గుంటూరు: అధికార మదంతోనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు తన ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించారని, పోలీసుల పర్యవేక్షణలోనే అదంతా జరగిందని వైయస్ఆర్‌సీపీగుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఒక మాజీ మంత్రిపై ఇంతటి దారుణమైన భౌతిక దాడులు, కుల రాజకీయాలు జరగడం రాష్ట్ర చరిత్రలో మున్నెన్నడూ చూడలేదని ఆయన వెల్లడించారు. పార్టీ పిలుపు మేరకు గత నెల 31న ఆలయంలో పూజలు ముగించుకుని వస్తుండగా, టీడీపీ గూండాలు రాడ్లు, కర్రలతో తన కారుపై దాడి చేశారని, తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారని, ఆ సందర్భంగా తాను నోరు జారానని చెప్పారు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత, తప్పిదాన్ని ఒప్పుకుని క్షమాపణ కూడా కోరానని తెలిపారు. అయినప్పటికీ టీడీపీ మూకలు తన ఇంటిపై దాడి చేసి, స్వైర విహారం చేస్తూ, ఏడు గంటలపాటు విధ్వంసం సృష్టించారని గుర్తు చేశారు. 18 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ తర్వాత బెయిల్ రావడంతో నిన్న (గురువారం) రాజమహేంద్రవరం జైలు నుంచి విడదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు, శుక్రవారం గుంటూరులోన తన క్యాంప్ ఆఫీస్ వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రెస్‌మీట్‌లో అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..: గోడ దూకి పారిపొమ్మన్నారు: విడతల వారీగా తరలి వచ్చిన టీడీపీ మూకలు ఏడు గంటలపాటు నా ఇల్లు, కార్యాలయంపై దాడి చేసి, మొత్తం విధ్వంసం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు టీడీపీ శ్రేణులకు సహకరించడంతో పాటు, పూర్తిగా ప్రేక్షక పాత్ర వహించారు. చివరకు నా ఇంటికి నిప్పు పెడుతున్నా ఆ మూకలను కనీసం నిలువరించే ప్రయత్నం చేయలేదు. పైగా నన్ను గోడ దూకి పారిపొమ్మని సలహా ఇచ్చారు. ఇది అత్యంత హేయం. పోలీసులు తమ బాధ్యతను పూర్తిగా విస్మరించారు. నన్ను జైల్లో పెట్టాలన్న కుట్ర: టీడీపీ మూకలు అంత అరాచకం సృష్టించినా వారిని వదిలిన పోలీసులు, బాధితుడినైన నాపైనే చర్య తీసుకున్నారు. ఆరోజు అర్థరాత్రి నన్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత లాకప్‌లో నాపై భౌతిక దాడికి ప్రయత్నించారు. ఇంకా రిమాండ్ రిపోర్టులోనూ పచ్చి అబద్ధాలు రాశారు. నేను అనని మాటలను, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గాన్ని దూషించినట్లు సీఐ వంశీ తప్పుడు రాతలు రాశారు. ‘నా ఇద్దరు అల్లుళ్లు కమ్మ సామాజిక వర్గానికే చెందిన వారు. నేను కులాలను దూషించే వ్యక్తిని కాదు. కేవలం నన్ను జైల్లో పెట్టడానికే కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు’. నన్ను ఎలిమినేట్ చేయాలని రెడ్‌బుక్‌లో రాసుకున్నారు. ఆ దిశలోనే పోలీసుల సహకారంతో నన్ను చంపాలని చూశారు. అయితే ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకు పంపినా భయపడేది లేదు. చంపితే సమాధి నుంచైనా సాధిస్తాను తప్ప, చంద్రబాబును వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 7 గంటల పాటు టీడీపీ గుండాల కరాళ నృత్యం: నేను క్షమాపణ కోరినప్పటికీ సా.5 గం.