తాడేపల్లి: టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కోరిందే తడవుగా జేసీబీలు తెప్పించి 24 గంటల్లోనే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల భవనంపై ఉన్న దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును తొలగించడంపై వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మండిపడ్డారు. ఇంజనీరింగ్ కాలేజీకి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైయస్సార్ మరణానంతరం గౌరవ సూచికంగా ఆయన భూమి పూజ చేసిన కాలేజీకి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలగా పేరు పెట్టిందని, అది కూడా ఏకపక్షంగా కాకుండా నాటి వీసీ ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో 11 మందితో కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. దీంతోపాటు రీసెర్చ్ స్కాలర్స్‌కి ఇచ్చే ఫెలోషిప్‌లను కూడా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి రీసెర్చ్ ఫెలోషిప్‌ల పేరిట ఇస్తున్నారని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం తెలుగుదేశం విద్యార్థి విభాగం కోరిన వెంటనే దివంగత ముఖ్యమంత్రి పేరును ఏకపక్షంగా తొలగించడాన్ని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. దీనిపై ఇన్‌చార్జి వీసీ, రిజిస్ట్రార్‌ను ప్రశ్నిస్తే పాలకమండలిలో తీర్మాణం చేసి అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)కి పంపించామని చెబుతున్నారే కానీ ఆ కాపీ అడిగితే ఇవ్వకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా వైయస్సార్ పేరును తొలగించి దానికి ఏఐసీటీఈపై నెపం మోపుతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో వైయస్సార్ పేరుతో ఎక్కువగా విద్యాసంస్థలు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు కౌన్సిలింగ్‌లో వెబ్ ఆఫ్షన్లు పెట్టుకోవడానికి గందరగోళానికి గురవుతున్నారని చెప్పడం చూస్తుంటే కుట్రపూరితంగానే వైయస్సార్ పేరును తొలగించారని అర్థమవుతుందని వివరించారు. ఏపీలో యూనివర్సిటీకి పేరు పెట్టడానికి ఏఐసీటీఈతో సంబంధం ఏముందని, 15 ఏళ్లుగా విద్యార్థులకు లేని ఇబ్బంది కొత్తగా ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. నాడు వైయస్సార్ పేరు పెట్టడానికి చేసిన తీర్మాణం కాపీని చూపించిన రవిచంద్ర, ఇప్పుడు పేరు తొలగించడానికి చేసిన తీర్మాణం కాపీ చూపించాలని యూనివర్సిటీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. చాలా కాలంగా ఏఎన్‌యూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో యథేచ్చగా జరుగుతున్న అక్రమాలను అరికట్టడం చేతకాని ఇన్‌చార్జి వీసీ గంగాధర్.. టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కోరిన వెంటనే వైయస్సార్ పేరును తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌చార్జి వీసీ గంగాధర్, రిజిస్ట్రార్ సింహాచలం లు టీడీపీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తూ విద్యాసంస్థల్లో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని రవిచంద్ర ఆరోపించారు. ఇటీవల నారా లోకేష్ పుట్టినరోజు సందర్బంగా యూనివర్సిటీ విద్యార్థులను తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రక్తదానం నిర్వహించారని వెల్లడించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును యథాతథంగా కొనసాగించాలని రవిచంద్ర డిమాండ్ చేశారు.