ఆత్మస్తుతి. పరనింద. అదే ఈ ఏడాది వార్షిక బడ్జెట్. :బొత్స సత్యనారాయణ. శాసనమండలి విపక్షనేత. – అసెంబ్లీలో ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్ చూస్తే అంతా ఆత్మస్తుతి. పరనింద తప్ప ఏమీ లేదు. వాళ్లను వాళ్లు పొగుడుకోవడం, గత ప్రభుత్వం పేరుతో మా మీద నిందలు వేయడం చేశారు. మీరు ఉద్దరిస్తారనే కదా ప్రజలు అధికారమిచ్చారు. బడ్జెట్లో 100 సార్లు చంద్రబాబు పేరు, 75–80 సార్లు లోకేష్ పేరు, 20 సార్లు పవన్‌కళ్యాణ్ పేరు ప్రస్తావించారు. గత సంవత్సరం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొగాకు, మిర్చి, మామిడి, జొన్న.. ఇలా ఏ ఒక్క పంటకూ మద్దతు ధరను అందించలేక పోయారు. అంతా అంకెల గారడీ. వాస్తవికత ఎక్కడా కనిపించలేదు. రైతు ఓ పంట వేస్తే ప్రభుత్వం ఆదుకుంటుందనే ధైర్యం, స్థైర్యం పొగొట్టారు. డ్వాక్రా సంఘాలకు గతంలో వైఎస్సార్ పావలా వడ్డీకి రుణాలు ఇస్తే, జగన్‌గారు సున్నా వడ్డీకే ఇచ్చారు. కానీ చంద్రబాబు పాలనలో ఆ సున్నా వడ్డీ ఏమైందో ఎవరికీ తెలియదు. దానికి కేటాయింపులు కూడా చేయడం మానేశారు. మరి ఎలా ఇంటింటికీ పారిశ్రామికవేత్తను తయారు చేస్తారో చంద్రబాబే చెప్పాలి. రాష్ట్ర అప్పు రూ.9.46 లక్షల కోట్లు ఉన్నట్లు బడ్జెట్‌లో చెప్పారు. కానీ మా ప్రభుత్వ హయాంలో రూ.3.21 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశామని చెప్పాం. కాబట్టి ప్రభుత్వం చెబుతున్న లెక్క కూడా తప్పు. ఇంకా రూ.97 వేల కోట్లు లోటు బడ్జెట్ చూపించారు. రాష్ట్ర చరిత్రలో మూడో వంతు లోటు బడ్జెట్ ఉండటం ఇదే తొలిసారి. నిరుద్యోగ భృతి లేదు. ఆడబిడ్డ నిధి లేదు. ఇచ్చిన పథకాలకూ నిధుల కేటాయింపులు సక్రమంగా లేవు. ఈ రెండేళ్లలో ఒక్క కౌలు రైతుకూ రైతు భరోసా ఇవ్వలేకపోయారు. కౌలు రైతుల్ని మేం నేరుగా గుర్తిస్తామని చెప్పి, కార్డులిచ్చినా రైతు భరోసా ఇవ్వలేకపోయారు. ఈ బడ్జెట్ వల్ల వీసమెత్తు మేలు జరగలేదు. బడ్జెట్ మోసాలపై సభలోనే తేల్చుకుంటాం. అప్పులపైనా తప్పుడు లెక్కలు. :పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ. – కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన మూడో వార్షిక బడ్జెట్ లో చేసింది చెప్పుకునే అవకాశం లేక, ఏం చేస్తామో చెప్పుకోలేక అగమ్య గోచరంగా ఉంది. గతంలో ఐదేళ్ల పాటు మా ప్రభుత్వంలో బడ్జెట్ ప్రవేశపెడితే చేసింది కచ్చితంగా చెప్పుకునేవాళ్లం. ఏం చేస్తామో ముందుగానే చెప్పేవాళ్లం. కానీ మా ప్రభుత్వంలో రూ.10 లక్షల కోట్లు, రూ.12 లక్షల కోట్ల అప్పు చేశామని అబద్దాలు చెప్పిన వాళ్లు, ఇప్పుడు రూ.9 లక్షల కోట్లు అంటున్నారు. ఇప్పుడు రూ.98 వేల కోట్లు లోటు ఉందని, దాని కోసం అప్పు చేస్తామని చెబుతున్నారు. ఇది కాకుండా అమరావతి, ఇతర అన్ని లోన్లు కలిపి మరో లక్ష కోట్లు అప్పు చేయాల్సి ఉంది. మరోవైపు ప్రభుత్వ ఆదాయాలు పడిపోయి అభివృద్ధి కుంటు పడింది. ఈ బడ్జెట్‌లో కూడా నిరుద్యోగ భృతికి కేటాయింపులు సున్నా. ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలా రూ.1500 కోసం 1.20 కోట్ల మంది మహిళలు ఎదురుచూస్తున్నారు. చేయూత, ఆసరా, సున్నా వడ్డీ రద్దు చేసి ఇస్తామన్న ఆడబిడ్డ నిధికి రూపాయి కూడా ఇవ్వలేకపోయారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి రూ.8500 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వానికి సెన్స్ లేదు. ఈ బడ్జెట్ అందుకు సాక్ష్యం. :మొండితోక అరుణ్‌కుమార్. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ. – బడ్జెట్ మొత్తం తప్పుల తడక. అంకెల గారడి తప్ప ఇంకేం లేదు. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం సెన్స్ లేదని ఈ బడ్జెట్ చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ అనేది లేనే లేదు. ఈ 20 నెలల్లో ఏకంగా రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారు. ఈ ఏడాది మరో లక్ష కోట్ల అప్పుకు సిద్ధమవుతున్నారు. ఈ బడ్జెట్‌లో ప్రజా సమస్యల పరిష్కారం ఊసే లేదు. మద్దతు ధర లేక రైతులు రోడ్డెక్కుతుంటే, వారికి అన్నీ ఇచ్చేశామని నిస్సిగ్గుగా బడ్జెట్‌లో చెప్పేశారు. నిజం చెప్పాలంటే రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగవుతున్న, సరఫరా అవుతున్న గంజాయికి మాత్రమే మద్దతు ధర ఇచ్చారు. ఇంకా ఉద్యోగులకు కూడా ఈ బడ్జెట్‌లో మొండిచెయ్యి చూపించారు. వారికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. విద్యార్థులకు కూడా నిధులు కేటాయించలేదు. ఆడబిడ్డ నిధికి కేటాయింపులు లేవు. ఇళ్ల పట్టాల ప్రస్తావన లేదు. ఇంకా ఎన్నికల్లో ఇచ్చిన హామీలపైనా ఎలాంటి ప్రస్తావన లేదు. అమరావతికి నిధులు ఎలా తెస్తారన్న ప్రస్తావన కూడా లేదు. కూటమి ప్రభుత్వం వరసగా మూడు బడ్జెట్లలోనూ, హామీలు అమలు చేయకుండా మోసం చేస్తూనే ఉంది. మొత్తం మీద అన్ని వర్గాల వారికి నిరాశ కలిగించే బడ్జెట్ ఇది. బడ్జెట్ అంకెల గారడీ. రాష్ట్రం అప్పుల కుప్ప. :వరుదు కళ్యాణి. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ. – బడ్జెట్ అంతా అంకెల గారడీ కాగా, రాష్ట్రం అప్పులకుప్పగా మారుతోంది. నమ్మి ఓట్లేసిన ప్రజల్ని మోసం చేసిన బడ్జెట్ ఇది. నిరుద్యోగులు, మహిళలు, రైతుల్ని పచ్చిగా దగా చేసిన చేసిన బడ్జెట్ ఇది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క దానికైనా సరైన నిధులు కేటాయించకుండా, వచ్చే ఏడాదికి మరో లక్ష కోట్ల అప్పుకు రెడీ అవుతున్నారు. ఒకవైపు సంపద సృష్టి లేకపోగా, కేవలం ఈ 20 నెలల్లోనే రూ.3 లక్షల కోట్లకుపైగా అప్పు చేశారు. అందుకే ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు. డబల్ చీటింగ్ సర్కార్. పథకాల ద్వారా ఒక్కో ఇంటికి ఎంతెంత వస్తుందని చెబుతూ, ప్రతి ఇంటికి సంతకాలతో బాండ్లు పంపిచారు. మరి ఆ హామీలకు, ఈ బడ్జెట్‌కు ఏ మాత్రమైనా సంబంధం ఉందా? ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని నమ్మించి, ఈ బడ్జెట్‌లో కూడా దానికి ఒక్క రూపాయి కేటాయించలేదు. నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగభృతి కూడా అంతే. దానికీ సున్నా కేటాయింపు. 