కు గుంటూరులోని నా ఆఫీస్, ఇంటిపై టీడీపీ నాయకులు, మూకల దాడి మొదలైంది. పెదకూరపాడు, సత్తెనపల్లె, వినుకొండ తదితర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన మూకలు విడతల వారీగా వచ్చి విధ్వంసం సృష్టించారు. నా ఇంట్లో కుటుంబ సభ్యులు, కూతుళ్లు, మనవళ్లు అందరూ ఉండగానే దాడి, విధ్వంసం జరిగింది. అది ఏదో ఆవేశంతో చేసిన పని కాదు. పక్కా ప్రణాళికతో చేసిన పని. ఏకంగా 7 గంటల పాటు, నా ఆఫీస్, ఇంట్లో అన్నీ నాశనం చేశారు. ఆ పని చేస్తూ, టీడీపీ మూకలు కరాళ నృత్యం చేశారు. పోలీసుల అండతోనే ఆ దాడి జరిగింది. అలా రక్షించాల్సిన పోలీసులు, హింసకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ గూండాలు ఒక్కటయ్యారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడైనా ఇంత దారుణంగా జరిగిందా? ఎక్కడైనా ఇలాంటిది చూశామా? అసలు ప్రజాస్వామ్యంలో ఇది ధర్మమేనా?. నా ఇల్లు, ఆఫీస్ మీద ఆ స్థాయిలో దాడి జరుగుతుంటే, ఇక్కడే ఉన్న సీఐలు స్వయంగా పర్యవేక్షించారు. మరోవైపు విషయం తెలుసుకున్న మా పార్టీ శ్రేణులు వస్తుంటే, వారిని అడ్డుకుని కొట్టి పంపించారు. గంగా వెంకటేశ్వర్లు అనే సీఐ నా ఇంట్లోకి టీడీపీ గుండాలను తీసుకు రావడమే కాకుండా, నన్ను గోడ దూకి పారిపొమ్మని సలహా ఇచ్చాడు. పారిపోవడం కంటే చచ్చిపోవడం మేలని నేను ఆయన మాట వినలేదు. లాకప్‌లో భౌతిక దాడి: ఇక్కడ టీడీపీ గుండాలను వదిలిపెట్టిన పోలీసులు, బాధితుడినైన నాపైనే తప్పుడు కేసు పెట్టారు. దాదాపు అర్థరాత్రి సమయంలో అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత లాకప్‌లో ఉన్న నాపై ఆ రాత్రి 2.30 గం.కు లాకప్‌లో భౌతిక దాడికి ప్రయత్నించారు. శాసనసభ్యుడిగా, ఏపీఐఐసీ చైర్మన్‌గా, మంత్రిగా పని చేసిన నన్ను లాకప్‌లో కొట్టడానికి ప్రయత్నించారు. నేను ఇదే విషయాన్ని కోర్టులో కూడా చెప్పాను. దీనిపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తాను. రిమాండ్ రిపోర్టులో పచ్చి అబద్దాలు: నా రిమాండ్ రిపోర్టులో పోలీసులు పచ్చి అబద్ధాలు రాశారు. ‘చిల్లీ సెంటర్‌లో నేను రోడ్డు మీద వెళ్తున్న సాధారణ పౌరులను బెదిరిస్తూ బండబూతులు తిట్టానని, ఇంకా టీడీపీ క్యాడర్‌ను చంపుతానని బెదిరించానని రాశారు. కమ్మ కులానికి చెందిన వాళ్ల ఉంటే చంపేస్తాను అని అన్నానని.. రమ్మను కమ్మనా కొడుకులని అన్నానని, ఇంకా చెప్పడానికి వీలు లేని చాలా బూతుల మాట్లాడానని రాశారు. ఇంకా చంద్రబాబును కూడా కమ్మనా కొడుకు అని తిట్టానని రిమాండ్ రిపోర్టులో రాశారు. గల్లా రామచంద్రరావు, అబ్బూరి మల్లి, రాయపాటి అమృతరావు, కనపర్తి శ్రీనివాసరావు, ఇసుక బుజ్జి, వందనాదేవి, గొనుగొండ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నా ఇల్లు, ఆఫీస్‌పై దాడి జరిగింది. నిజానికి నేను ఏరోజు కూడా కమ్మ సోదరులను కులం పేరుతో తిట్టలేదు. కేవలం నన్ను జైలుకు పంపించడం కోసం ఏకంగా కులాల మధ్య చిచ్చుకు ప్రయత్నించారు. ఎవరు హీరో? ఎవరు విలన్?. ప్రజలే తేలుస్తారు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే 24 గంటల్లో నాకు సినిమా చూపిస్తానన్నాడు. పెద్ద సినిమా చూపించావు. నా ఇల్లు పగల గొట్టడంలో సినిమా చూపించావు. ఏకంగా 18 రోజులు సినిమా చూపించావు. నా