అనుభవాలను తొలగించడానికే అని చెప్పుకోవడానికి ప్రభుత్వానికి సిగ్గుండాలన్నారు. గతంలో వైయస్ఆర్‌సీపీ హయాంలో తీసుకొచ్చిన పథకాలను పేరు మార్చినా అమలు చేసుకోలేదని దుస్దితి ఉందన్నారు. రైతు ఆత్మహత్యల్ని సైతం ఆపలేని ప్రభుత్వం.. బడ్జెట్లో కనీసం వారి కుటుంబాల్ని ఆదుకునేందుకు సైతం ప్రయత్నించలేదని కన్నబాబు ఆక్షేపించారు. ప్రెస్ మీట్ లో కన్నబాబు ఇంకేమన్నారంటే.. ఏది చేదు అనుభవం చంద్రబాబూ ? వ్యవసాయ బడ్జెట్లో ప్రభుత్వం మార్కెటింగ్ కూ, జబ్బలు చరచుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. గత ప్రభుత్వ చేదు అనుభవం తొలగించడానికే ఈ బడ్జెట్ అంటున్న వారు ఏది అసలు చేదు అనుభవమో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రైతు భరోసా అనే పెట్టుబడి సాయం పథకం మ్యానిఫెస్టోలో ప్రకటించి అమలు చేయడం చేదు అనుభవమా లేక దాన్నే పేరు మార్చి అన్నదాత సుఖీభవ పేరు చెప్పి తెచ్చిన పథకంలో రైతుల్ని మోసం చేయడమా చెప్పాలి. వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తెచ్చిన ఉచిత పంటల బీమా చేదు అనుభవమా లేక మీరు అధికారంలోకి రాగానే ఎత్తేయడం చేదు అనుభవమా చెప్పాలి. ప్రకృతి విపత్తుల వల్ల ఏ సీజన్ లో పంట నష్టపోతే ఆ సీజన్ లోనే పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పి మరీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇవ్వడం చేదు అనుభవమా లేక మోంథా తుఫాను సహా ఏ విపత్తు వచ్చినా రైతులకు పది రూపాయల సాయం చేయకపోవడం చేదు అనుభవమా చెప్పాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేది వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఓ ఉద్యమంలా జరిగితే అది చేదు అనుభవమా.. లేక ఇప్పుడు ఉల్లి, పసుపు, మిర్చి, టమోటో, మామిడి, మొక్కజొన్న, శెనగ ధరలు పతనమై రైతులు కుదేలైపోయినా కూటమి సర్కార్ పట్టించుకోకపోవడం చేదు అనుభవమా చెప్పాలి. మా పథకాల్నీ కొనసాగించలేరా ? వ్యవసాయం అనేది దండగ అనేది మీ మైండ్ సెట్ అనేది మీ బడ్జెట్లు చూస్తేనే అర్థమవుతుంది. గొప్ప లక్ష్యంతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆనాడు రైతు భరోసా కేంద్రాలు స్థాపిస్తే .. రైతు సేవా కేంద్రంగా పేరు మార్చి, అయినా సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. అక్కడ ఉన్న కియోస్క్ లు సైతం పనిచేయలేని పరిస్దితికి తెచ్చారు. యూరియా కూడా అందించలేని ప్రభుత్వం రైతు పక్షపాతిగా చెప్పుకోవడానికి సిగ్గనిపించడం లేదా ?, బస్తా యూరియా కావాలంటే రైతులు అయితే వారం రోజులు లైన్లో నిలబడాలి లేకపోతే బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సి వస్తోంది. అయినా దాన్ని కూడా కవర్ చేసుకుంటూ ఎరువులు, పురుగుల మందుల వాడకం తగ్గిస్తామని చెప్పుకుంటున్నారు. కేజీ నాణ్యమైన విత్తనాల కోసం రైతులు బారులు తీరాల్సిన దుస్దితి తీసుకొచ్చిన దగాకోరు, అబద్ధాల కోరు ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా ?, చంద్రబాబుకు ఎప్పుడూ రైతుల మీద చిన్నచూపే. మీ 20 నెలల ప్రభుత్వంలో రైతులకు మేలు చేసిన ఒక్క పథకం అమలు చేశామని చెప్పుకోగలరా ?, పథకాల్లో కోతలు, కౌలు రైతులకూ అన్యాయం ఇవాళ బడ్జెట్లో అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,600 కోట్లు చూపించారు. గత ప్రభుత్వ లెక్కల ప్రకారం 54 లక్షల మంది రైతులకు మీరు ఈ పథకం అందించాలంటే దాదాపు రూ.10, 200 కోట్లు బడ్జెట్లో పెట్టాలి. కానీ మీరు ఉద్దేశపూర్వకంగా ఇంత మొత్తం రైతులకు ఎగ్గొడుతున్నట్లు ఒప్పుకున్నట్లయింది. 54 లక్షల మంది రైతులకు ఇవ్వాల్సి ఉండగా 46 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. మిగతా వాళ్లు ఎందుకు ఈ లెక్కల్లోకి రాలేదు ?, వాళ్లంతా వ్యవసాయం వదిలేసి రైతులు కూలీలుగానో, ఈ ప్రభుత్వం చేయూతనివ్వక వ్యవసాయానికి దూరం కావడం లేదా, మీరే రైతుల లెక్కల్ని తగ్గించి మోసం చేసి ఉండాలి. మీరు కౌలు రైతులకు ఏదైనా మేలు చేస్తామని ఎందుకు చెప్పలేకపోయారు, ఈ రాష్ట్రంలో కౌలు రైతులు లేరా ?, ఉన్నా ప్రభుత్వం గుర్తించడం లేదా ? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గత బడ్జెట్లలోనూ కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ ఇవ్వకపోగా.. ఈసారి కూడా వారికి ఇవ్వకుండా మోసం చేశారు. కౌలు రైతులకు కూడా చేయూత ఇవ్వలేని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. వైయస్ జగన్ మోహన్ రెడ్డితో మీకు పోలికా ? వైయస్ఆర్‌సీపీ హయాంలో ఏటా ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లు కేటాయిస్తే... ఇవాళ మీరు రూ.300 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అయినా గొప్పలు చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా ?, ఇవాళ రైతులకు కనీస మద్దతు ధరలేక రైతులు పంటలు పారబోసుకుంటున్నారు. మామిడి రైతులకు కేజీకి 8 రూపాయలు ఇచ్చామన్నారు, బడ్జెట్ లో ఆ లెక్కలు ఎందుకు లేవు ?, ఇన్ పుట్ సబ్సిడీకి రూ.310 కోట్లు ఇచ్చామని చెప్పుకుంటున్న మీకు.. గత ప్రభుత్వంలో చెప్పిన సమయానికి రైతుల ఖాతాల్లో వేసిన విషయం గుర్తులేదా ? అక్వా కల్చర్ అయినా హార్టి కల్చర్ అయినా వైయస్ జగన్ మోహన్ రెడ్డితో మీకు పోలిక ఎక్కడుంది. ఉచిత పంటల బీమా పథకం ద్వారా వైయస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు 5 వేల కోట్లు రైతులకు సాయం అందిస్తే.. కూటమి ప్రభుత్వం దాన్ని ఎత్తేసింది. ఇప్పుడు బడ్జెట్ లో కేవలం రూ.250 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రైతులకు వడ్డీ లేని రుణాలకు రూ.250 కోట్లు ఇస్తామంటున్నారు. గతేడాది రైతులకు రుణాలు ఇచ్చారా ? అక్వాకల్చర్ అయితే ప్రధాన బడ్జెట్ లో 850 కోట్లు, వ్యవసాయ బడ్జెట్ లో 627 కోట్లు ఖర్చుపెట్టామని రాసుకున్నారు. చంద్రబాబు జోన్లతో సంబంధం లేకుండా ఉచిత విద్యుత్ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అక్వా జోన్ లో మాత్రమే చివరి రెండు సంవత్సరాలు అమలు చేసిన 10 ఎకరాల లోపు రైతులకు యూనిట్ కు రూపాయిన్నర ఇచ్చి మిగతా వారందరికీ ఎందుకు ఎగ్గొట్టారు. ఇప్పుడు మళ్లీ కాలయాపన కోసం జిల్లా కమిటీల్లో, అప్సెడాలో నమోదు చేసుకోవాలని నిబంధనలు తెస్తే రైతులు మీటింగ్స్ పెట్టుకుని వ్యతిరేకించలేదా ? రైతుల్ని వదిలి కార్పోరేట్లకు మేలా ? హార్టికల్చర్ కు మేలు జరిగింది అప్పట్లో వైయస్ఆర్ హయాంలోనే. ఉమ్మడి రాష్ట్రంలో 2004 వరకూ లక్షా 2 వేల హెక్టార్టలో హార్టీ కల్చర్ ఉంటే.. 2014కు 23 లక్షల 29 వేల హెక్టార్లలో హార్టీకల్చర్ వచ్చింది. ఆ పదేళ్లలో చంద్రబాబు అధికారంలో ఉన్నారా ? ఇవాళ బడ్జెట్లో రాయలసీమ గ్లోబల్ హార్చికల్చర్ హబ్ పేరుతో బాహుబలి పథకం తెస్తున్నామని చెప్పుకున్నారు. లక్ష కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును ప్రైవేటు పెట్టుబడులు, కేంద్ర సాయంతో అమలు చేస్తామంటున్నారు. ఇందులో ప్రభుత్వ వాటా 30 వేల కోట్లు అంటున్నారు. పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు డబ్పులివ్వరు, మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి డబ్బుల్లేవంటారు, మరి ఇప్పుడు ఈ 30 వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు ?. రైతు బజార్లు కూడా పీపీపీ మోడల్ లో తీసుకురావడం ఘనత అని బడ్జెట్లో రాసుకున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో పీపీపీ పద్దతిలో తెస్తారట. దళారుల వ్యవస్థకు అడ్డుకట్ట వేయడానికి తెచ్చిన రైతు బజార్లలో ప్రైవేటు వ్యక్తుల్ని తెస్తే ఇక వాటికి అర్ధమేముంది ? కార్పోరేట్లపై మీకెందుకు అంత ప్రేమ ? ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాల్నీ ఆదుకోలేరా ? గతేడాది రాష్ట్రంలో 394 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వ డేటా చెబుతోంది. అంటే రోజుకు ఒకరి కంటే ఎక్కువ. రైతు కూలీలైతే కనీసం రోజుకు నలుగురు నుంచి ఐదుగురు చనిపోతున్నారని మీ డేటా చెబుతోంది. రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు ఆపడానికి మీరు తీసుకున్న చర్యలేంటి ? రైతు కుటుంబాల్ని ఆదుకోవడానికి బడ్జెట్ లో కేటాయింపులు ఇచ్చారా ?, గతేడాది ఇన్ని రైతు ఆత్మహత్యలు జరిగినా ఈసారి బడ్జెట్లో వాళ్లను ఆదుకుంటామని ఎందుకు చెప్పలేకపోయారు?, పల్లె కన్నీరు పెడుతోందంటూ మీ ఎమ్మెల్యేనే ట్వీట్ చేశారు. ఈ పాలనలో పల్లె, పట్టణమే కాదు ప్రతీ రంగం కుదేలైంది. మీరు కేవలం రియల్ ఎస్టేట్ రంగానికీ, ప్రైవేటు, కార్పోరేట్ వ్యక్తులకే మేలు చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్లో మాట్లాడరు, కానీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని పండగలు చేసుకుంటే మిగతా వాళ్లు చప్పట్లు కొట్టాలి. మీకు మీరే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ ప్లాప్ సినిమాకూ కలెక్షన్లు వచ్చినట్లు సంబరాలు చేసుకుంటున్నారని కన్నబాబు ఆక్షేపించారు.