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ అన్నారు. ఆ ఊసే లేదు. రెండు సెంట్ల స్థలం ఇస్తామన్నారు. దానికి ఒక్క రూపాయి కేటాయించలేదు. పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ రుణాల గురించి కూడా ఈ బడ్జెట్‌లో ఏ ప్రస్తావనా లేదు. వీటన్నిటి మీద కౌన్సిల్‌లో నిలదీస్తాం. బడ్జెట్ వీక్. పబ్లిసిటీ పీక్. :కల్పలతారెడ్డి. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ. – బడ్జెట్ పుస్తకాల్లో ఇచ్చిన లెక్కలకూ, బయట చేసుకుంటున్న పబ్లిసిటీకీ అస్సలు సంబంధం లేదు. బడ్జెట్ మొత్తం ఆత్మస్తుతి చేసుకున్నారు. అయినా రైతులు, మహిళలు, ఉద్యోగులు ఇలా ఏ రంగం వారికీ ఈ బడ్జెట్ సంతృప్తి ఇవ్వలేదు. నిధుల కోసం ఎదురు చూసిన వారందరినీ నిరాశపర్చారు. మ్యానిఫెస్టోలో చెప్పిన సూపర్ సిక్స్ అమలు చేసేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. ఆడబిడ్డ నిధికి రూపాయి కూడా కేటాయించలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఇచ్చిన సున్నావడ్డీ ఊసే లేదు. మహిళలను ముంచేసి మహిళా సాధికారత గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. నిరుద్యోగ భృతి ప్రస్తావన కూడా లేకుండా మరో బడ్జెట్ వెళ్లిపోయింది. ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ బకాయిలు, ఐఆర్ ఇలా ఏ ఒక్కటీ ఇవ్వలేకపోయారు. ఉద్యోగులకు ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేక పోయారు. హోం మంత్రి మండలిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తమ శాఖలో ఉన్న పోలీసులకు మేలు చేశామంటూనే.. వాళ్లకు రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేశారు. ఇది ఎవరికీ పనికిరాని బడ్జెట్. :కుంభా రవిబాబు. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ. – బడ్జెట్ ఎప్పుడైనా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఉండాలి. కానీ, ఈ బడ్జెట్ మాత్రం ఎందుకు పనికిరాని విధంగా, ఎవరికీ మేలు చేయని విధంగా ఉంది. ప్రభుత్వం సంపద సృష్టికి బదులు అప్పులు చేస్తోంది. ఎలా చూసినా ఈ బడ్జెట్ ఒక అభూత కల్పనగా ఉంది. బడ్జెట్ అంతా అబద్ధాలతో నిండిపోయింది. ఎన్నికల సమయంలో ఏపీ అప్పులపై ఇష్టానుసారంగా మాట్లాడారు. మరి ఆనాడు అప్పులపై ఎందుకలా తప్పుడు ప్రచారం చేశారన్న దానికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెడుతున్నారు. :బొర్రా గోపీమూర్తి. పీడీఎఫ్ ఎమ్మెల్సీ. – బడ్జెట్ అంటే ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచేలా ఉండాలి. కానీ ఇది ప్రజలకు పనికిరాని బడ్జెట్‌లా ఉంది. సంపద సృష్టించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెడుతోంది. బడ్జెట్‌లో రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల జీవన ప్రమాణాలు ఎలా పెంచుతారో ఎక్కడా పేర్కొనలేదు. ప్రజల ఆశలకు అనుగుణంగా ఉండాల్సిన బడ్జెట్ అభూత కల్పనలతో అబద్ధాల పుట్టగా ఉంది.