కార్లు ధ్వంసం చేయడంలోనూ, నా ఆఫీసు పగల గొట్టడంలోనూ, నా భార్యా బిడ్డలు ఇంటిలో ఉంటే తరిమికొట్టడంలోనూ సినిమా చూపించావు. నన్ను లాకప్‌లో పడేయడంలోనూ, రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజులు వేయడంలోనూ సినిమా చూపించావు. బాగా డబ్బున్న వాడివి. మరి నువ్వు చూపించిన సినిమాలో ఎవరు హీరో? ఇళ్లు తగల బెట్టిన వాడు హీరోనా? లేదా 18 రోజులు జైల్లో ఉన్నవాడు హీరోనా? లేక జైళ్లో పెట్టించిన వాడు హీరో అవుతాడా?. ఇక్కడ ఎవరు హీరో. ఎవరు విలన్ అన్నది ప్రజలంతా గమనిస్తున్నారు. అనని మాటలు అన్నట్టు రాసిన వాడు విలానా? ఏమీ అనకుండా అపవాదు పడ్డవాడు విలనా? ఏం తొందర లేదు. పెమ్మసాని నెమ్మదిగా ఆలోచించుకో? అన్నింటికీ మూల్యం చెల్లించాల్సిన రోజు ఒకటి వస్తుంది. పైన భగవంతుడు ఉన్నాడు, ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా చూస్తున్నారు. అన్యాయాన్ని అన్యాయమని చెప్పే రోజు వస్తుంది. ఇవాళ ఆ గొంతు వినిపించకపోయినా.. తగిన సమయంలో వినిపిస్తుంది. తిట్టడానికి మీకు మాత్రమే లైసెన్స్ ఉందా పవన్?: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అసహ్యంగా మాట్లాడినందుకే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయంటున్నాడు. అంటే దాడులు చేస్తారా? కేసులు పెట్టరా? నేను తప్పుగా మాట్లాడిన దానికి పశ్చాత్తాప పడ్డాను. క్షమాపణ కోరాను. అయినా దాడులు చేస్తారా? దాడులును సమర్థించడం తప్పు పవన్‌కళ్యాణ్ గారూ? మీరు గతంలో అసహ్యంగా మాట్లాడలేదా? ఒక్కసారి గుర్తు చేసుకొండి జనసేన అధ్యక్షుడు గారూ? గతంలో మీరు.. వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అంటూ ఏకంగా వేదిక మీదే మాట్లాడుతూ, చెప్పు తీశారు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. మీరన్న దానికి అర్ధం తెలుసా? మీరు అన్నదానికి ఎప్పుడైనా పశ్చాత్తాపపడ్డావా? మీకు ఎవరినైనా తిట్టడానికి లైసెన్స్ ఉందా? ఏదో క్షణికావేశంలో మేం మాట తూలి, దానిపై క్షమాపణ చెప్పినా కూడా దాడి చేస్తారా? అన్యాయాన్ని అన్యాయం అనలేని నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రివా? నీకూ చంద్రబాబుకూ తేడా ఏం ఉంది? ముద్రగడ మీద దాడి టైంలో మీరెక్కడ నాగబాబూ?: మరోవైపు పవన్‌కళ్యాణ్ సోదరుడునాగబాబు మాట్లాడుతూ.. సీఎంను తిడితే జైల్లో పెట్టకుండా ముద్దు పెట్టుకుంటారా అని వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబుకు కాపు కులాన్ని ఆపాదిస్తారా? అని ప్రశ్నిస్తున్నాడు. నేను కాపు కాదా? సందర్భం వచ్చినప్పుడు కాపులు కోసం గొంతెత్తిన వాడిని నేను. ఒకప్పుడు చిరంజీవి సైతం గొంతెత్తాడు. కానీ పవన్‌కళ్యాణ్, నాగబాబు మాత్రం ఏనాడూ నోరు మెదపలేదు. ముద్రగడ పద్మనాభం కాపుల కోసం ఉద్యమం చేసినప్పుడు గొంతెత్తిన వాడు అంబటి రాంబాబు. చంద్రబాబు కాపులను బీసీల్లో చేరుస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ఆరోజు ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని శంఖాన్ని ఊదినప్పుడు అంబటి రాంబాబు గొంతెత్తాడు. కాపుల కోసం మీటింగ్ ఏర్పాటు చేస్తే. ఆరోజు దాసరి నారాయణరావు, చిరంజీవి హాజరయ్యారు. బొత్స సత్యనారాయణగారు ఆ మీటింగ్ కోఆర్డినేట్ చేశారు. తోట చంద్రశేఖర్, సి.రామచంద్రయ్య, పళ్లంరాజు, కన్నబాబు కూడా వచ్చి.. వంగవీటి మోహనరంగాను కోల్పోయాం. ఇంకా ముద్రగడను కోల్పోవడానికి సిద్ధంగా లేమని చెప్పారు. అదే విషయాన్ని చిరంజీవిగారు, దాసరి నారాయణరావుగారు కూడా మాట్లాడారు. మరి ఆరోజు మీరు ఎక్కడున్నారు నాగబాబుగారూ? ఎన్నిసార్లు ఫోన్ చేసినా పవన్‌కళ్యాణ్ దొరకడం లేదని ముద్రగడ పద్మనాభంగారు చెప్పారు. నేను కమ్మ వ్యతిరేకిని కాదు. నన్ను కాపు కాదన్న మీరు మాత్రమే కాపులా? కులం ప్రస్తావన తెచ్చింది మీరు. నేను కాదు: చంద్రబాబుని తిడితే కమ్మవారిని తిట్టినట్లా? మరి నన్ను తిట్టి, నా ఇళ్లు తగల బెడితే, నన్ను చంపడానికి ప్రయత్నిస్తే, నా కార్లు ధ్వంసం చేస్తే నేను కులం లేని అనాధనా? ఎవరూ రియాక్ట్ కారా? నన్ను తిడితే ఎవరికీ కోపం రాకూడదా? చంద్రబాబు మోచేతి నీళ్లు ఎన్నాళ్లు తాగుతారు? మీకు మంత్రి పదవి ఇస్తామని ఎగ్గొట్టినా మీరేం మాట్లాడరు. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందని గుర్తు పెట్టుకొండి. కులం లేదని మీరనుకుంటున్న నాక్కూడా ఒక రోజు వస్తుందని తెలుసుకొండి. నాక్కూడా ఒక కులం ఉందని గుర్తు పెట్టుకొండి. అసలు కులం ప్రస్తావన తీసుకొస్తుంది మీరు తప్ప నేను కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకొండి చంద్రబాబుగారూ? నా ఇంటికి వచ్చిన ఎస్పీని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మానిటరింగ్ చేసి వెళ్లిపొమ్మని చెప్పారు. టీడీపీ మూకలు నా ఇంటికి నిప్పు పెట్టి, గంటలకొద్దీ రౌడీయిజం చేస్తుంటే పోలీసులు కాపలా కాశారు. నన్ను 18 రోజుల పాటు జైల్లో పెట్టారు. అయినా నేను భయపడేది లేదు. విద్యార్ధి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. కష్టపడి పైకొచ్చాను. ఈ కేసుతో నన్ను భయపెట్టలేరు. 18 మాసాలు జైల్లో పెట్టినా నేను భయపడను. చెక్కుచెదరను. బాబు ‘కమ్మ’ని ప్రభుత్వానికి ‘కాపు’ కాస్తున్న పవన్: గతంలో గజ్జల మల్లారెడ్డిగారిని, ఎన్టీ రామారావు ప్రభుత్వం ఎలా ఉందని అడిగితే ఆయన ‘కమ్మ’గా ఉందని చెప్పారంట. ఇప్పుడు కూడా చంద్రబాబునాయుడు ప్రభుత్వం ‘కమ్మ’గా ఉందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చెప్పారు. చంద్రబాబునాయుడుగారి కమ్మని ప్రభుత్వానికి పవన్‌కళ్యాణ్ కాపు కాస్తున్నాడు. మమ్నల్ని చంపినా కాపు కాస్తావా పవన్‌కళ్యాణ్?. నీ బలం నీ కులమన్న విషయాన్ని గుర్తు పెట్టుకో. అలాగే చంద్రబాబు బలం కూడా నువ్వే అన్న విషయాన్ని మర్చిపోవద్దు. నా మీద దాడికి వచ్చిన మహిళ వందనాదేవిగారు ఏం మాట్లాడారో అందరూ చూశారు. నీకు వందనం తల్లి. నేను ఏ రోజూ రౌడీయిజం చేయలేదు. ఇక హోం మంత్రి మాట్లాడుతూ.. అంబటి రాంబాబుని ఎవరు తిట్టారు, చూపించండి చర్యలు తీసుకుంటాము అని మాట్లాడ్డం విడ్డూరం. జైలు నుంచి విడదలైన నేను రాజమహేంద్రవరం నుంచి ఇక్కడికి వస్తుంటే పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. సెక్షన్–30, నిబంధనలతో అడ్డు తగిలారు. మరి టీడీపీ గుండాలు నా ఇల్లు, ఆఫీసుపై దాడి చేసి, విధ్వంసం సృష్టించి, చివరకు నా ఇంటికి నిప్పు పెట్టినప్పుడు ఈ చట్టాలన్నీ ఏమయ్యాయి? దీనికి ప్రభుత్వం సమాధానం చెబుతుందా? అని అంబటి రాంబాబు నిలదీశారు.